రుధిరదారులు
పాలమూరు రహదారులు రక్తమోడుతున్నాయి. రోజుకు ఒకరిద్దరి చొప్పున మృత్యువుబారిన పడుతున్నారు. మద్యం సేవించి వాహనాలను నడపడం, వాహనాలను ఓవర్ టేక్ చేయడం, ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం.. వంటి కారణాలు నిండుప్రాణాలను మృత్యుదరికి చేరుస్తున్నాయి. కన్నవారు, ఆత్మీయులను పొగొట్టుకుని బాధిత కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. ఎంతోమంది కాళ్లూచేతులు విరగ్గొట్టుకుని మంచానికే పరిమితమవుతున్నారు.
-సాక్షి, మహబూబ్‌నగర్
జిల్లాలో ఏటా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి జరిగిన 1117 ప్రమాదాల్లో 599 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 1027 మంది తీవ్రంగా గాయపడ్డారు. సరాసరిగా రోజుకు ముగ్గురు చొప్పున మరణిస్తుండగా.. ఆరుగురి చొప్పున తీవ్రంగా గాయపడుతున్నారు. ఈ ఏడాది ఎనిమిది నెలల కాలంలో అత్యధికంగా మేలో ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో అత్యధికంగా 44వ జాతీయ రహదారి, జడ్చర్ల- రాయిచూరు ప్రధాన రహదారులపైనే ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. జిల్లా పరిధిలో జాతీయ రహదారి దాదాపు 180 కి.మీ మేర విస్తరించి ఉంది. నాలుగులేన్ల రహదారిగా ఉన్న జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల నివారణకు నేషనల్ హైవే అథారిటీ, పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. వాహనదారులకు అవగాహన కోసం ఎక్కడిక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టడం, వేగం నియంత్రణ కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. అలాగే జాతీయ రహదారిపై ఉన్న గ్రామాల వారు కూడా ప్రమాదాల బారినపడి చనిపోతున్నారు. రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చే వాహనాలు ఢీకొట్టి వెళ్లిపోతున్నాయి. తాజాగా మాచారం గేట్ వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు.
ఆగస్టు 1న జేపీ దర్గా బైపాస్ కూడలీలో రెండు క్వాలీస్ వాహనాలు ఢీ కొన్న సంఘటనలో హైదరాబాద్ బండ్లగూడకు చెందిన షాహీదాబేగం(8) మృతిచెందింది.
ఆగస్టు 8న పెంజర్ల బైపాస్ కూడలీలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి.
సెప్టెంబర్ 6వ తేదిన ఐఓసీఎల్ పెట్రోల్ బంకు వద్ద బైకును కారు ఢీకొన్న ఘటనలో కేశంపేట మండలానికి చెందిన కానీస్టేబుల్ రాములు(40) అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆటో ప్రమాదాలే అధికం
జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ప్రాణనష్టం ఆటో ప్రమాదాల వల్లే చోటుచేసుకుంటున్నట్లు పోలీసుల రికార్డు చెబుతోంది.
జడ్చర్ల- రాయిచూర్ ప్రధాన రహదారిలో అత్యధికంగా ఆటో ప్రమాదాలే జరుగుతున్నాయి. పరిమితికి మించి ఎక్కువ మందిని ఎక్కించుకోవడం, చాలామంది ఆటో డ్రైవర్లకు లెసైన్స్ లేకుండా నడపడం. మితిమీరిన వేగంతో ప్రమాణించడం వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయి.
ఆటోలో ప్రయాణించి ప్రాణాలు కోల్పోతున్న వారిలో అత్యధికంగా సామాన్యులే ఉంటున్నారు. మాగనూరు మండలం వడ్వాట్‌కు చెందిన వలస కూలీలు సమగ్ర కుటుంబ సర్వే కోసం స్వగ్రామానికి వచ్చింది. సర్వే తర్వాత ఆగస్టు 21న తిరుగు ప్రయాణమైన వారి ఆటోను లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే ఏడుగురు మృత్యువాతపడ్డారు. అలాగే ఆగస్టు 25న జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్ వస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. తరుచూ ఇలా ఆటో ప్రమాదాల బారిన అధికప్రాణనష్టం చోటుచేసుకుంటుంది.