
సంబురాల ‘కోట’
- ఖిలావరంగల్‌లో అంబరాన్నంటిన స్వాతంత్య్ర వేడుకలు
- ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
- అలరించిన ప్రభుత్వ శకటాల ప్రదర్శన
- కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు
ఖిలా వరంగల్, హన్మకొండ అర్బన్ : స్వాతంత్య్ర వేడుకలతో చారిత్రక ప్రాంతమైక ఖిలావరంగల్ కోట పులకించింది. గతంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, కళాకారులు, విద్యార్థులు, ప్రభుత్వ సిబ్బంది ఎక్కువగా ఉండేవారు. కానీ.. జిల్లా చరిత్రలో మొదటిసారిగా ఖిలావరంగల్ కోటలో శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో సామాన్యులు అధిక సంఖ్యలో హాజరుకావడంతో పండుగ వాతావరణం నెలకొంది. మధ్య కోటలోని ఖుష్‌మహల్ సమీపంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహానుభావులు, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగమూర్తులకు ఘనంగా నివాళులర్పించారు. మామునూరు డీఎస్పీ, పరేడ్ కమాండెంట్ సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో 53 మంది పోలీసులు చేపట్టిన గౌరవ వందనాన్ని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అందుకున్నారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు, ఉత్తమ అధికారులు, సేవా సంస్థ ప్రతినిధులకు ఆయన ప్రశంసాపత్రాలు అందజేశారు.
కోట కళకళ
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజల రాకపోకలతో కోట ప్రాంగణం కళకళాడింది. ఉదయం 10.05 నుంచి 11 గంటల వరకు ప్రభుత్వ శకటాల ప్రదర్శన కొనసాగింది. ఐటీడీఏ శకటం ముందు ఏర్పాటు చేసిన బంజారా నృతం, గ్రామీణాభివృద్ధి శాఖ శకటం ముందు ఏర్పా టు చేసిన బోనాల పండుగ నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. డీఆర్‌డీఏ సిబ్బంది వంద మీటర్ల త్రివర్ణపతాకంతో చేసిన పరేడ్ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతకు ముందు హైదరాబాద్ పోలీసులకు ఇటీవల అందుబాటులోకి తెచ్చిన వాహనాలతో ప్రత్యేక పరేడ్ చేయించారు. ఐదు ద్విచక్ర వాహనాలు, రెండు ఇన్నోవా వాహనాలతో జరిగిన పరేడ్‌ను ప్రజలు ఆసక్తిగా తిలకిం చారు. అయితే వేడుకల ప్రాంగణంలో మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
వ్యవసాయ శకటానికి ప్రథమ బహుమతి
ఉత్సవాల్లో వివిధ ప్రభుత్వ శాఖలు తమతమ కార్యక్రమాలను తెలియజేస్తూ శకటాలను ప్రదర్శించాయి. వ్యవసాయ శాఖ, వైద్యారోగ్యం, డ్వామా, పర్యాటక, సర్వశిక్షాభియాన్, 108, ఆర్‌డబ్ల్యూఎస్, మైనర్ ఇరిగేషన్, బిందుసేద్యం, పశుసంవర్థక, డీఆర్‌డీఏ, అటవీ శాఖలు ప్రదర్శించిన శకటాలు అందరినీ ఆకట్టుకున్నారుు. వీటిలో వ్యవసాయశాఖకు ప్రథమ, ఏపీఎంఐపీకి ద్వితీయ, సర్వశిక్షాభియాన్‌కు తృతీయ బహుమతులు దక్కాయి.
కట్టిపడేసిన సాంస్కృతిక ప్రదర్శనలు
స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిద పాఠశాలల చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. మొత్తం 900మంది విద్యార్థులు ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ముందుగా ధర్మసాగర్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థులు జయ జయహే తెలంగాణ గేయూనికి బృంద నృత్యం చేశారు. అనంతరం హన్మకొండ సెయింట్‌పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, వరంగల్ రిషి హైస్కూల్ విద్యార్థులు నిర్వహించిన తీజ్ సంప్రదాయ నృత్యం ఉత్సాహపరిచింది. మల్లికాంబ మనోవికాస కేంద్రం విద్యార్థుల ప్రదర్శన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మడికొండ సాంఘిక సంక్షేమ గురుకులం, వాగ్ధేవి హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శనలో భాగస్వాములయ్యూరు.
వల్లంపట్ల నాగేశ్వరరావు అధ్వర్యంలో వివిధ భాషలకు చెందిన దేశభక్తిగీతాలను విద్యార్థులు ఆలపించారు. ముగ్ధుం వ్యాఖ్యానం ప్రత్యేకంగా నిలిచింది. అనంతరం న్యాయనిర్ణేతలు విజేతలను ఎంపిక చేశారు. మల్లికాంబ విద్యార్థులు ప్రథమ, ఫాతిమా ప్రభుత్వ సహాయక పాఠశాల విద్యార్థులు ద్వితీయ, ధర్మసాగర్ కస్తూర్బా విద్యార్థులు తృతీయ స్థానాల్లో నిలిచారు. మడి కొండ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు నాలుగో స్థానంలో నిలవగా... వీరికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అన్ని పాఠశాలల విద్యార్థులకు కన్సోలేషన్ బహుమతులు అందజేశారు.
వేడుకలకు పటిష్ట బందోబస్తు
స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో ఖిలావరంగల్ కోటను పోలీసుల స్వాధీనంలోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు ఆదేశాల మేరకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నగర డీఎస్పీ రాజమహేంద్ర నాయక్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వేడుకల బందోబస్తులో ముగ్గురు ఓఎస్‌డీలు, నలుగురు డీఎస్పీలు, 15మంది సీఐలు. 20మంది ఎస్సైలతోపాటు 500 మంది కానిస్టేబుళ్లు బం దోబస్తులో పాల్గొన్నారు. వేడుకల్లో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కొండా సురేఖ, వినయ్‌బాస్కర్, అరూరి రమేష్, కలెక్టర్ జి.కిషన్, వరంగల్ రూరల్, అర్బన్ ఎస్పీలు లేళ్ల కాళి దాసు, వెంకటేశ్వర్‌రావు, జిల్లా రెవెన్యూ అధికారి సురేంద్రకరణ్ తదితరులు పాల్గొన్నారు.