కార్డన్ సెర్చ్‌లో అధికారులు గుర్తించిన ఇసుక డంప్ (ఫైల్)
ఖానాపూర్ : జిల్లాలోని ఖానాపూర్, పెంబి మండలాల్లోని వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. వాగులతోపాటు అటవీ ప్రాంతంలోని ఒర్రెల నుంచి కూడా ఇసుకను తరలించి సమీప గ్రామాల్లో పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా జిల్లా కేంద్రంతోపాటు ఇతర మండలాలకు తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా పట్టపగలే జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రధాన రోడ్ల గుండా దినమంతా ట్రాక్టర్లతో ఇసుక అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకున్న అధకారి లేడు. అంతేకాకుండా ఖానాపూర్, పెంబి మండలాల్లోని ఆయా వీడీసీల ఆధ్వర్యంలో ఇసుక తరలింపునకు అనధికారికంగా టెండర్లు నిర్వహిస్తున్నా.. ఆయా శాఖల అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.
అనధికార టెండర్లు నిర్వహిస్తున్నా..
ఖానాపూర్, పెంబి మండలాల మధ్య గల రాజూరా శివారులోని పల్కేరు వాగుతోపాటు పెంబి మండలంలోని ఇటిక్యాల, పస్పుల పంచాయతీల పరిధిలోని కడెం వాగు, ఖానాపూర్ మండలంలోని సోమర్‌పేట్, బీర్నంది గ్రామాల సమీపంలోని బల్లివాగు, మండల కేంద్రం, బాదన్‌కూర్తి సమీపంలోని గోదావరి తీరం నుంచి ఇసుకను ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. ఖానాపూర్ మండలంలోని రాజూరా, పెంబి మండలంలోని మందపల్లి గ్రామాల్లో వీడీసీలు అనధికార టెండర్లు నిర్వహించినట్లు సమాచారం.
శివారు ప్రాంతాల్లో డంపులు..
అక్రమంగా తరలించిన ఇసుకను నేరుగా విక్రయించడంతోపాటు రాత్రివేళ వాగుల నుంచి తరలించిన ఇసుకను ఆయా గ్రామాల శివార్లలో.. వ్యవసాయ పొలాలు, పంటచేల వద్ద నిల్వ చేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో ప్రధాన రహదారుల వెంట కుప్పలుగా పోస్తున్నారు. ఇక్కడి నిల్వల నుంచి ట్రాక్టర్ల ద్వారా మళ్లీ జిల్లాలోని ఇతర మండలాలకు తరలించి విక్రయిస్తున్నారు.
ఎస్పీ గుర్తించినా ఆగని దందా..
ఖానాపూర్ మండలం పాతఎల్లాపూర్ పంచాయతీ పరిధిలోని ఒడ్డెవాడలో 15రోజుల క్రితం ఎస్సీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో సుమారు రూ.3లక్షల విలువ చేసే అక్రమ ఇసుక డంపులు గుర్తించారు. అయినప్పటికీ డంపులను స్వాధీనం చేసుకోవడం, శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలో ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. గతంలోనూ పలు గ్రామాల్లో అక్రమంగా ఇసుకను డంపు చేసినవారికి నోటీసులిచ్చిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ‘మామూలు’గా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.
పడిపోతున్న భూగర్భ జలాలు..
జిల్లాలోని పలు వాగులు, అటవీ ప్రాంతాల్లోని ఒర్రెల నుంచి ఇష్టారాజ్యంగా ఇసుకను తోడుతుండడంతో భూగర్భజల మట్టం తగ్గుతోంది. ఇంత పెద్ద ఎత్తున ఇసుక దందా సాగుతున్నా ఆయా శాఖల అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులు చర్యలు చేపట్టి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఆయా మండలాల రైతులు, ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
అనుమతి లేకుండా ఇసుకను ట్రాక్టర్‌లలో తరలించినా.. గ్రామాల్లో డంపు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ, మైనింగ్ అ ధికారులకు జరిమానా నిమిత్తం పంపిస్తాం. అంతేకాకుండా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇటీవల ఎల్లాపూర్‌లో ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో సుమారు రూ.3లక్షల ఇసుక డంపులను గు ర్తించి రెవెన్యూ అధికారులకు అప్పగించాం.
– ప్రసాద్, ఎస్సై, ఖానాపూర్
Comments
Please login to add a commentAdd a comment