ఎన్నికల చిక్కులో రబీ ‘పెట్టుబడి’ పంపిణీ | Rythu Bandhu Investment money is in Confusion | Sakshi
Sakshi News home page

ఎన్నికల చిక్కులో రబీ ‘పెట్టుబడి’ పంపిణీ

Published Sat, Sep 8 2018 3:25 AM | Last Updated on Sat, Sep 8 2018 3:25 AM

Rythu Bandhu Investment money is in Confusion - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రబీలో రైతుబంధు పెట్టుబడి సొమ్ము పంపిణీపై ఎన్నికల చిక్కుముడి పడి వ్యవసాయశాఖ గందరగోళ పడుతోంది. రాష్ట్ర అసెంబ్లీ రద్దుకావడం ,ఈ డిసెంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్‌ చెబుతుండటంతో రైతులకు పెట్టుబడి సొమ్ము పంపిణీ సజావుగా జరుగుతుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. రబీ పెట్టుబడి సొమ్మును నవంబర్‌లో పంపిణీ చేస్తామని స్వయంగా సీఎం చెప్పారు. నిధులనూ మంజూరు చేశారు. అయితే అప్పటికే ఒకవేళ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తే నవంబర్‌లో రైతులకు ఈ చెక్కుల పంపిణీ ఎలా చేస్తారని పలువురు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

ఇది కొనసాగుతున్న పథకమే అయినా రైతులకు ఆర్థికంగా లబ్ధి జరుగుతున్నందున ఎన్నికల కమిషన్‌ ఒప్పుకుంటుందా లేదా అన్న చర్చ వ్యవసాయశాఖలో నెలకొంది. కీలకమైన ఎన్నికల సమయంలో ప్రభుత్వం 58 లక్షల మంది రైతులకు అంటే అంతమంది ఓటర్లకు చెక్కులు పంపిణీ చేయడాన్ని ఎన్నికల కమిషన్‌ ఎలా తీసుకుంటుందోనని అంటున్నారు. గత ఖరీఫ్‌లో చెక్కుల పంపిణీని టీఆర్‌ఎస్‌ వర్గాలు ధూంధాంగా జరిపాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేలు లేకపోయినా టీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్సీలు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులు వీటి పంపిణీని నిర్వహిస్తే అది ఎన్నికల కార్యక్రమంలా ఉంటుందంటున్నారు. మరోవైపు ఈ పంపిణీకి ప్రతిపక్షాలు కూడా రైతులనుంచి వ్యతిరేకత రావచ్చన్న భయంతో అడ్డుకోకపోవచ్చు.ఈ నేపథ్యంలో అక్టోబర్‌ నుంచే రబీ సాగు మొదలు కానున్నందున నవంబర్‌కు ముందే చెక్కులు ఇస్తారనే వాదనలూ ఉన్నాయి. 

కార్డులుండవ్‌... చెక్కులే 
ఖరీఫ్‌ కోసం మొత్తం 58.16 లక్షల మంది పట్టాదారులకు 58.81 లక్షల చెక్కులు ముద్రించారు. ఇందులో 51.11 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. 7.70 లక్షల చెక్కులు పంపిణీ కాలేదు. ఇప్పుడు సాగు చేసిన వారికే కాకుండా ఖరీఫ్‌లో ఇచ్చిన వారందరికీ రబీలోనూ చెక్కులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఖరీఫ్‌లో సాధారణ సాగు 1.08 కోట్ల ఎకరాలైతే, రబీలో కేవలం 31.92 లక్షల ఎకరాలే. అంటే ఖరీఫ్‌ సాగులో మూడో వంతు కంటే తక్కువే రబీలో సాగవుతాయి. అయితే ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి, మిర్చి పంట రబీలోనూ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పంటల సాగు విస్తీర్ణంతో సంబంధం లేకుండా రబీలోనూ ఖరీఫ్‌లో ఇచ్చిన రైతులందరికీ పెట్టుబడి సాయం చేయాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది.

బడ్జెట్‌లోనూ ఆ మేరకు రూ. 12 వేల కోట్లు కేటాయించింది. అయితే ఖరీఫ్‌లో ముద్రించిన చెక్కులు తీసుకోకుండా ఉన్న రైతులకు రబీలో ఇచ్చే అవకాశం లేదన్న వాదనలున్నాయి. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాలి. ఇదిలావుంటే రెండో విడత రైతుబంధు సొమ్మును ఎలా పంపిణీ చేయాలన్న దానిపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రబీలో చెక్కులకు బదులు బ్యాంకు కార్డులను ఇవ్వాలని గతంలో సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే చెక్కుల పంపిణీని గ్రామాల్లో పండుగగా చేయడం, చెక్కులపై ఎవరికి ఎంతెంత వచ్చిందో స్పష్టంగా కనిపించడంతో సర్కారుకు భారీ ప్రశంసలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు కార్డులు ఇస్తే ఆ ప్రచారం వచ్చే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. కాబట్టి ఇప్పుడూ చెక్కులనే ఇస్తారంటున్నారు. ఏమైనా పెట్టుబడి సొమ్ముపై ఎన్నికల కమిషన్‌ ఎలా స్పందిస్తుందన్న దానిపైనే పంపిణీ ఆధారపడి ఉంటుంది.   

అధికారుల జాబితా ఇవ్వండి: సీఈఓ 
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సరైన సమయంలో ఎన్నికలు నిర్వహిస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకే అధికారుల బదిలీలు ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ప్రత్యేకంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవారు సొంత జిల్లాలో ఉండవద్దని ఆయన స్పష్టంచేశారు. ఒకే జిల్లాలో వరుసగా మూడేళ్ళుగా పనిచేస్తున్న వారిని బదిలీ చేయాల్సి ఉంటుందని వివరించారు. 2018 డిసెంబర్‌ 31 నాటికి వరుసగా మూడేళ్లు పూర్తయ్యేవారికి ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు.  

రోగుల ఆహార చార్జీల పెంపు 
సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందే రోగులకు ఇచ్చే ఆహారపదార్థాల చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు ఆహారానికి రూ.40 ఖర్చుచేస్తుండగా, ఇప్పుడు రూ.80 చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.

లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన అసిస్టెంట్‌ ఇంజనీర్‌ 
సాక్షి, హైదరాబాద్‌: ఓ కాంట్రాక్టర్‌ వద్ద రూ.20వేల లంచం తీసుకుంటూ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ మురళి సీబీఐ అధికారులకు చిక్కారు. శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో సీబీఐ నిర్వహించిన తనిఖీల్లో ఆయన రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement