మీ సాహసానికి సెల్యూట్!
- ఘోరాన్ని ఆపేందుకు విద్యార్థులు, అధ్యాపకుల యత్నం
- ఉన్మాదికి ఎదురెళ్లిన వైనం
- ఇతరులకు స్ఫూర్తిదాయకం
- సహచరుల చొరవతో ప్రాణాలు దక్కించుకున్న రవళి
- ఊహించని పరిణామంతో విషం తాగిన ప్రదీప్
చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్, కాటేదాన్, ముషీరాబాద్: ప్రదీప్ పక్కా పథకంతోనే కళాశాలకు వచ్చాడు. సాధారణ డ్రెస్‌లో వస్తే మెయిన్‌గేట్ వద్దే సెక్యూరిటీ గార్డు ఆపేస్తాడని గ్రహించిన అతడు అరోరా కళాశాల డ్రెస్ (బ్లూషర్టు, బ్లూ జిన్స్)వేసుకుని... బ్యాగ్ పట్టుకొని ఉదయం 8.30 గంటలకే లోపలికివ చ్చాడు. సరిగ్గా 9 గంటలకు రవళి కళాశాల మైదానంలో బస్సు దిగింది. వంద మీటర్లు నడిస్తే చాలు తరగతి గదిలోకివెళ్లిపోతుంది. ఆలోగానే దాడి చేయాలనే పథకంతో ప్రదీప్ 60 మీటర్ల దూరంలోనే కూర్చున్నాడు. తోటి విద్యార్థులతో కలిసి తరగతి గదివైపు రవళి నడిచి వెళుతోంది. మరో 20 మీటర్ల దూరం ఉండగానే ఒక్కసారిగా ఆమెపై ప్రదీప్ దాడికి పాల్పడ్డాడు. భవనంలోకి చేరుకున్నాక దాడికి అక్కడ ఆస్కారం ఉండదు. అందుకే పక్కా ప్రణాళికతో దాడికి పాల్పడ్డాడు. అతడు ఊహించనిదేంటంటే సహచరులు తిరగబడతారని.
కేసు నమోదు
భవనం ముందు ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లో దాడి దృశ్యాలు కనిపించలేదు. మరో పది మీటర్ల దూరం తరువాత ఘటన జరిగి ఉంటే సీసీ కెమెరాలో దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యేవి. ఈ ఘటనతో కళాశాలలో సీసీ కెమెరాల సంఖ్యను మరింత పెంచాలని యాజమాన్యం అత్యవసర సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై 307, 354ఎ,బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ తెలిపారు. ప్రదీప్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తలించామన్నారు. అతను పురుగుల మందు తాగినట్టు గుర్తించామన్నారు.
కళాశాలకు ఎలా వచ్చాడు
కళాశాలకు ప్రదీప్ ఎలా వచ్చాడు అనే కోణంలో పోలీసుల ఆరా తీస్తున్నారు. ఎవరైనా అతన్ని ముందే కళాశాల వద్ద బైక్‌పై దింపి వెళ్లారా? లేక అతనే ఏదైనా బస్సు, ఆటోలో వ చ్చాడా? అని ఆరా తీస్తున్నారు. కళాశాల గేటు వద్ద నుంచి లోపలికి నడిచి వచ్చినట్టు తెలుస్తోంది. లోపల కేవలం విద్యార్థుల బైక్‌లు మాత్రమే ఉన్నాయి. పార్కింగ్ స్థలంలో ఎలాంటి వాహనమూలేకపోవడంతో ప్రదీప్ నడిచి వచ్చాడని కళాశాల యాజమాన్యం చెబుతోంది.
రూ.5 వేల కోసం
ప్రదీప్ చికిత్స పొందుతూ మృతి చెందిన తరువాత అపోలో ఆస్పత్రి వారు అతని మృతదేహాన్ని భద్రపరిచారు. కేసు దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని స్వాధీనపర్చాలని చాంద్రాయణగుట్ట పోలీసులు కోరారు. తాము వైద్యం చేశామని, ఆ ఖర్చులు రూ.5 వేలు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం భీష్మించుకు కూర్చుంది. బిల్లు చెల్లించేందుకు పోలీసులు ముందుకు రాకపోవడం, మృతుడి బంధువులు అక్కడికి చేరుకోకపోవడంతో రాత్రి వరకూ మృతదేహాన్ని ఆస్పత్రిలోనే ఉంచారు.
బస్‌స్టాప్‌లు మార్చిన రవళి
ప్రదీప్ గతంలో చేసిన హెచ్చరికల నేపథ్యంలో రవళి రోజుకోచోట బస్సు ఎక్కేది. తన తండ్రి వెంట బస్సు వద్దకు వచ్చేది. సాయంత్రం ఇంటికి వచ్చే సమయంలో తాను బస్సు ఎక్కడ దిగుతున్నదీ ముందుగానే తండ్రికి ఫోన్ చేసి చెప్పేది. అలా రక్షణ చర్యలు తీసుకునేది. కళాశాల ఆవరణలోనే బస్సు దిగుతున్నందున ప్రమాదం పొంచి ఉన్న విషయాన్ని పసిగట్టలేకపోయింది. సోమవారం ఆమె తండ్రితో కలసి వచ్చి రామ్‌నగర్ చేపల మార్కెట్ వద్ద బస్సు ఎక్కింది. కళాశాలలో రవళిపై ప్రదీప్ దాడి విషయం తెలియగానే రామ్‌నగర్‌లోని ఆమె కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. వెంటనే వారు ఆమె చికిత్స పొందుతున్న సుజాత ఆస్పత్రికి పరుగులు తీశారు.
అరెస్టు చేసి ఉంటే
గత నెలలో రవళి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రదీప్‌పై ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అతన్ని అరెస్టు చేసి ఉంటే ఈపాటికి జైలులోనే ఉండేవాడు. ఈ రోజు ఈ ఘటన జరిగి ఉండేదికాదని కళాశాలలో తోటి విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
ఆస్పత్రిలో వాంగ్మూలం సేకరణ
విద్యార్థినిపై దాడి విషయం తెలుసుకున్న ఉప్పర్‌పల్లిలోని ఎనిమిదోమెట్రోపాలిటన్ కోర్టు జడ్జి ఆస్పత్రికి చేరుకొని బాధితురాలి నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. మరోవైపు బాధితురాలికి పెద్ద ప్రమాదం ఏమీలేదని తేల్చడంతో సుజాత ఆస్పత్రి వైద్యులు తేల్చడంతో... అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి ఆమెను తరలించారు. ఇదిలా ఉండగా తమ కుమార్తెపై హత్యాయత్నం విషయం తెలుసుకున్న రవళి తండ్రి గోపి భార్యతో కలిసి ఆస్పత్రికి వచ్చే సమయంలో రోడ్డు ప్రమాదానికిగురై రవళి చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోనే చేరారు.
సోమవారం ఉదయం 9.05 గంటలు దాటింది. తరగతులు ప్రారంభమవుతుండడంతో విద్యార్థులు లోనికి వస్తున్నారు. కళాశాల ప్రధాన ద్వారం గ్రిల్స్ అప్పుడే వేస్తున్నారు. నేను లోపలే ఉన్నాను. ఆ సమయంలోనే బయటికి చూస్తుండగా ప్రదీప్ అనుమానాస్పదంగా వస్తున్నాడు. నాకు అనుమానం వచ్చి బయటికి వెళ్లేందుకు యత్నించా. మా మిత్రులు అడ్డుగా ఉన్నారు. అదే సమయంలో రవళి తలపై ప్రదీప్ వేటకొడవలితో రెండుసార్లు దాడి చేశాడు. ఆమె రక్తపు మడుగులో పడిపోయింది. వెంటనే నేను హెల్మెట్ తీసుకొని అక్కడికి వెళ్లాను. రవళి బతికే ఉందని గ్రహించిన ప్రదీప్ మరోసారి ఆమె మెడపై నరకాలని కసిగా మళ్లీ వస్తున్నాడు. ఆ సమయంలోనే నేను అడ్డుగా వెళ్లాను. నాపై కూడా దాడికియత్నించాడు. నేను హెల్మెట్‌తో అతన్ని కొట్టాను. అనంతరం విద్యార్థులు నాతో కలిశారు. ప్రదీప్‌కు, నాకు పెనుగులాట జరిగింది. ఇంతలోనే తన వెంట తెచ్చుకున్న విషం తాగాడు. ఇది గమనించిన అధ్యాపకులు, విద్యార్థులు ఇద్దరినీ వేర్వేరుగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ పెనుగులాటలో నాకు దెబ్బలు తగల్లేదు. కింద పడడంతో చేతికి నొప్పిగా ఉంది. ఒక్క నిమిషం ఆలస్యంగా వెళ్లినా రవళి చనిపోయేది.
-ప్రవీణ్ కుమార్, ల్యాబ్ ఇన్‌చార్జి
నా కళ్ల ముందే దాడి చేశాడు
జూనియరైన రవళి నా ముందు నుంచే నడిచి వెళుతోంది. దాదాపు ఉదయం 9.05 గంటల సమయంలో తన వెనుక నుంచి కళాశాల యూనిఫారంలోనే వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా బ్యాగ్‌లో నుంచి వేట కొడవలి తీసి రవళి తల, చేతిపై గాయపరిచాడు. ఈ ఘటనతో మేమంతా తీవ్ర భయానికి గురయ్యాం. పక్కనే ఉన్న అధ్యాపకులు, విద్యార్థులు అతన్ని పట్టుకున్నారు. ఇంతలోనే తన వెంట తెచ్చుకున్న విషాన్ని తాగేశాడు. యూనిఫారంలో రావడంతో అతన్ని గుర్తించలేకపోయాం. ఇంకా ఫస్టియర్ విద్యార్థులు చేరుతున్నందున వారికి గుర్తింపు కార్డులు ఇవ్వలేదు.
- లక్ష్మి