సాక్షి, సిటీబ్యూరో: రాజకీయ కారణాలతో ఆవిష్కరణలకు నోచుకోకుండా ముగ్గురు మహనీయుల విగ్రహాలు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చిపోయే వారికి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఏర్పా టు చేసిన విగ్రహాలు ఇంకా అలాగే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, జీహెచ్‌ఎంసీ ఏర్పాటుతో పాటు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కారకుడైన స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేయాలని అప్పటి పాలకవర్గం నిర్ణయించి విగ్రహాన్ని సిద్ధం చేశారు. అయితే ఆవిష్కరణ జరిగేలోగా రాజకీయ సమీకరణలు మారడంతో ఆవిష్కరణ కార్యక్రమం నిలిచిపోయింది. వైఎస్ విగ్రహాన్ని అక్కడ ఉంచరాదనే తలంపుతో గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను కూడా రాజకీయానికి వాడుకోవడంతో ముగ్గురు మహనీయుల విగ్రహాలు దిక్కూమొక్కూ లేకుండా,ఎవరికీ పట్టనట్లుగా మిగిలాయి. వివరాల్లోకి వెళితే.
పాలకమండలి పట్టుపట్టి..
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం గ్రేటర్‌కు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అప్పటి కాంగ్రెస్ కార్పొరేటర్లు పట్టుబట్టి విగ్రహం నెలకొల్పాలని నిర్ణయించారు. 2010 జులైలో వైఎస్సార్ జయంతి సందర్భంగా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. సెప్టెంబర్‌లో ఆయన వర్థంతి నాటికి విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించినప్పటికీ ఆలోగా పనులు పూర్తికాక పోవడంతో వీలుపడలేదు. విగ్రహం పూర్తయ్యాక ఆవిష్కరణకు ఏర్పాట్లు జరుగుతుండగా, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఫ్లోర్‌లీడర్ నేతృత్వంలో మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలను వైఎస్ విగ్రహం కంటే తక్కువ ఎత్తువి తెచ్చి వైఎస్ విగ్రహానికి దిగువన ఉంచడంతో ఆవిష్కరణలు ఆగిపోయాయి.
దీంతో మూడు విగ్రహాలను ముసుగులతో కప్పేశారు. ఆ తర్వాత అప్పటి మేయర్ బండ కార్తీకరెడ్డి వైఎస్ విగ్రహావిష్కరణకు ప్రయత్నించారు. ఎవరి గౌరవానికీ భంగం వాటిల్లకుండా ఉండేందుకు మూడు విగ్రహాలను జీహెచ్‌ఎంసీ ఆవరణలోనే వేర్వేరు చోట్ల ప్రతిష్టించాలని నిర్ణయించి స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందారు. రోజులు గడిచినా ఆచరణకు నోచుకోలేదు. ఆ తర్వాత 2011లో వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించడంతో నగరానికి చెందిన అప్పటి కాంగ్రెస్ మంత్రి సైతం అక్కడ విగ్రహం ఏర్పాటు చేయరాదని భావించినట్లు ఆరోపణలొచ్చాయి. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంతో రాష్ట్రంలో, జీహెచ్‌ఎంసీ పాలకమండలిలో టీఆర్‌ఎస్ కొలువుదీరింది. ఈ నెల 2న వైఎస్ పదో వర్థంతి సందర్భంగానైనా ప్రభుత్వం ,జీహెచ్‌ఎంసీ పాలకమండలి తెరలు తొలగించాలని పలువురు కోరుతున్నారు.
టీడీపీ రాజకీయం..
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ ప్రవేశద్వారం ఎదుట వైఎస్ విగ్రహాన్ని ప్రతిష్టించకుండా ఉండేందుకు అప్పటి టీడీపీ ఫ్లోర్‌లీడర్ మహాత్మాగాంధీ, అంబేద్కర్‌ల విగ్రహాలను తెప్పించడమే కాకుండా జగ్జీవన్‌రామ్, జ్యోతిరావుపూలే, ఎన్టీఆర్, ఒవైసీలవి కూడా ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. ఒవైసీ పేరు ప్రతిపాదించడంతో ఎంఐఎం మద్దతిస్తుందని భావించారు. అయితే ‘రాజకీయం’ అర్థం చేసుకున్న ఎంఐఎం నేతలు ఆ ఆలోచనను సున్నితంగానే తిరస్కరించారు.
ముసుగు తొలగిస్తాం..
విగ్రహాల ముసుగు తొలగించేందుకు ప్రయత్నిస్తాం. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, అందరి ఆమోదంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం .
–బొంతు రామ్మోహన్, మేయర్
ఇంకా జాప్యం తగదు
మహానేతల విగ్రహాలను ఏళ్లతరబడి ఆవిష్కరించకుండా ఉంచడం తగదు. విగ్రహాల ఎత్తు, తదితర కారణాల వల్ల మూడూ ఒకే చోట కాకుండా వేర్వేరుస్థలాల్లో ఉంచి ఆవిష్కరించవచ్చు.
– బండ కార్తీకరెడ్డి , మాజీ మేయర్
Comments
Please login to add a commentAdd a comment