రైతుకు ధీమా..    | Rythu Bheema From Tomorrow | Sakshi
Sakshi News home page

రైతుకు ధీమా..   

Published Tue, Aug 14 2018 1:22 PM | Last Updated on Fri, Jul 12 2019 4:35 PM

Rythu Bheema From Tomorrow - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : రైతుతోపాటు రైతు కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర  ప్రభుత్వం రైతుకు బీమా పథకంను అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  రైతు బీమా పథకం ఈనెల 14 అర్ధరాత్రి నుంచి అమలులోకి రానుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పొందిన 6,29,110   రైతుల్లో 4,49,752 మందిని బీమా పథకానికి అర్హులుగా గుర్తించారు.

రైతు బంధు సాయం పొందిన రైతుల్లో 1,79,358 మంది రైతుల నుంచి వివరాలు సేకరించి వారి నుంచి ఈ అర్హులను గుర్తించారు. జిల్లా వ్యవసాయ శాఖ వారి వివరాలను ఎల్‌ఐసీకి అందజేసింది. బీమా బాండ్లను ఈ నెల 6వ తేదీ నుంచి రైతులకు అందజేస్తున్నారు. నేటి నుంచి బీమా పథకం అమల్లోకి రానున్న సందర్భంగా రైతు మరణించినప్పుడు క్లెయిమ్‌ గురించి చేపట్టాల్సిన చర్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది.

1.79 లక్షల మంది అనర్హులు

రైతు బీమా పథకానికి 18 నుంచి 59 సంవత్సరాల వయస్సువారు అర్హులని నిబంధన విధించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 6,29,110 మంది రైతులు పట్టాలు పొందారు. వయస్సు నిబంధనతో 1,79,358 మందిని వ్యవసాయ అధికారులు అనర్హులుగా తేల్చారు.

పథకం అమలు ఇలా.. 

రైతు బీమా బాండ్‌ పొందిన రైతు ఏ కారణం చేత మృతిచెందినా సంబంధిత  పంచాయతీ నుంచి మరణ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. పంచాయతీ కార్యదర్శులు రైతు మరణించిన 48 గంటల్లోపు మరణ ధ్రువీకరణ జారీ చేయాలి. రైతు ఆధార్‌ కార్డు, నామినీ ఆధార్‌ కార్డు, నామినీ బ్యాంకు ఖాతా జిరాక్స్‌ ప్రతులను మరణ ధ్రువీకరణ పత్రం, క్లెయిమ్‌ సర్టిఫికెట్‌పై మండల వ్యవసాయధికారి సంతకం చేసి ముద్ర వేయాలి. ఈ పత్రాలన్నింటిని రైతుబంధు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఉండే నోడల్‌ అధికారి ఈ వివరాలన్నింటిని  పరిశీలించి ఎన్‌ఐసీకి పంపిస్తారు. ఎన్‌ఐసీ ఆ వివరాలను  బీమా కంపెనీకి టెక్టŠస్‌  ఫైల్‌ రూపంలో పంపిస్తుంది. క్లెయిమ్‌కు సంబంధించిన వివరాలన్ని అందగానే నామినీ బ్యాంక్‌ ఖాతాలో రూ.5 లక్షలు జమ చేస్తారు. ఈ బీమా క్లెయిమ్‌ మొత్తం ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతుంది.ఈ ప్రక్రియను పర్యవేక్షించించేందుకు ప్రతి అధికారికి మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో డాష్‌ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ప్రతి దరఖాస్తు స్టేటస్‌ విషయంలో ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌ మెసేజ్‌లు అందిస్తారు. ఇప్పటికే అన్ని అంశాలపై ఏఓ, ఏఈఓలకు శిక్షణ ఇచ్చారు.

పంచాయతీ, బ్యాంకు అధికారులకు ఆదేశాలు

రైతులు మరణించిన 48 గంటల్లోగా మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా రైతు బీమా  పథకం కోసం జన్‌ధన్‌ ఖాతాను ఇచ్చినట్లయితే  ఆ ఖాతాను సేవింగ్స్‌ ఖాతాలోకి మార్చాలని బ్యాంకు అధికారులను వ్యవసాయ అధికారులు కోరాలని సూచించారు.

వ్యవసాయ అధికారులను వారి వారి సెల్‌ఫోన్‌ నంబర్లను సంబంధిత గ్రామాల్లో నోటీస్‌ బోర్డులపై రాసి రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి వ్యవసాయ అధికారి తన పరిధిలో నమోదైన రైతుల వివరాలను, వారి ఎల్‌ఐసీ బాండ్ల నంబర్లను విధిగా ఉంచుకోవాలి. ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆ రోజు  వచ్చిన క్లెయిమ్‌లు, సెటిల్‌మెంట్లను నోడల్‌ అధికారి ఎల్‌ఐసీకి పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement