బరితెగించిన ఇసుక స్మగ్లర్లు
- రవాణా అధికారులపై దాడికి యత్నం..
- పరుగులు పెట్టిన అధికారులు
సిరిసిల్ల : కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో బుధవా రం తెల్లవారుజామున ఇసుక స్మగ్లర్లు మోటారు వాహన తనిఖీ అధికారుల (ఎంవీఐ) పైనే దాడికి తెగబడ్డారు. ప్రాణభయంతో రవాణాశాఖ అధికారులు పరుగులు తీశారు. కరీంనగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఆదేశాల మేరకు ఏఎంవీఐ అధికారులు సిరిసిల్ల-సిద్దిపేట రహదారిపై ఇసుక లారీలను తనిఖీ చేశారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న 3 లారీలను పట్టుకుని సీజ్ చేశారు. జిల్లెల్ల వద్ద అనుమతి లేకుండా ఇసుక లారీలు జేసీబీతో లోడ్ అవుతున్నట్లు గుర్తించి.. అక్కడికి వెళ్లేం దుకు అధికారులు సిద్ధపడగా.. దాదాపు 25 మంది స్మగ్లర్లు అధికారుల వాహనాన్ని చుట్టుముట్టారు. అధికారులు వాహనం దిగగానే.. స్మగ్లర్లు దూషిస్తూ దాడికి యత్నించారు. దీంతో అధికారులు వెంటనే వాహనం లో సిద్దిపేట వైపు ముందుకెళ్లారు.
ఇసుక స్మగ్లర్లు కార్లు, బైక్‌లపై అధికారులను వెంబ డిస్తూ.. వారి వాహనాన్ని ఓవర్ టేక్ చేసి దాడికి యత్నించినట్లు సమాచారం. కాగా, అధికారులు రక్షణ కోసం 100కు ఫోన్ చేశారు. సిద్దిపేట, చిన్నకోడూరు పోలీస్‌స్టేష న్లకు హైదరాబాద్ నుంచి సమాచారం అందడంతో పెట్రోలింగ్ పోలీసులు ఎంవీఐ అధికారులను కలి శారు. సంఘటన సిరిసిల్ల పోలీస్‌స్టేషన్ పరిధి లో జరిగినట్లు తేల్చడంతో ఏఎంవీఐ సంతోష్‌రెడ్డి బుధవారం సిరిసిల్ల టౌన్ సీఐ విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఈ అంశంపై ఎస్పీ డేవిస్ జోయల్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఓవర్‌టేక్ చేయబోరుు కారు డ్రైవర్ మృతి
సిరిసిల్ల మండలం జిల్లెల్ల శివారులో బుధవారం తెల్లవారుజామున కారు చెట్టుకు ఢీకొని డ్రైవర్ మృతి చెందాడు. మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన ఎండీ.అబూస్ అలీఫ్ లారీల యజమాని. సిరిసిల్ల మానేరు వాగు నుంచి ఇసుకను లారీల్లో తరలిస్తుం టారు. ఇసుక లారీల వెంట సిద్దిపేట వైపు వెళ్తుండగా జిల్లెల్ల శివారులో అలీఫ్ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ ఎండీ.రిజ్వాన్(23) మరణించాడు. అబూస్ అలీఫ్ గాయపడగా ఆస్పత్రికి తరలించారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌కు చెందిన రిజ్వాన్ ఎంబీఏ చేసి సిద్దిపేటలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇసుక లారీల పర్మిట్లు, ఓవర్‌లోడ్‌ను పరిశీలించేందుకు వచ్చిన ఎంవీఐల వాహనాన్ని వెంబడించి ఓవర్‌టేక్ చేయబోగా జిల్లెల్ల శివారులో కారు రోడ్డు ప్రమాదానికి గురైందని పోలీసులు భావిస్తున్నారు. ఎంవీ ఐల వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి చెట్టుకు ఢీకొన్నట్లు సమాచారం.