
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్ ఐటీ రంగం వాటా ప్రస్తుతం రూ.1.10 లక్షల కోట్లు. ఇతర నగరాలతో పోలిస్తే శరవేగంగా వృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా ఐటీ రంగం వృద్ధిరేటు 7 శాతం కాగా, మన రాష్ట్రంలో మాత్రం రెండింతలు.. అంటే 15 శాతంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం.. రూ.65 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఉత్పత్తులను 2020 నాటికి రెండింతలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే కరోనా సంక్షోభం కారణంగా ఈ లక్ష్యసాధనకు ఒకటి రెండేళ్లు పట్టొచ్చు.
రాష్ట్రంలో ఐటీ రంగానికి ఉన్న సానుకూల వాతావరణంతో బెంగళూరును ఒకటి రెండేళ్లలో అధిగమించే అవకాశం ఉంది. కరోనాతో ఈ రంగానికొచ్చిన ముప్పేమీ లేదు. ఈ సంక్షోభం నుంచి ఎంత త్వరగా బయటపడతామనే అంశంపైనే ఐటీ రంగం పురోగతి ఆధారపడి ఉంది’అని హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) కొత్త అధ్యక్షుడు, ఇన్ఫోపీర్ సొల్యూషన్స్ సీఈఓ భరణికుమార్ ఆరోల్ వెల్లడించారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో ఐటీ రంగం స్థితిగతులపై ‘సాక్షి’తో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
ఐటీపై కరోనా ప్రభావం అంతంతే..
కరోనా ప్రభావం ప్రపంచంలో అన్ని రంగాలపై ఉంది. ఐటీ రంగం కోణంలో చూస్తే ప్రస్తుత ప్రాజెక్టులపై అంత ప్రతికూల ప్రభావం లేకపోవచ్చు. కానీ కొత్త ప్రాజెక్టులు ఇప్పట్లో రాకపోవచ్చనే అభిప్రాయం ఉంది. ఇదే జరిగితే రాష్ట్రంలో ఐటీ వృద్ధిరేటు కొంత తగ్గొచ్చు. లాక్‌డౌన్ ముగిశాక.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3, 4 త్రైమాసికాల నాటికి పుంజుకునే అవకాశం ఉంది. అనూహ్యంగా తలెత్తిన సంక్షోభంతో ఆందోళన చెందకుండా తక్కువ సమయంలోనే ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానంలో ఉద్యోగులకు పని కల్పించాయి.
రాష్ట్రంలో ఐటీ రంగంలో సుమారు 6 లక్షల మంది పనిచేస్తుండగా, వీరిలో 95 శాతం మంది ‘వర్క్ ఫ్రమ్ హోం’చేశారు. వీరికి అవసరమైన సాంకేతిక సదుపాయాలను ఆయా సంస్థలు కేవలం నాలుగైదు రోజుల్లోనే సమకూర్చడం హైదరాబాద్ ఐటీ రంగానికి ఉన్న బలాన్ని తెలియచేస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్ మార్గదర్శకాలను సడలిస్తూ 33 శాతం మందితో పనిచేసేందుకు ప్రభుత్వం వెసులుబాటునిచ్చింది. నెమ్మదిగా ఆఫీసు వాతావరణాన్ని మెరుగుపరుస్తున్నాం.
చైనాపై ప్రతికూల ధోరణి మనకు ‘ప్లస్’
ప్రస్తుతం చైనాపై ప్రతికూల ధోరణి పెరుగుతుండటంతో అక్కడి ఐటీ కంపెనీలు ఇతర దేశాలవైపు చూస్తున్నాయి. గడిచిన మూడు దశాబ్దాల్లో దేశీయ ఐటీ రంగం సాధించిన పురోగతి మూలంగా భారత్ ప్రత్యామ్నాయంగా మారవచ్చు. పోలండ్‌తో పాటు వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు పోటీ పడుతున్నా అక్కడ నైపుణ్య కలిగిన మానవ వనరులు పరిమితంగానే ఉన్నాయి. హైదరాబాద్ వంటి నగరం పెట్టుబడుల ఆకర్షణలో ముందువరుసలో నిలిచే అవకాశం ఉంది. అదే సమయంలో ఇక్కడి ఐటీ రంగంలో మౌలిక వసతులు మెరుగుపడాలి. ఇప్పటికే నగర శివార్లలోని ఉప్పల్, ఆదిబట్ల ప్రాంతాల్లో ఐటీ క్లస్టర్ల ఏర్పాటుతో పాటు, ద్వితీయ శ్రేణి నగరాలకు ఈ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్తరిస్తోంది.
చిన్న కంపెనీలకు ప్యాకేజీ అవసరం
కరోనా సంక్షోభంతో ఐటీ రంగంలోని చిన్న కంపెనీలు (ఎస్‌ఎంఈ రంగం) ఇబ్బందిపడుతున్నాయి. వీటిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరాం. రుణ పరపతిని 20 నుంచి 30% మేర అదనంగా ఇవ్వడం, వడ్డీరేట్లు తగ్గించడం, నెలవారీ కిస్తీ చెల్లింపులపై మారటోరియం వంటి ప్రతిపాదనలు సమర్పించాం. అద్దెలు మాఫీ చేయడం, చిన్న కంపెనీలకు రాయితీలు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. హైదరాబాద్ ఐటీ రంగానికి చిన్న కంపెనీలు వెన్నెముకగా ఉన్నాయి. ఐటీ రంగంలో 70% కంపెనీలు ఎస్‌ఎంఈ రంగానికి చెందినవే. వీటిని ప్రభుత్వపరంగా ఆదుకోవడానికి కృషి చేస్తున్నాం. యూఎస్ తరహాలో ఇండియాలోనూ వేతనాల చెల్లింపునకు కేంద్రం ప్యాకేజీ ఇస్తే చిన్న కంపెనీలపై భారం తగ్గుతుంది.
ఐటీలో లేఆఫ్‌లు సర్వసాధారణం
ఐటీ కంపెనీలు ఎప్పుడూ 20 – 30% మానవ వనరులను అవసరానికి మించి నియమించుకుని వారికి శిక్షణనిస్తుంటాయి. కొత్త ప్రాజెక్టులు వచ్చినపుడు, అవసరార్థం వారి సేవలను ఉపయోగించుకుంటాయి. పనితీరు ఆశించిన స్థాయిలో లేని వారిని తప్పించడం కూడా సాధారణం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించొద్దని (లేఆఫ్) ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగాలు కొందరికి జీవనోపాధి కావచ్చు కానీ పరిశ్రమ మనుగడకు ఉద్యోగులే కీలకం.
లేఆఫ్‌పై ఫిర్యాదు అందితే ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీతో కలిసి హైసియా విచారణచేసి దిద్దుబాటు చేస్తోంది. ఎక్కడైనా ఒకటీ అరా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉన్నా మరోచోట సర్దుబాటు చేసేలా ప్లేస్‌మెంట్ ఏజెన్సీలతో మాట్లాడుతున్నాం. టాస్క్ ద్వారా వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ, కొత్త టెక్నాలజీపై అవగాహన కల్పిస్తూ ఐటీ రంగంలోనే మనుగడ సాగించేలా చూస్తున్నాం. ఇక, ఇప్పటికే ఆఫర్ లెటర్లు ఇచ్చిన కంపెనీలు తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాయి. అయితే వారిని విధుల్లో చేర్చుకోవడం కొంత ఆలస్యం కావచ్చు.
ఆవిష్కరణల దిశగా ‘టాస్క్’
ఇక్కడి ప్రభుత్వం ఐటీ రంగం వృద్ధికి అవసరమైన విధానాల తయారీలో ముందంజలో ఉంది. దేశంలో విద్యావ్యవస్థ, పని ప్రదేశాలకు నడుమ చాలా అంతరం ఉంది. కొత్తగా ఐటీ రంగంలో ఉద్యోగంలో చేరే వారికి బేసిక్ కోడింగ్ నేర్పాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం విద్యార్థుల్లో 10 – 12 శాతం మందికే ఎంప్లాయ్‌బిలిటీ (ఉద్యోగ సామర్థ్యం) ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ‘టాస్క్’వంటి సంస్థల ద్వారా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణనిస్తోంది. ఇన్నాళ్లూ ఐటీ సర్వీసులకే పరిమితమైన హైదరాబాద్ ప్రస్తుతం ఉత్పత్తులు, ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తోంది.
మెషీన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, చాట్‌బోట్, ఏఐ, బ్లాక్ చెయిన్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీ అంశాలు మన పాఠ్యాంశాల్లో లేవు. వీటిపై విద్యార్థులు, యువతకు ‘టాస్క్’శిక్షణనిస్తోంది. ట్రిపుల్ ఐటీ, జేఎన్‌టీయూ వంటి విద్యాసంస్థలతో కలిసి ‘హైసియా’కూడా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు పనిచేస్తున్నాం. ప్రభుత్వ విధానాలతో స్టార్టప్‌లు, ప్రొడక్ట్ బ్రాండ్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. భద్రత, రక్షణ, వ్యాపారవృద్ధికి ఇక్కడున్న అవకాశాలతో పాటు నైపుణ్యం గల మానవ వనరులు ఇక్కడుండటం వల్లే అమెజాన్, ఆపిల్, ఫేస్‌బుక్, గూగుల్ వంటి సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాయి.
Comments
Please login to add a commentAdd a comment