
‘అదర్స్’లోనూ చోటులేదా..?
సమాజంలో అందరి నుంచి చీదరింపులు.. అవమానాలు.. ఎవరూ పట్టించుకోరు...ప్రభుత్వ పథకాలు అందవు.. ఎటువంటి జీవనోపాధి లేదు.. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లోనూ అవకాశాలు కరువు.. వారే హిజ్రాలు.. సమాజంలో అదర్స్‌గా చెలామణి అవుతున్న వీరికి ఆదరణ కరువై దిక్కుతోచని స్థితిలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు..ప్రభుత్వం వితంతువులకు, వికలాంగులకు, వృద్ధులకు పింఛన్‌లు ఇస్తోందని, తమకు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు..
తమకు ఉపాధి కల్పించాలని, సంక్షేమ పథకాలు అందించాలని, అప్పుడే సమాజంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించగలమని అంటున్నారు... హిజ్రాలు నాగేటి రాజేశ్వరి, నాగేటి లాలస, రమ్య, అరుణ, పద్మలు సమాజంలో తమకు ఎదురవుతున్న బాధలను టేకులపల్లిలో ‘సాక్షి’కి వివరించారు..
⇒ మేమంటే లెక్కలేదు..?
⇒ ప్రభుత్వ పథకాలు లేవు..
⇒ ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు ఇవ్వరు..
⇒ డిగ్రీచేద్దామన్నా తిరస్కరించారు..
⇒ ఆవేదన వ్యక్తం చేస్తున్న హిజ్రాలు
టేకులపల్లి: కొత్తగూడెం గాజులరాజాం బస్తీలో సుమారు 50 మంది వరకు నివసిస్తున్నామని, తమకు ఆధార్, ఓటర్ గుర్తింపు, రేషన్‌కార్డు, ఇళ్లు, పింఛన్‌లు ఇలా ప్రభుత్వ పథకాలేమీ అందడం లేదని అంటున్నారు. తమకు ప్రభుత్వ పథకాలు అందించాలని పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఓటర్ నమోదులో తమ లాంటి వారి కోసం ‘ఆదర్స్’ ఆప్షన్ ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా ఓటు హక్కుకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇలా ఊరూరు తిరుగుతూ భిక్షాటన చేయూల్సి వస్తోందని అంటున్నారు. తాము ప్రభుత్వ పథకాలకు అర్హులం కాదా..? మేము మనుషులమే కాదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి తమలాంటి వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఓపెన్ డిగ్రీకి దరఖాస్తు చేస్తే తిరస్కరించారు
ప్రభుత్వ పథకాలతో పాటు చదువుకూ మమ్మల్ని దూరం చేస్తున్నారు. చిన్నప్పుడు స్కూల్‌లో అడ్మిషన్ ఇవ్వకపోవడంతో శతవిధాల ప్రయత్నించి ఓపెన్‌లో టెన్త్ పూర్తి చేశా. రెండు నెలల క్రితం ఓపెన్ డిగ్రీకి దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించారు. చదువుకోవడానికి కూడా మాకు అర్హత లేదా..? గుండె నిండా బాధలు, సమాజం నుంచి చీదరింపులు ఎదురవుతున్నారుు. నరక యూతన అనుభవిస్తున్నప్పటికీ పెదవిపై చిరునవ్వుతోనే జీవిస్తున్నాం. ప్రభుత్వం స్పందించి ఆధార్, రేషన్, ఓటర్ గుర్తింపు కార్డులతో పాటు ఇల్లు, పింఛన్ సౌకర్యం కల్పించాలి. చదువుకునేందుకు అవకాశం కల్పించాలి.
- లాలస