సాక్షి, హైదరాబాద్ : జనగామ జిల్లా కేంద్రంలో కాసుల సౌమ్య 8వ తరగతి చదువుతోంది. కరోనా నేపథ్యంలో పాఠశాలలు తెరిచే పరిస్థితి లేకపోవడంతో ఈమెకు ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్‌లో రోజుకు ఒక సబ్జెక్టును బోధిస్తున్నారు. బోర్డుపై రాసి ఫొటోలను వాట్సాప్ చేస్తున్నారు. వీడియో ద్వారా పాఠాలు చెబుతున్నారు. ఉదయం గంటన్నరపాటు రెండు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లో టీచర్లు చెప్పిన సమయంలో వినడమే తప్ప, తిరిగి అడగడానికి వీలు లేదు. ఒక్కోసారి వీడియో షేక్ అవుతోంది. ఆ సమయంలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు పూర్తి స్థాయిలో వినలేక పోతున్నామని, బోర్డుపై రాసిన చిన్న చిన్న అక్షరాలను చూడలేక కళ్లపై ఒత్తిడి పెరుగుతోందని సౌమ్య చెబుతోంది. ఇంటర్నెట్ కూడా ఒక్కోసారి ఇబ్బంది పెడుతుండటంతో ఆన్‌లైన్ క్లాస్‌లు మధ్యలోనే ఆగిపోతున్నాయని అంటోంది. ఏడాది పొడవునా ఇలానే చదువుకోవడం కష్టమేనని చెబుతోంది.
ఈ సమస్య సౌమ్యది మాత్రమే కాదు. రాష్ట్రంలోని దాదాపు అన్ని చోట్లా, అందరు విద్యార్థులదీ ఇదే పరిస్థితి. కరోనా పేరుతో రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాయి కానీ విద్యార్థుల బుర్రలోకి అవి ఏ మేరకు ఎక్కు తున్నాయన్నది ఎవరికీ అంతు పట్టడం లేదు. తరగతి గదిలో కూర్చుని పాఠాలు వింటేనే కనీ సం 30% మంది విద్యార్థులు శ్రద్ధ పెట్టలేరని కొన్ని అధ్యయనాలు చెబు తున్నాయి. ఇక ఇంట్లో ఉండి స్మార్ట్ ఫోన్‌లో గేమ్స్ ఆడకుండా... పాఠాలు ఏ మేరకు వింటారనేది సందేహాస్పదమే. ఆన్‌లైన్ పాఠాలు అర్థం కావడం లేదని 70% మంది విద్యా ర్థులు అభిప్రాయపడుతున్నట్టు ఇటీవల ఓ సర్వేలో వెల్లడి కావడం గమనార్హం. అటు వైపు నుంచి టీచర్ చెప్పింది వినడమే కానీ, ఏమైనా సందేహాలుంటే అడిగే పరిస్థితి లేకపోవడం, టీచర్ చెప్పినంత సేపు ఏకాగ్రతతో వినలేక పోవడం, ఇంటర్నెట్ సమస్య ఏర్పడితే క్లాసు మధ్యలో ఆగిపోవడం, స్మార్ట్ ఫోన్‌లో గేమ్స్ ఆడడమే కానీ, పాఠాలు వినే ఓపిక విద్యార్థులకు లేకపోవడం, డబ్బులు పెట్టి కొనిచ్చాం... ఖచ్చితంగా పాఠాలు వినండంటూ తల్లి దండ్రులు విద్యార్థులపై ఒత్తిడి చేయడం... ఇలా అనేక సమస్యల మధ్య చదువులు కొనసాగిం చాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒత్తిడిలో పిల్లలు
వాస్తవానికి, దాదాపు నెలరోజుల క్రితం నుంచే పాఠశాలలు ప్రారంభం కావాలి. అప్పటి నుంచి పాఠాలు ప్రారంభిస్తే వార్షిక పరీ క్షలు సమీపించే నాటికి సిలబస్ పూర్తయ్యేలా పాఠ్య ప్రణాళికల రూపకల్పన జరిగింది. కానీ, సమయం అప్పుడే నెలరోజులు గడిచిపోయింది. జూన్ నుంచే కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించినా మొదట్లో కొంత మందకొడిగానే సాగాయి. కానీ, ఇప్పుడు విద్యార్థుల వారీగా టైంటేబుళ్లు తయారు చేసి, బోధించే టీచర్లకు షెడ్యూల్ ఇచ్చి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఆన్‌లైన్ క్లాసులు బోధిస్తు న్నాయి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు. ఈ నేపథ్యంలో వీడియో పాఠాలు వినే సమయంలో విద్యార్థులు మానసికంగా, శారీరకంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఆన్‌లైన్ క్లాస్ స్టార్ట్ అవుతుందంటూ గంటల ముందు నుంచే సెల్‌ఫోన్లు ఆపరేట్ చేస్తుండడం, కంప్యూటర్ల ముందు కూర్చుని పిచ్చాపాటి బ్రౌజింగ్ చేస్తున్న కారణంగా విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతోందని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పాఠం ప్రారంభం అయిన తర్వాత వాట్సాప్‌లో వచ్చే ఫోటోలు, వీడియో రూపంలో కనిపించే చిన్న అక్షరాలను చూసుకుని మళ్లీ నోట్సు రాసుకోవడం వారికి తలకు మించిన భారంగానే మారింది. దీంతో కళ్లు ఇబ్బంది పెడుతున్నాయనే ఫిర్యాదులు అప్పుడే విద్యార్థుల నుంచి ప్రారంభం అయ్యాయని ఇటీవల ఓ ఉపాధ్యాయ సంఘం నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. ఇక పెద్ద తరగతుల విద్యార్థులకు అయితే ఆన్‌లైన్ క్లాసులు ఓ ఆటగా, ఆందోళనగా మారాయి. తల్లితండ్రుల భయంతో పాఠాలు విన్నట్టు నటించడం, అర్థం కాని అంశాలను ఎలా నివృత్తి చేసుకోవాలో తెలియకపోవడం, నోట్సుల్లో పూర్తిగా రాసుకోకుండా ఎలా చదువుకోవాలో అర్థం కాకపోవడం సమస్యగా మారుతోంది. ఒకవేళ పాఠశాలలు పునఃప్రారంభం అయినా ఆన్‌లైన్‌లో చెప్పిన పాఠాలు మళ్లీ బోధిస్తారో.... సమయం లేదని సరిపెడతారో తెలియని పరిస్థితి.
వెనుకబడతామా..?
ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభం అయిన విద్యార్థుల పరిస్థితి అలా ఉంటే ఇంకా ఆన్‌లైన్ పాఠాలు మొదలు కాని విద్యార్థులు మరో టెన్షన్ అనుభవిస్తున్నారు. తమ పక్కనే ఉండే మరో విద్యార్థి చదువుకుంటుంటే తాను ఇంకా చదువుకోవడం లేదనే ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. చదువుల్లో వెనుకబడతామేమోననే భయం వ్యక్తమవుతోంది. ఇదే ఆందోళన, ఆదుర్దా ఇంకా ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభం కాని విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ కనిపిస్తోంది. ఒకవేళ తమ పిల్లలకు కూడా ఆన్‌లైన్ పాఠాలు అంటారేమో అనే ఆలోచనతో కొందరు కొత్త ఫోన్లు కొనడం, కంప్యూటర్లు రిపేర్ చేయించుకోవడం లాంటి పనుల్లో నిమగ్నం కాగా, పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన తల్లిదండ్రులు మాత్రం ప్రభుత్వ నిర్ణయం వైపు ఆశగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
మరి...పరీక్షలెట్టా
పాఠాలయితే వింటున్నాం కానీ పరీక్షలు ఆన్‌లైన్‌లో ఎలా నిర్వహిస్తారో అనే ఆందోళన విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. పోటీపరీక్షలు రాసేంత వయసు, అవగాహన వచ్చిన తర్వాతే ఆన్‌లైన్‌లో పరీక్షలు రాయడం సాధ్యం అవుతుందని, అలా కాకుండా చిన్న వయసులోనే కంప్యూటర్, సెల్‌ఫోన్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తమ పిల్లలు పరీక్షలు ఎలా రాస్తారో అనే ఉత్కంఠ కూడా తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించాలి:
'నా కుమారుడు శశాంక్‌రెడ్డి హైదరాబాద్‌లో, కుమార్తె యశస్విని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. ఆన్‌లైన్ తరగతుల పేరిట ఇద్దరికి కలిపి సెల్‌ఫోన్లు, నోట్‌బుక్స్, ఇతర పరికరాలు కొనుగోలు కోసం రూ.30 వేల పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఆన్‌లైన్ ద్వారా అర్థం చేసుకుంటే, ఎంత కష్టపడైనా చదివించేందుకు సిద్దంగా ఉన్నాం. కానీ ఫో¯న్‌లో పాఠాలు అర్థం చేసుకోలేక పిల్లలపై మానసికంగా ఒత్తిడి పెరుగుతోంది. ఆన్‌లైన్ బోధన కన్నా ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి.’
ఆసిరెడ్డి తిర్మల్‌రెడ్డి, తండ్రి, జనగామ
ఈ ఏడాది డుమ్మానే :
‘నా కుమారుడు సాత్విక్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. మా గ్రామంలో నేటికీ కనీసం 2జీ సిగ్నల్ కూడా సరిగా రాదు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తే మా గ్రామంలోని విద్యార్థుల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. స్మార్ట్ ఫోన్ ఉన్నా ఊర్లో ఇంటర్నెట్ సరిగా రాదు. ఫోన్ ఇస్తే పిల్లలు చదువుకునే దాని కన్నా గేమ్స్ ఆడుకోవడానికే సరిపోతుంది. ఇంటర్నెట్ సహకరించకపోతే చెప్పే పాఠాలు కూడా సరిగా అర్థం కావు. ఆన్‌లైన్ చదువులంటే ఊర్లో పిల్లలు ఈ ఏడాది చదువులకు డుమ్మా కొట్టినట్టే. ఇక టీవీల్లో చదువులు సాధ్యమయ్యే పని కాదు.
మేడిచెలిమి లావణ్య, కుందనవానిపల్లి, అక్కన్నపేట మండలం, సిద్ధిపేట జిల్లా
Comments
Please login to add a commentAdd a comment