కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లిలో వదంతులు నమ్మవద్దని చెబుతున్న ఎస్‌ఐ మురళి
డిచ్‌పల్లి/కమ్మర్‌పల్లి/ధర్పలి : రెండుమూడు రోజులుగా మహారాష్ట్ర, బీహార్‌లకు చెందిన దోపిడీ దొంగలు సంచరిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ కావడంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ పోస్టులను నమ్మవద్దని వట్టి పుకార్లుగానే పోలీసులు స్పష్టం చేస్తున్నారు. రాత్రి పూట చిన్న పిల్లల ఏడ్పులు విన్పిస్తే బయటకు రావద్దని, అలా వచ్చే వారిపై కత్తులు, ఇనుపరాడ్లతో దాడి చేసి ఇళ్లంతా దోచుకుంటారని, అడ్డువస్తే చంపివేస్తారని పుకార్లు షికారు చేస్తున్నాయి. చిన్న పిల్లలను ఎత్తుకెళ్లి హతమార్చి అవయవాలు అమ్ముకుంటారని పెట్టిన పోస్టులతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు రాత్రయిందంటే చాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. దొంగల భయం తో కొన్ని గ్రామాలు, తండాలలో యువకులు కర్రలు చేతబట్టుకుని రాత్రంతా గస్తీ తిరుగుతున్నారు.
కమ్మర్‌పల్లి మండలంలోని కోనాపూర్, పరిధిలోని కొత్త చెరువు, వాసంగట్టు తండా, నర్సాపూర్, పరిధిలోని సోమిడి రాగిడి, ఉక్లానాయక్ తండా, అమీర్నగర్, పరిధిలోని బిలియానాయక్ తండా, దొమ్మర్‌చౌడ్ తండాలు, చౌట్‌పల్లి గ్రామాల్లో వదంతులు జోరందుకోగా కొన్ని గ్రామాల్లో గ్రూపులుగా ఏర్పడి గస్తీ కాచారు. విష యం తెలుసుకున్న ఎస్‌ఐ మురళి సిబ్బందితో సోమవారం గ్రామాల్లో పర్యటించారు. వదంతు లు నమ్మవద్దని కోరారు. ఎవరైనా అనుమానితు లు కనిపిస్తే పట్టుకొని కొట్టవద్దని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు మైక్ లో ప్రచారం నిర్వహించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు పాల్పడితే చట్టప్రకారం చర్య లు తీసుకుంటామని డిచ్‌పల్లి ఎస్సై నవీన్‌కుమార్ పేర్కొన్నారు. దోపిడీ దొంగల పుకార్లను ఎవరూ పోస్టుచేశారనే విషయమై విచారణ జరుపుతున్నామన్నారు.ప్రజలను భయానికి గురిచేసే పుకార్లను, ఫొటోలను షేర్ చేస్తున్న వారిని గుర్తిం చి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
వదంతులను నమ్మవద్దు
ధర్పల్లి మండలంలోని దమ్మన్నపేట, రేకులపల్లి, బోయిన్‌పల్లి గ్రామాలతో పాటు పలు తండాల్లో సోమవారం రాత్రి ఎస్సై పునేశ్వర్ ప్రజలతో అవగాహన సభలను నిర్వహించారు. గ్రామాల్లో ఎలాంటి ముఠాలు సంచరించడం లేదని, పోలీసులు రాత్రి వేళలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెం దిన ప్రజాప్రతినిధులు , మహిళల, యువకులు , గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment