వేదిక పనులను పరిశీలిస్తున్న సండ్ర వెంకటవీరయ్య
సాక్షి, సత్తుపల్లి: తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారికి వేదికపై కనీసం నివాళి అర్పించలేదని, ఉద్యమకారులను గౌరవించలేదని, అమరుల త్యాగాలతో భోగాలు అనుభవిస్తున్నారని టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. సత్తుపల్లిలోని కాకర్లపల్లిరోడ్ చంద్రాగార్డెన్స్‌లో ఏర్పాటు చేసి చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఎక్కడ అడ్డుకున్నారో బయటపెట్టాలని సవాల్ చేశారు. సత్తుపల్లి అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని, వ్యక్తులు ద్వారా కాదన్నారు. మాతృభూమి బిడ్డగా తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడటంతో ముందుంటామని, అయినా తెలంగాణ ఎగువ ప్రాంతమని, ఆంధ్రా దిగువ ప్రాంతమని వివరించారు. సత్తుపల్లి జిల్లాను అడ్డుకుంది కేసీఆర్ అని.. జిల్లా సాధన జేఏసీకి కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని, వేదికమీద ఆ ఊసే లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ పార్టీ గిరిజన అభ్యర్థినే వేదికపై నుంచి నెట్టిన ఘనతను మూటగట్టుకుందన్నారు.
నేడు చంద్రబాబు రాక..
సత్తుపల్లి పట్టణంలో ఉదయం 10 గంటలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పర్యటిస్తారన్నారు. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ వస్తున్నారన్నారు.
రేవంత్‌రెడ్డి అరెస్ట్‌కు ఖండన..
ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా ప్రభుత్వం రెవంత్‌రెడ్డిని తలుపులు బద్ధలుకొట్టి మరీ అరెస్ట్ చేయటాన్ని సండ్ర వెంకటవీరయ్య తీవ్రంగా ఖండించారు. ఇది మంచిపద్ధతి కాదని.. తప్పుడు పద్ధతుల్లో వ్యవహరించటం ప్రజాస్వామ్యానికి తగదన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు దొడ్డా శంకర్‌రావు, కూసంపూడి మహేష్, కూసంపూడి రామారావు, కొత్తూరు ఉమామహేశ్వరరావు, వీరపనేని బాబి, సుమంత్, రతికంటి గిరిగోవర్ధన్, మల్లూరు మోహన్, కాలినేని నర్సింహారావు, వల్లభవనేని పవన్ పాల్గొన్నారు.
సండ్రను భారీ మెజార్టీతో గెలిపించాలి..
తల్లాడ: ప్రజాకూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. తల్లాడలో టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజాకూటమి కార్యకర్తలను కలిసి మాట్లాడారు. వెంకటవీరయ్యకు భారీ మెజార్టీ వచ్చే విధంగా కార్యకర్తలు పని చేయాలన్నారు. రాష్ట్రంలో రానున్నది ప్రజా కూటమి ప్రభుత్వమేనని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పగడాల లచ్చిరెడ్డి, దగ్గుల వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రజా కూటమిదే ప్రభుత్వం ..
కల్లూరురూరల్: రాష్ట్రంలో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యే పరిస్థితి ఏర్పడిందని టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని చిన్నకోరుకొండిలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది సీట్లు గెలుస్తామన్నారు. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలనకు చివరి రోజులు వచ్చాయన్నారు. కేసీఆర్ మోసాలు ఎంతోకాలం సాగవని, ప్రజలు ఓటు ద్వారా తీర్పు ఇవ్వనున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, బూదాటి నారపురెడ్డి, రెడ్డి నర్సింహారావు, తోట జనార్ధన్, నామా మైసయ్య, భూక్యా శివకుమార్ నాయక్, ఉన్నం రాజ, దుర్గం కృష్ణ, ఎస్‌కే షమి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment