సాక్షి, హైదరాబాద్ : అత్తమామలు, భర్త తనను వేధిస్తున్నారంటూ 54 రోజులుగా సంగీత దీక్ష చేసిన ఇంటి వద్ద గురువారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లేందుకు సంగీత ప్రయత్నించారు. శ్రీనివాసరెడ్డి, సంగీతల కేసును విచారించిన మియాపూర్ ఫ్యామిలీ కోర్టు ఆమెను ఇంట్లోనే ఉండనివ్వాలని, నెలకు రూ. 20 వేలు భరణంగా చెల్లించాలని తీర్పు చెప్పింది.
దీంతో కోర్టు నుంచి బోడుప్పల్‌లోని ఇంటి వద్దకు చేరుకున్న సంగీత తలుపు తాళం పగులగొట్టారు. అనంతరం కూతురుతో తలుపు గడి తీయించి, ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు.
పాప భవిష్యత్ ముఖ్యం
ఇంటి తాళం పగులగొడుతున్న సంగీతకు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. కోర్టు తీర్పుతో సంగీతకు కొంత బలం చేకూరిందని చెప్పాయి. కోర్టు తీర్పుతో కాకుండా సంగీత అత్తమామలు వచ్చి ఆమెను ఇంట్లోకి తీసుకెళ్తే బావుండేదని అభిప్రాయపడ్డాయి. పాప భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని శ్రీనివాస రెడ్డి, సంగీతతో రాజీకి రావాలని కోరాయి.
సంతోషంగా చూసుకుంటే తీసేస్తాను..
కోర్టు తీర్పు నేపథ్యంలోపై సంగీత ‘సాక్షి’తో మాట్లాడారు. 54 రోజులుగా ఇంటి బయటే దీక్ష చేశానని చెప్పారు. అత్తింటివాళ్లు వస్తారని ఎదురుచూశానని తెలిపారు. శ్రీనివాస రెడ్డి వస్తే కలసి జీవించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. శ్రీనివాస రెడ్డికి వివాహేతర సంబధాలు ఉండటం వల్లే ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయని చెప్పారు.
హ్యాపీ ఉంటున్నామని అనుకున్న రోజే కేసును ఉపసంహరించుకుంటానని వెల్లడించారు. పెళ్లి అయిన నాటి నుంచి తాను ఈ ఇంట్లోనే నివాసం ఉంటున్నానని చెప్పారు. అందుకే కోర్టు తీర్పు అనంతరం తాళం పగులగొట్టి లోపలికి వెళ్తున్నానని తెలిపారు.
చాలా నష్టం జరిగింది : శ్రీనివాస రెడ్డి
కోర్టు తీర్పు వల్ల తమకు చాలా నష్టం జరిగిందని బహిష్కృత టీఆర్‌ఎస్ నేత, సంగీత భర్త శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం పిటిషన్ దాఖలు చేయగా.. గురువారమే ఉత్తర్వులు రావడం బాధకరమని చెప్పారు. తాను సంగీతతో కలసివుండాలంటే కేసును ఉపసంహరించుకోవాల్సిందేనని తెలిపారు.
సంగీత డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో.. బోడుప్పల్‌లోని ఇల్లు తన తల్లిదండ్రులదని చెప్పారు. ఆ ఇంటితో తనకు సంబంధం లేదన్నారు. సంగీతకు నిజంగా నాతో జీవించాలని ఉంటే తానెక్కడ ఉంటే ఆమె అక్కడే ఉండాలన్నారు. అందుకు ఇష్టపడితే తాను ఎక్కడ ఉంటున్నానో ఆమెకు చెబుతానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment