
‘సాగర్’ ప్రక్షాళనను పరిశీలించిన సీఎం
- ‘సాగర్’ ప్రక్షాళనను పరిశీలించిన సీఎం
- హెచ్‌ఎండీఏ అధికారులకు ముచ్చెమటలు
- కూకట్‌పల్లి నాలా దారి మళ్లింపుపై ప్రత్యేక దృష్టి
సాక్షి, సిటీబ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అధికా రులను ఉరుకులు పరుగులు పెట్టించారు. ఉన్నట్టుండి హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పనులను పరిశీలించేందుకు వచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సీఎం నెక్లెస్ రోడ్డుకు చేరుకోవడంతో హెచ్‌ఎండీఏ అధికారులు ఉలిక్కిపడ్డారు. సాగర్ ప్రక్షాళనకు సంబంధించి ఏ పనులను సీఎం పరిశీ లిస్తారో తెలియక ఇంజినీరింగ్ అధికారులు హైరానా పడ్డారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ పరిధిలోని హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, జలమండలి తదితర విభాగాలతో సచివాలయంలో సీఎం సమావేశమయ్యారు.
హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టును సమీక్షించిన ఆయన పనుల తీరుపై అధికారులను ఆరా తీశారు. రూ.370 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు సుమారు రూ.200 కోట్లు ఖర్చయ్యాయని వారు తెలిపారు. ప్రస్తుతం పికెట్, బంజారా, బల్కాపూర్ నాలా ముఖద్వారాల వద్ద వ్యర్థాలను తొలగింపు (డ్రెడ్జింగ్) పనులు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. జలాశయం చుట్టూ గ్రిల్స్ ఏర్పాటుతో పాటు షోర్ లేన్‌లో గ్రీనరీని అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
ఈ విషయాలను శ్రద్ధగా ఆలకించిన సీఎం... పారిశ్రామిక ప్రాంతాల నుంచి విష రసాయన వ్యర్థాలను మోసుకొస్తున్న కూకట్‌పల్లి నాలాను దారి మళ్లించకుండా సాగర్ ప్రక్షాళన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మురుగునీటి నాలాలు సాగర్‌లో కలవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కూకట్‌పల్లి నాలా పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిద్దామంటూ సీఎం బయలుదేరారు.
అధికారులకు ముచ్చెమటలు
సీఎం ఆకస్మిక తనిఖీకి బయలుదేరడంతో హెచ్‌ఎండీఏ అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. సచివాలయంలో ముఖ్యమంత్రి కారు ఎక్కగానే సీఈ, ఎస్‌ఈలు విషయాన్ని కిందిస్థాయి సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో వారు నెక్లెస్ రోడ్డుకు పరుగులు పెట్టారు. ఇంతలో నేరుగా నెక్లెస్ రోడ్డుకు వచ్చిన సీఎం తొలుత జలవిహార్ వద్ద గల బంజారా నాలా (బ్రిడ్జి-2,3)ను, అక్కడి ఐ అండ్ డీ నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం కూకట్‌పల్లి నాలా (బ్రిడ్జి-4) పరిస్థితిని చూశారు.ఈ నాలా సాగర్‌లో కలిసే చోట పెద్దమొత్తంలో మేట వేసిన వ్యర్థాలు, జలాశయంలోకి నేరుగా కలుస్తున్న మురుగునీటిని పరిశీలించారు.
ఈ నాలాపై నిర్మించిన ఇంటర్ సెప్టర్ డైవర్షన్ (ఐ అండ్ డి) ద్వారా 100 ఎంఎల్‌డీ మురుగు నీటిని దారి మళ్లిస్తున్న తీరును సీఈ, ఎస్‌ఈలు సీఎంకువివరించారు. కూకట్‌పల్లి నాలా వద్ద 15 నిమిషాలకు పైగా సీఎం గడిపారు. ఆ తర్వాత సంజీవయ్య పార్కు వద్ద ఉన్న పికెట్ నాలా (బ్రిడ్జి-4)ను పరిశీలించారు. పూడికతీత (డ్రెడ్జింగ్) పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఫిర్యాదులకు తోడు... విజిలెన్స్ కే సు నమోదు కావడంతో సీఎం ఈ నాలాను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు వినికిడి. అటు నుంచి పాటిగడ్డలోని ఎస్టీపీని పరిశీలించాలని భావించినా భద్రతా కారణాల దృష్ట్యా సీఎం వెనుదిరిగి నెక్లెస్ రోడ్డు మీదుగానే సచివాలయానికి చేరుకున్నారు.
ఊపిరి పీల్చుకున్న అధికారులు
నెక్లెస్ రోడ్డు వద్ద సాగర్‌లో కలుస్తున్న 5 నాలాలను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి పాటిగడ్డలోని 30 ఎంఎల్‌డీ ఎస్టీపీకి వస్తారన్న సమాచారంతో హెచ్‌ఎండీఏ ఇంజనీరింగ్ సిబ్బంది అక్కడికి పరుగులు తీశారు. ఆతర్వాత సీఎం అక్కడికి రావట్లేదని, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పక్కన నిర్మించిన 20 ఎంఎల్‌డీ ఎస్టీపీని పరిశీలిస్తారని సమాచారం రావడంతో ఆగమేఘాలపై అక్కడికి చేరుకున్నారు. సీఎం నేరుగా వెళ్లిపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.