
అధికార పార్టీదే హవా
- చైర్మన్ ఎన్నికల్లో ఫలించిన గు‘లాబీ’
- జనగామలో పీసీసీ చీఫ్ పొన్నాలకు షాక్
- భూపాలపల్లి, పరకాలలో ఇదే పరిస్థితి
- నర్సంపేటలో పట్టు నిలుపుకున్న ‘దొంతి’
- మానుకోటలో ఫలించిన కాంగ్రెస్ వ్యూహం
- ‘కమలానికి’ కలిసివచ్చిన అదృష్టం
- బీజేపీకి మూడు వైస్ చైర్మన్ పదవులు
సాక్షి, హన్మకొండ: మునిసిపల్ చైర్మన్ ఎన్నికల్లో అధికార పార్టీ జోరు కొనసాగింది. పుర పీఠాలు దక్కించుకోవడానికి టీఆర్‌ఎస్ పార్టీ వేసిన ఎత్తుగడలు ఫలించాయి. ఎన్నికల ఫలితాల వెలువడే నాటికి ఐదు పురపాలికల్లో ఒక్కచోట కూడా మెజార్టీ సాధించని గులాబీ.. తదనం తరం చోటుచేసుకున్న పరిణామాలతో వికసించింది. మూడు పురపాలికల్లో చైర్మన్ పీఠాన్ని అధిరోహించి సత్తా చాటుకుంది. పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సొంత ఇలాకాలో కాంగ్రెస్ పార్టీకి టీఆర్‌ఎస్ ముచ్చెమటలు పట్టించింది.
జిల్లాలోని వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ మినహా రెండు మునిసిపాలిటీలు (జనగామ, మహబూబాబాద్)... మూడు నగర పంచాయతీల్లో (పరకాల, భూపాలపల్లి, నర్సంపేట) గురువారం చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. జనగామ మునిసిపాలిటీతోపాటు పరకాల, భూపాలపల్లి నగర పంచాయతీలకు సంబంధించి చైర్మన్ పీఠాన్ని అధిరోహించి టీఆర్‌ఎస్ ఆధిక్యతను కనబర్చింది.
మరోవైపు టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించిన బీజేపీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జనగామ మునిసిపాలిటీ, పరకాల, భూపాలపల్లి నగరపంచాయతీల్లో వైస్ చైర్మన్ పదవులు దక్కించుకుంది. వివాదాల నడుమ జరిగిన మహబూబాబాద్ చైర్‌పర్సన్ ఎన్నికలో కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని, సీపీఎం వైస్ చైర్మన్ పదవిని దక్కించుకున్నాయి. నర్సంపేట నగర పంచాయతీలో మాత్రం కాంగ్రెస్ సునాయాసంగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకుంది.