-
నేడు ప్రవాసీవిధానంపై హైదరాబాద్‌లో సమావేశం
-
హాజరుకానున్న గల్ఫ్‌దేశాల ప్రతినిధులు
-
మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష
సిరిసిల్ల/రాయికల్ వలస జీవుల బతుకులు దుర్భరంగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించడంతో వారి కుటుంబాలు కష్టాలకడలిలో కొట్టుమిట్టాడుతున్నాయి. తెలంగాణ జిల్లాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్‌దేశాలకు వెళ్లడం నాలుగు దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది గల్ఫ్‌లో వివిధ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. ఏటా రూ.పది వేల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని దేశానికి ఆర్జించి పెడుతున్నారు. పన్నుల రూపంలో రూ.వెయ్యి కోట్ల ఆదాయం ఖజానాకు చేరుతోంది. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రవాస తెలంగాణ కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వాలు కొంతైనా వెచ్చించాల్సిన అవసరం ఉంది. వలస జీవుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. కొత్త విధానాలు రూపొందించడం కోసం బుధవారం హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రవాసీ వ్యవహారాల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంపై ప్రవాసీయులు గంపెడాశలు పెట్టుకున్నారు.
గల్ఫ్‌దేశాల్లో ఉపాధి పొందుతున్న కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవాసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. 2012లో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ శాఖ బాధ్యతలు నిర్వహించారు. కొన్ని రోజులపాటు జిల్లా కేంద్రాల్లో ఎన్నారై హెల్ప్‌డెస్క్‌లు నిర్వహించారు. కానీ ఆ శాఖకు నిధులు కేటాయించకపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. అప్పట్లో వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. అయితే కొన్ని కుటుంబాలకు ఇప్పటి వరకు ఆర్థిక సాయం దక్కలేదు. గల్ఫ్ దేశాల్లోని వలసజీవులపై పలు అధ్యయనాలు నిర్వహించారు. కానీ.. క్షేత్రస్థాయిలో కష్టాల్లో ఉన్న వారిని ఏమాత్రం ఆదుకోలేకపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రి కె.తారకరామారావు దుబాయి వెళ్లారు. అక్కడ తెలంగాణ వలస కార్మికులు నివాసం ఉండే ప్రాంతాల్లో పర్యటించి సంక్షేమంపై చర్చించారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ ప్రవాస తెలంగాణ కార్మికులు, కుటుంబాల (నాన్ రెసిడెంట్ తెలంగాణైట్స్) మంత్రిత్వ శాఖను చూస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆధీనంలో ఉన్న ఈ శాఖను బలోపేతం చేసేందుకు బుధవారం సమావేశం నిర్వహిస్తున్నారు.
కేరళ, పంజాబ్ విధానాలు ఆదర్శం
ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లిన కార్మికుల సంక్షేమానికి కేరళ, పంజాబ్ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆ రాష్ట్రాల్లో ప్రవాసీయుల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖలున్నాయి. తెలంగాణలో ప్రవాస మంత్రిత్వశాఖ ఉన్నా.. సాధారణ పరిపాలనశాఖ(జీఏడీ) పరిధిలో కొనసాగుతోంది. జీఏడీని ముఖ్యకార్యదర్శి నిర్వహిస్తున్నారు. జీఏడీలో అనేక విభాగాలు ఉండడంతో ఎన్‌ఆర్‌టీ (నాన్ రెసిడెంట్ తెలంగాణైట్స్) అంశాలపై దృష్టి సారించలేకపోతున్నారు. జిల్లా స్థాయిలోనూ ప్రత్యేక ఆఫీసులు లేవు. దీంతో పరిపాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. జిల్లాల కలెక్టర్లు సైతం దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. కేరళలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండగా.. ప్రత్యేకంగా అధికారులను నియమించి వలస కార్మికుల సంక్షేమానికి అక్కడి ప్రభుత్వం కృషి చేస్తోంది. గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తోంది. విదేశాలకు వెళ్లిన వారికి జీవిత బీమా, ఆరోగ్యబీమా సదుపాయం కల్పిస్తోంది. వలస కార్మికుల గుర్తింపు కార్డులు, ఎంచుకున్న రంగంలో నైపుణ్య శిక్షణ, విదేశాలకు వెళ్లే వారికి ముందుస్తు అవగాహన కల్పిస్తోంది. కార్మికుల కుటుంబాల సంక్షేమానికి ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఏ కారణం చేతనైనా కార్మికులు తిరిగి వస్తే.. వారికి పునరావాసం కల్పించడం, మరణించిన సందర్భాల్లో కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తోంది. తెలంగాణకు చెందిన అధికారులు ఈ విషయమై కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేశారు. అక్కడి విధానాలు అమలు చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకుంటే సచివాలయంలో ప్రత్యేక ఐఏఎస్ అధికారి ఏర్పాటుతోపాటు జిల్లా కేంద్రాల్లోనూ ఎన్‌ఆర్‌టీ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.
మంత్రి కేటీఆర్‌పై ఆశలు..
సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావుకు గల్ఫ్ కార్మికుల బతుకుచిత్రంపై పూర్తిస్తాయి అవగాహన ఉంది. దుబాయిలోనూ కార్మికులు నివాసం ఉండే ప్రాంతాల్లో పర్యటించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వలస కార్మికుల బతుకులకు భరోసా ఇచ్చే విధంగా, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విధానాలను రూపొందిస్తారని ఆశిస్తున్నారు.
కార్మికుల సమస్యలు.. డిమాండ్లు
– సచివాలయంలో ఉన్న ఎన్నారై సెల్‌ను అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలి
– విదేశాల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.
– రాష్ట్రం నుంచి విదేశాలకు వలస వెళ్లిన వారి వివరాలు సేకరించడానికి సమగ్ర సర్వే నిర్వహించాలి.
– సర్వేలో వలసలకు కారణాలు, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వలస వెళ్లిన వారి సంఖ్య, వారి విద్యార్హతలు, సాంకేతిక పరిజ్ఞానం, వయస్సు, ఏయే జిల్లాల వారు ఏయే దేశాలకు వలస వెళ్తున్నారనే విషయాలు తెలుస్తాయి. ఈ సర్వే ఆధారంగా వారి సంక్షేమానికి తగిన ప్రణాళికలు వేసే అవకాం ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో విదేశీ వలసలపై అధ్యన కేంద్రాలు నెలకొల్పాలి.
– విదేశాలకు వలస వెళ్లే కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రవాసీ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వసల వెళ్లే కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్య సదస్సులు నిర్వహించాలి.
– కేరళ తరహాలో ప్రవాసీల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఇన్సూరెన్స్‌ను కల్పించాలి. విదేశాలకు వెళ్లే కార్మికులకు జీవిత బీమా, ఆరోగ్యబీమా, పింఛన్ సౌకర్యాలు కల్పించాలి. విదేశాల నుంచి అనుకోకుండా తిరిగి వచ్చిన వలస కార్మికులకు పునరావాసం కల్పించలి.
– ప్రవాసీయుల అనుభవం, వృత్తి నైపుణ్యాన్ని రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకోవాలి. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(న్యాక్) కేంద్రాలు బలోపేతం చేయాలి. నైపుణ్య శిక్షణ కేంద్రాలు ప్రతి సబ్‌డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలి.
– వలసపోయిన వారి పేర్లను రేషన్‌కార్డుల నుంచి తొలగించొద్దు.
– మానవ అక్రమ రవాణాను అరికట్టాలి, రిక్రూటింగ్ వ్యవస్థపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలి.
– ఏజెంట్లను నియంత్రించాలి. గల్ప్ జైళ్లలో మగ్గుతున్న వారికి న్యాయ సహాయం చేసి వారి విడుదలకు కృషిచేయాలి.
– విదేశాల్లోని భారతీయుల కోసం తక్షణం స్పందించే ఆన్‌లైన్ వ్యవస్థ ‘మదద్’(కాన్సులార్ గ్రీవెన్సెస్ మేనేజ్‌మెంట్ సిస్టం) ప్రవాసీ కుటుంబాలకు అందుబాటులోకి తీసుకురావాలి.
– ఈ విషయంపై రాష్ట్రంలోని అన్ని మీసేవా కేంద్రాల ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వాలి. ఎంబసీలలో తెలుగు అధికారులను నియమించాలి.
– హైదరాబాద్‌లో సౌదీ ఎంబసీ ఏర్పాటు చేయాలి. ప్రవాసీ బీమా యోజనలో జీవిత బీమాను చేర్చాలి. రెనివల్ సౌకర్యం కల్పించాలి. ప్రస్తుతం ఈ పథకం ఈసీఆర్ పాస్‌పోర్ట్ కలిగిన వారికి మాత్రమే ఇస్తున్నారు. ఈసీఎన్‌ఆర్ పాస్‌పోర్టు హోల్డర్స్‌కు కూడా ఇవ్వాలి.
కేరళ పాలసీ రూపొందించాలి
– జువ్వాడి శ్రీనివాసరావు, గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, దుబాయి
ప్రవాస మంత్రి కేటీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గల్ఫ్ కార్మికుల సమస్యల సాధన కోసం ఎన్‌ఆర్‌ఐ పాలసీ రూపకల్పన చేయడం అభినందనీయం. ముఖ్యంగా కేరళ తరహాలో సత్వర నిర్ణయాలు తీసుకుని గల్ఫ్ దేశాల్లో కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలి.
సమస్యలపై నివేదిక సమర్పిస్తాం
– రాజాశ్రీనివాసరావు, దుబాయి
యూఏఈలో తెలంగాణ రాష్ట్రానికిచెందిన కార్మికులు పడుతున్న బాధలపై ఇటీవల సర్వే నిర్వహించాం. కార్మికులు పడుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ఏ విధంగా చొరవ చూపాలో నివేదికరూపంలో మంత్రి కేటీఆర్‌కు అందజేయడానికి దుబాయ్ నుంచి వస్తున్నాం.
అమలులో జాప్యం చేయవద్దు
– మంద భీంరెడ్డి, ప్రవాసిమిత్ర అధ్యక్షుడు
గల్ఫ్ కార్మికుల సమస్యల సాదన కోసం మంత్రి కేటీఆర్ ఈనెల 27న ఎన్‌ఆర్‌ఐ పాలసీ రూపకల్పన చేయడంతో పాటు దాని అమలులో జాప్యం చేయవద్దు. ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి ఒక్కటి అమలు చేయాలి.