అయినా..గల్ఫ్‌కే పోతాం..!
♦ స్థానికంగా ఉపాధి లేక ఎడారి దేశానికి
♦ హైదరాబాద్ శివార్లలో ఇంటర్వ్యూలు
♦ రెండు వేల మంది అభ్యర్థుల హాజరు
♦ 1,280 మంది ఎంపిక
సిరిసిల్ల : తెలంగాణ జిల్లాలోని గ్రామీణ యువతకు గల్ఫ్‌పై మోజు తగ్గడం లేదు. అక్కడికి వెళ్లిన వారు పడుతున్న ఇబ్బందులు రోజుకు ఒకటి వెలుగులోకి వస్తున్నా.. గల్ఫ్ వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు. అక్కడ ఎన్ని ఇబ్బందులున్నా.. ఇక్కడ ఉపాధి లేకపోవడంతో వారిని గల్ఫ్ బాట పట్టిస్తోంది.శుక్రవారం హైదరాబాద్ శివారు శామీర్‌పేట, తూంకుంట వద్ద ఉన్న ఓ ఫంక్ష¯Œ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన ఇంటర్వ్యూలకు సుమారు రెండు వేల మంది యువకులు హాజరైనట్లు తెలుస్తోంది. ఇందులో 1,280 మందిని ఎంపి క చేసినట్లు సమాచారం.
గల్ఫ్ ఇంటర్వ్యూలకు హాజరైన వారంతా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారే ఉన్నారు. జగిత్యాలకు చెందిన ఓ ఏజెంట్ వద్ద పనిచేసే 150 మంది సబ్ ఏజెంట్లు వాహనాల్లో యువకులను ఇంటర్వ్యూలకు తరలించారు. ఒక్కో అభ్యర్థి వద్ద రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు కమీషన్ దండుకుంటూ దందా సాగిస్తున్నారు. వీసాలో మోసాలున్నా.. ఆ తర్వాత ఏమైనా సబ్‌ఏజెంట్‌కు ఎలాంటి సంబంధం ఉండదు.
కానీ, యువకులను పాస్‌పోర్టులు, ఫొటోలతో తీసుకెళ్లి ఇంటర్వ్యూ చేయించారు. ఈ ఇంటర్వ్యూల్లో ఎంపికైన 1,280 మందికి నెల రోజుల్లో వీసాలు జారీ కానున్నాయి. వీసా కోసం ఒక్కొక్కరి వద్ద రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. నిజానికి వీసా ధర నిబంధన ప్రకారం అన్ని ఖర్చులు కలుపుకొని రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు ఉంటుంది. కానీ, సబ్ ఏజెంట్లు కమీషన్ కోసం ధర పెంచి యువకులను మోసం చేస్తున్నారు. ఒక్కరోజే రూ.10.50 కోట్ల దందా సాగిందని సమాచారం .
స్థానికంగా కాకుండా..
సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, ఆర్మూర్ ప్రాంతా ల్లో గల్ఫ్ ఇంటర్వ్యూలపై పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో హైదరాబాద్ శివారులోని ఫంక్షన్ హాల్, గార్డెన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలుస్తోంది. నెలరోజుల్లో వీరికి వీసాలు ఇచ్చి పంపించనున్నట్లు సమాచారం.