మంటల వెనుక మిస్టరీ
సారిక, ముగ్గురు పిల్లల మృతిపై అనుమానాలు
గ్యాస్ లీక్, మంటల వ్యాప్తికి కారకులెవరు?
ఫోరెన్సిక్ నివేదికే కీలకం
పోస్టుమార్టంను వీడియోలో చిత్రీకరించిన పోలీసులు
ఎంజీఎం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనవళ్లు అభినవ్(7), అయోన్(3), శ్రీయోన్(3) సజీవదహనం ఘటన దర్యాప్తులో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకంగా మారనుంది. నలుగురి మృతికి కారణమైన భారీ మంటలు ఎలా వ్యాపించాయనేది ఈ కేసులో మిస్టరీగా మారింది. హన్మకొండ రెవెన్యూ కాలనీలోని రాజయ్య స్వగృహంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన సజీవ దహనం ఘటనకు సంబంధించి నాలుగు మృతదేహాలకు గురువారం ఉదయం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను సారిక తల్లి, ఆమె తరఫు బంధువులకు అప్పగించారు.
శ్వాసనాళాల్లో పొగ..
రాజయ్య ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన కోడలు సారిక, ముగ్గురు మనువళ్లు సజీవ దహనం కాగా, ఘటన జరిగిన గదిలో వంటగ్యాస్ సిలిండర్ లీక్ కావడమే మంటలు చెలరేగడానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సారిక గ్యాస్ లీక్ చేసిందా? మరెవరైనా నిప్పంటించి హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. తొలుత సారిక పెద్దకుమారుడు అభినవ్‌తో పాటు ఆమెకు మంటలు వ్యాపించాయని, ఆ తర్వాత శ్రీయోన్, అయోన్‌కు మంటలు అంటుకున్నాయని తెలుస్తోంది. ఈ సమయంలో వ్యాపించిన పొగ కారణంగా ముగ్గురు చిన్నారులు కొట్టుమిట్టాడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మృతుల శ్వాసనాళాల్లో పొగ ఆనవాళ్లను వైద్యులు కనుగొన్నట్లు సమాచారం. అలాగే, ప్రమాదం జరిగిన గదిలో గంట పాటు నిర్విరామంగా మంటలు చెలరేగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
సిలిండర్లు పేలకపోవడంపై అనుమానాలు..
సారిక గదిలో ఉన్న సిలిండర్ల నుంచి గ్యాస్ లీక్ కావడం, ఆపై అగ్నిప్రమాదం జరిగినట్లు తె లుస్తున్నా.. సిలిండర్ పేలకపోవడంపై అనమానాలు వెల్లువెత్తుతున్నాయి. మంటల కారణంగా ఒకటే సిలిండర్ కాలినట్లు ఉండగా.. మరొకటి మాములుగానే ఉండడం చర్చనీ యాంశంగా మారింది. గ్యాస్‌లీక్‌తో మంట లు వస్తే పెద్దఎత్తున పేలుడు జరిగిఉండాలి. అలా జరగకపోవడం ఏమిటనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇక సారిక, ఆమె కుమారుల సజీ వ దహనం తర్వాత గదిలో సిలిండర్లు ప్రత్యక్షమైనట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
ఫోరెన్సిక్ నివేదికే ఆధారం..
సారికతో పాటు ముగ్గురు చిన్నారుల సజీవ దహనమైన ఘటనలో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికే కీలకంగా మారనుంది. సారిక ఆత్మహత్య చేసుకుందా లేక హత్యకు గురయ్యిందా అనే అంశం నిర్ధారించడంలో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికే ముఖ్యమని చెప్పొచ్చు. దీంతో పోస్టుమార్టం నిర్వహించిన సమయంలో వెలుగు చూసిన అంశాలు, మృతదేహాల భాగాలను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించనున్నారు. వీటిని పరిశీలించాక ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక పంపిస్తే తప్ప సారిక, ఆమె కుమారులది హత్యా, ఆత్మహత్యా అనేది ధృవీకరించడం సాధ్యం కాదని పోలీసులతో పాటు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక సారికతో పాటు ముగ్గురు చిన్నారులు మంగళవారం రాత్రి తీసుకున్న భోజనంలో ఏమైనా మత్తు పదార్థాలు కలిశాయా అనే కోణంలోనూ పోస్టుమార్టం సందర్భంగా నిపుణులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఎంజీఎంలో 26 గంటలు..
సారిక, ఆమె ముగ్గురు కుమారుల మృతదేహాలను బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఎంజీఎం మార్చురీకి తీసుకురాగా, గురువారం సాయంత్రం ఐదు గంటలకు.. అంటే 26 గంటల తర్వాత పోస్టుమార్టం పూర్తయింది.
కాగా, సుమారు రెండున్నర గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించగా మొత్తం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించారు. సజీవ దహనమైన నలుగురు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కుటుంబీకులు కావడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని అడుగులు వేస్తున్నారు. ఇది హత్యా, ఆత్మహత్యా అనే అంశాన్ని ఛేదించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా అక్కడి నిపుణులతో కలిసి పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.