ఉద్యోగులకు డబుల్ ధమాకా..!
*43 శాతం ఫిట్‌మెంట్‌తో రెట్టింపు కానున్న మూలవేతనం
*మొత్తం ఆర్థిక భారం రూ. 6,500 కోట్లు
* ప్రస్తుత మధ్యంతర భృతి రూ. 4,081 కోట్లు
*అదనంగా వెచ్చించాల్సిన మొత్తం రూ. 2,419 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇచ్చిన మొదటి పీఆర్సీతో రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు అందే జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. దాదాపు అన్ని కేటగిరీల్లో మూల వేతనం రెట్టింపు కానుంది. 9వ పీఆర్సీ 2009 సంవత్సరంలో 27 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రతిపాదించగా... అప్పటి ప్రభుత్వం 2010లో 39% ఫిట్‌మెంట్ ఇచ్చింది. ప్రస్తుతం పదో పీఆర్సీ (తెలంగాణలో మొదటిది) 29% ఫిట్‌మెంట్‌ను ప్రతిపాదించగా... ప్రభుత్వం 43% ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనితో ప్రభుత్వంపై రూ. 6,500 కోట్లు భారం పడుతుందని ఆర్థికశాఖ అంచనా.
ఇదే పీఆర్సీ సూచించినట్లుగా 29% ఇస్తే పడే భారం రూ. 4,383 కోట్లే. కానీ ప్రభుత్వం మాత్రం 43% ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే 9వ పీఆర్సీ కాలం 2013 జూన్ 30తో ముగిసిన నేపథ్యంలో... రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 27% మధ్యంతర భృతి (ఐఆర్)ని ప్రకటించింది. ఇందుకు ఆర్థిక శాఖ ఇప్పటికే ఏటా రూ. 4,081 కోట్లు వెచ్చిస్తోంది. ఈ ఐఆర్ (27%)కు అదనంగా 16% పెంచడం ద్వారా... ఇప్పుడు ప్రభుత్వంపై అదనంగా రూ. 2,419 కోట్ల భారం పడనుంది.
2013 జూలై 1 వరకు డీఏ కొత్త వేతనంలో విలీనం..
కొత్త పీఆర్సీని 2014 జూన్ 2వ తేదీ నుంచి నగదు రూపంలో వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో... 2013 జూలై 1 నుంచి 2014 జూన్ 1 వరకు ఇచ్చిన ఐఆర్ 2014 జూన్ 2 తరువాత రద్దవుతుంది. అలాగే 2013 జూలై 1 వరకు ఉన్న కరువు భత్యం (డీఏ) 63.344 శాతం కూడా కొత్త వేతనంలో విలీనం అవుతుంది. ప్రస్తుతం ఉద్యోగులకు 77.896 శాతం డీఏ వస్తోంది. ఇందులోనుంచి 2013 జూలై 1 వరకున్న డీఏ 63.344 శాతాన్ని తీసేస్తే.. 14.552 శాతం డీఏ మిగులుతుంది. అయితే కేంద్రం జారీ చేసిన డీఏ సూత్రం ప్రకారం కేంద్రం ఒక శాతం డీఏ ఇస్తే రాష్ట్రంలో 0.524 శాతం ఇస్తారు. ఈ లెక్కన రాష్ట్ర ఉద్యోగుల వేతనంలో ఇకపై 8.908 శాతం డీఏ మాత్రమే కలుస్తుంది.
ఫిట్‌మెంట్ అంటే..
కేంద్ర ప్రభుత్వం నిత్యావసర ధరల పెరుగుదల సూచీని వెల్లడిస్తుంటుంది. దాని ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు మూల వేతనంలో ఇచ్చే పెంపునే ఫిట్‌మెంట్ అంటారు. ఈ సూచీల ఆధారంగా కేంద్రం పదేళ్లకోసారి వేతన స్థిరీకరణ చేస్తుండగా... రాష్ట్రం ఐదేళ్లకోసారి వేతన స్థిరీకరణ చేస్తోంది. ఇందులో ఒక ఉద్యోగి ప్రస్తుతం పొందుతున్న మూల వేతనానికి... పీఆర్సీ అమలు చేయాల్సిన సమయంలో ఉన్న డీఏను+ప్రభుత్వం ఇవ్వదలచుకున్న ఫిట్‌మెంట్‌ను కలిపి కొత్త మూలవేతనాన్ని నిర్ధారిస్తారు.
ఉదాహరణకు ఒక సీనియర్ లెక్చరర్ ప్రస్తుత మూలవేతనం రూ. 25,600గా ఉంది. ఆయనకు 2013 జూలై 1 నాటికి ఉన్న 63.344% డీఏ అంటే రూ. 16,216+ ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న 43% ఫిట్‌మెంట్ అంటే రూ. 11,008 కలిపి... మొత్తంగా (25,600+16,216+11,008) రూ. 52,824 మూలవేతనంగా నిర్ణయిస్తారు. ఈ లెక్కన ఆ లెక్చరర్ మాస్టర్ స్కేల్‌లో ఉన్న 82 దశల్లోని రూ. 53,950 మూల వేతనంలో (పై దశలో) ఉంటారు. ఇక దీనిపై పీఆర్సీ అమల్లోకి వచ్చే నాటికి మిగిలిన డీఏ (8.908%) +హెచ్‌ఆర్‌ఏ+సీసీఏ వంటి ఇతర అలవెన్సులు కలిపి పూర్తి వేతనాన్ని నిర్ధారిస్తారు.