RAJAIAH sirisilla former MP
-
రాజయ్య కుటుంబానికి బెయిల్ నిరాకరణ
వరంగల్ లీగల్: వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, అయన భార్య మాధవి, కుమారుడు అనిల్‌కుమార్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను బుధవారం రెండవ అదనపు జిల్లా కోర్టు జడ్జి యార రేణుక తిరస్కరించారు. గత సంవత్సరం నవంబర్ 4న అర్ధరాత్రి రాజయ్య కోడలు, ఆమె మనవళ్లు మతిచెందడంపై అనిల్‌కుమార్, రాజయ్య, మాధవి, అనిల్‌కుమార్ రెండో భార్య సనాలపై కేసు నమోదు చేశారు. బెయిల్ కోసం రాజయ్య, మాధవిలు ఇప్పటి వరకు నాలుగుమార్లు, అనిల్‌కుమార్ మూడవసారి కోర్టును ఆశ్రయించగా కోర్టు బెరుుల్ తిరస్కరించింది. కేసు విచారణ కొనసాగుతుందని ఇంకా రిపోర్టులు రావాల్సి ఉందని, నిందుతులకు బెయిల్ ఇస్తే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. -
రాజయ్యకు ఖైదీ నంబర్ 2971
-
ఖైదీ నంబర్ 2971
వరంగల్ కేంద్ర కారాగారంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు ఖైదీ నంబర్ 2971, ఆయన భార్య మాధవికి 7856, కుమారుడు అనిల్‌కు 2970 నంబర్లు కేటాయించారు. సారిక, ముగ్గురు పిల్లల సజీవ దహనం కేసులో వీరిపై ఐపీసీ 306, 498 ఏ, సీఆర్పీసీ 174 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు కాగా, 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. వీరిలో అనిల్ ఏ-1, రాజయ్య, మాధవి, అనిల్ రెండో భార్య సన ఏ-2, ఏ-3, ఏ-4 నిందితులుగా ఉన్నారు. కాగా, గృహహింస చట్టం కింద కేసు నమోదు కావడంతో రాజయ్యను కాంగ్రెస్ నుంచి బహిష్కరించే యోచనలో పీసీసీ ఉన్నట్లు తెలిసింది. ఇక రాజయ్య భార్య మాధవి యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ బయోటెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు 48 గంటలు రిమాండ్ ఖైదీగా ఉంటే సస్పెండ్ చేయాలనే నిబంధనలు ఉండగా.. శనివారం ఆమెకు బెయిల్ రాకుంటే యూనివర్సిటీ అధికారులు సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉంది. -
అనుబంధాల ‘సారిక’
అందరితో ఆప్యాయంగా మాట్లాడేది.. ఆమె పలకరిస్తే అత్త తిట్టేది.. అభినవ్ స్కూల్లో ఆక్టివ్‌గా ఉండేవాడు.. జ్ఞాపకాలు చెబుతూ విలపించిన స్థానికులు హన్మకొండ చౌరస్తా : పిన్ని, ఆంటీ, అక్క, వదినా ఇలా ప్రతి ఒక్కరినీ వరుసలతో పలకరిస్తూ అనుబంధాలు పెనవేసుకుంటూ మాట్లాడేది.. రోజు సాయంత్రం ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకుని గల్లీలో వాకింగ్ చేస్తూ ఎదురుపడే వారిని ఆప్యాయంగా పలకరించేది.. ఇవి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ య్య కోడలు సారికతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ స్థానికులు చెప్పిన మాటలు. సారికతో పాటు ముక్కు పచ్చలారని ముగ్గురు చిన్నారులు అగ్నికి ఆహుతి కాగా.. ఆ ఘట నను స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. రోజూ తమకు కనిపించేవారు లేరన్న విషయాన్ని తలుచుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సందర్భంగా హన్మకొండ రెవెన్యూ కాలనీలో సారిక, ఆమె కుమారులు సజీవ దహనమైన గృహం వద్ద చుట్టు పక్కల వారిని ‘సాక్షి’ పలకరించగా పలు విషయాలు చెప్పుకొచ్చారు. సారిక అత్త రాక్షసి.. వాడలో అందరితో కలివిడిగా ఉంటే సారిక ఎవరితోనైనా మాట్లాడినట్లుగా కనిపిస్తే చాలు ఆమె అత్త(మాజీ ఎంపీ రాజయ్య భార్య) మాధవి బూతులు తిట్టేదని స్థానికులు చె ప్పారు. ఈ వాడలో ఎవరితో సఖ్యతతో ఉండడం తెలియని ఆమె రాక్షసిలా వ్యవహరించేదని పేర్కొన్నారు. గత ఏడాది సారిక ఆత్మహత్యకు యత్నించిన పదిహేను రోజుల తర్వాత ఇంటి బయట కనిపిస్తే పలకరించినందుకు వాడలో అందరిని కలిపి బూతులు తిట్టిందన్నారు. అప్పటి నుంచి సారిక అత్త ఇంట్లో ఉందటే చాలు ఆ ఇంటి ముఖం కూడా చూడకపోయేవారమన్నారు. సారిక అత్త చదువుకున్నా సం స్కారంలేని ఆడది అని ఛీత్కరించుకున్నారు. రెండో పెళ్లి చేసిందే అత్త.. రాజయ్య కొడుకు అనిల్‌కు రెండో పెళ్లి చేసిందే సారిక అత్త అని స్థానికులు చెబుతున్నారు. సారికకు పెద్ద కొడుకు పుట్టగానే కాజీపేటకు చెందిన ముస్లిం యువతితో దగ్గరుండి పెళ్లి చేసిందన్నారు. రెండో భార్యకు కూడా ప్రస్తుతం ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిసింది. సెంటిమెంట్‌తో అభినవ్‌కు పిలుపు.. వరంగల్ ఎంపీ స్థానానికి నామినేషన్ వేసిన రాజయ్య ఆ రోజు తన మనవడు అభినవ్‌ను పిలిపించుకున్నట్లు స్కూల్ యాజమాన్యం చెబుతోంది. అభినవ్ అంటే రాజయ్యకు ఇష్టమని, గతంలో ఎంపీగా గెలిచినప్పడు కూడా అభినవ్ చేతిత నామినేషన్ తీసుకువెళ్లినందున అదే సెంటిమెంట్‌తో ఈసారీ పిలిపించినట్లు సమాచారం. పీఎఫ్ డబ్బులతో కిరాణ సరుకులు కొనుగోలు.. సారిక సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేసినప్పుడు పీఎఫ్‌గా వచ్చిన డబ్బుతోనే కిరాణ సరుకులు, బియ్యం కొనుగోలు చేసుకునేదని సమాచారం. మూడు నెలల క్రితం ఆ డబ్బు అయిపోవడంతో పాత మిత్రుల సహకారంతో కాలం వెళ్లదీ స్తున్నట్లు తెలిసింది. సాధారణ కుటుంబ మహిళగానే వ్యవహరించేదని స్థానిక కిరాణ దుకాణ సిబ్బంది తెలిపారు. అభినవ్.. ఏ ప్లస్.. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా పిల్లలకు అవి తెలియకుండా సారిక వ్యవహరించేది. రాంనగర్‌లోని మాంటిస్సోరి స్కూల్ లో సెకండ్ క్లాస్ చదువుతున్న అభినవ్ చాలా ఆక్టివ్‌గా ఉండే వాడని ఉపాధ్యాయులు తెలిపారు. అనిల్, సారిక కలిసి 2013లో అభినవ్ యూకేజీలో ఉన్నప్పుడు తమ పాఠశాలలో చేర్పించారని మాంటిస్సోరి స్కూల్ ఇన్చార్జి అశోక్‌రెడ్డి చెప్పారు. అభినవ్ ఇటీవల జరిగిన పరీక్షల్లో ఏ ప్లస్ మార్కులు రావడం విశేషం. -
మంటల వెనుక మిస్టరీ
సారిక, ముగ్గురు పిల్లల మృతిపై అనుమానాలు గ్యాస్ లీక్, మంటల వ్యాప్తికి కారకులెవరు? ఫోరెన్సిక్ నివేదికే కీలకం పోస్టుమార్టంను వీడియోలో చిత్రీకరించిన పోలీసులు ఎంజీఎం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనవళ్లు అభినవ్(7), అయోన్(3), శ్రీయోన్(3) సజీవదహనం ఘటన దర్యాప్తులో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకంగా మారనుంది. నలుగురి మృతికి కారణమైన భారీ మంటలు ఎలా వ్యాపించాయనేది ఈ కేసులో మిస్టరీగా మారింది. హన్మకొండ రెవెన్యూ కాలనీలోని రాజయ్య స్వగృహంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన సజీవ దహనం ఘటనకు సంబంధించి నాలుగు మృతదేహాలకు గురువారం ఉదయం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను సారిక తల్లి, ఆమె తరఫు బంధువులకు అప్పగించారు. శ్వాసనాళాల్లో పొగ.. రాజయ్య ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన కోడలు సారిక, ముగ్గురు మనువళ్లు సజీవ దహనం కాగా, ఘటన జరిగిన గదిలో వంటగ్యాస్ సిలిండర్ లీక్ కావడమే మంటలు చెలరేగడానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సారిక గ్యాస్ లీక్ చేసిందా? మరెవరైనా నిప్పంటించి హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. తొలుత సారిక పెద్దకుమారుడు అభినవ్‌తో పాటు ఆమెకు మంటలు వ్యాపించాయని, ఆ తర్వాత శ్రీయోన్, అయోన్కు మంటలు అంటుకున్నాయని తెలుస్తోంది. ఈ సమయంలో వ్యాపించిన పొగ కారణంగా ముగ్గురు చిన్నారులు కొట్టుమిట్టాడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మృతుల శ్వాసనాళాల్లో పొగ ఆనవాళ్లను వైద్యులు కనుగొన్నట్లు సమాచారం. అలాగే, ప్రమాదం జరిగిన గదిలో గంట పాటు నిర్విరామంగా మంటలు చెలరేగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సిలిండర్లు పేలకపోవడంపై అనుమానాలు.. సారిక గదిలో ఉన్న సిలిండర్ల నుంచి గ్యాస్ లీక్ కావడం, ఆపై అగ్నిప్రమాదం జరిగినట్లు తె లుస్తున్నా.. సిలిండర్ పేలకపోవడంపై అనమానాలు వెల్లువెత్తుతున్నాయి. మంటల కారణంగా ఒకటే సిలిండర్ కాలినట్లు ఉండగా.. మరొకటి మాములుగానే ఉండడం చర్చనీ యాంశంగా మారింది. గ్యాస్‌లీక్‌తో మంట లు వస్తే పెద్దఎత్తున పేలుడు జరిగిఉండాలి. అలా జరగకపోవడం ఏమిటనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇక సారిక, ఆమె కుమారుల సజీ వ దహనం తర్వాత గదిలో సిలిండర్లు ప్రత్యక్షమైనట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఫోరెన్సిక్ నివేదికే ఆధారం.. సారికతో పాటు ముగ్గురు చిన్నారుల సజీవ దహనమైన ఘటనలో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికే కీలకంగా మారనుంది. సారిక ఆత్మహత్య చేసుకుందా లేక హత్యకు గురయ్యిందా అనే అంశం నిర్ధారించడంలో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికే ముఖ్యమని చెప్పొచ్చు. దీంతో పోస్టుమార్టం నిర్వహించిన సమయంలో వెలుగు చూసిన అంశాలు, మృతదేహాల భాగాలను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించనున్నారు. వీటిని పరిశీలించాక ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక పంపిస్తే తప్ప సారిక, ఆమె కుమారులది హత్యా, ఆత్మహత్యా అనేది ధృవీకరించడం సాధ్యం కాదని పోలీసులతో పాటు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక సారికతో పాటు ముగ్గురు చిన్నారులు మంగళవారం రాత్రి తీసుకున్న భోజనంలో ఏమైనా మత్తు పదార్థాలు కలిశాయా అనే కోణంలోనూ పోస్టుమార్టం సందర్భంగా నిపుణులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎంజీఎంలో 26 గంటలు.. సారిక, ఆమె ముగ్గురు కుమారుల మృతదేహాలను బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఎంజీఎం మార్చురీకి తీసుకురాగా, గురువారం సాయంత్రం ఐదు గంటలకు.. అంటే 26 గంటల తర్వాత పోస్టుమార్టం పూర్తయింది. కాగా, సుమారు రెండున్నర గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించగా మొత్తం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించారు. సజీవ దహనమైన నలుగురు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కుటుంబీకులు కావడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని అడుగులు వేస్తున్నారు. ఇది హత్యా, ఆత్మహత్యా అనే అంశాన్ని ఛేదించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా అక్కడి నిపుణులతో కలిసి పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. -
దారుణం
మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో ఘోర ప్రమాదం కోడలు సారిక సహా ముగ్గురు మనువళ్ల సజీవ దహనం గ్యాస్ లీక్ కావడంతో ఘటన హత్యా.. ఆత్మహత్యా... అని అనుమానాలు హత్య చేశారని సారిక తల్లి ఆరోపణ పోలీసుల అదుపులో ‘సిరిసిల్ల’ కుటుంబం ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ర్టంలో సంచలనం మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. రాజయ్య కోడలు సారిక, మనవళ్లు అభినవ్(7), అయోన్(5), శ్రీయోన్(5) మంగళవారం రాత్రి పడుకున్న వారు పడుకున్నట్లుగానే మంటల్లో కాలిపోయారు. గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగిందని రాజయ్య కుటుంబీకులు చెబుతుండగా.. కొంతకాలంగా జరుగుతున్న గొడవల్లో భాగంగానే తమ కుమార్తెను అత్తింటివారే హత్య చేశారని సారిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా.. అభం శుభం తెలియని చిన్నారులు మంటల్లో మాడిపోవడం ప్రతిఒక్కరినీ కలిచివేసింది. వరంగల్ క్రైం : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు కుమారుల సజీవ దహనంపై శాస్త్రీయ పద్ధతిలో విచారణ చేపడుతున్నట్లు వరంగల్ నగర పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. సంఘటనా ప్రదేశం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఫోరెన్సిక్ టీమ్‌ను రప్పిస్తున్నామని పూర్తి స్థారుులో విచారణ చేపట్టిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత నిజాలు వెలుగుచూస్తాయని పేర్కొన్నారు. విచారణకు ప్రత్యేక టీమ్... సజీవదహనం కేసును చేధించేందుకు ప్రత్యేకం గా పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఏసీపీ నేతృత్వంలో నియమించనున్న ఈ బృందంలో ముగ్గురు సీఐ లు విచారణ అధికారులుగా ఉంటారన్నారు. పలుమార్లు ఘటనా ప్రదేశానికి సీపీ ఇదిలా ఉండగా ఘటన జరిగిన రాజయ్య ఇం టికి ఉదయమే చేరుకున్న సీపీ సుధీర్‌బాబు అ క్కడే ఉండి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే, ఘటన జరిగిన గదిని ప్రత్యేకంగా పరి శీలించిన సీపీ ఆ తర్వాత కూడా పలుమార్లు సం ఘటన ప్రదేశానికి వెళ్లడం గమనార్హం. అక్కడి ఆనవాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పోచమ్మమైదాన్ : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఆయన కోడలు, మనుమలు మృతి చెందిన విషయం బుధవారం తెల్లవారుజామున వెలుగులోకి రావడంతో అధికారులు పరిశీలించారు. ఘటనకు సంబంధించి ఎన్నికల కమిషన్ నుంచి నివేదిక అడిగే అవకాశముండడంతో అధికారులు రెవెన్యూ కాలనీలోని రాజయ్య ఇంటికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. అధికారులు పరిశీలించి వెళ్తున్న క్రమంలో మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన కలెక్టర్ కరుణ.. పోలీసు కమిషనర్ సుధీర్‌బాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఐజీ నవీన్ చంద్.. మీడియాతో మాట్లాడుతూ సారిక పడక గదిలో గ్యాస్ సిలిండర్ లభ్యమైందని తెలిపారు. తెల్లవారుజామున 4గంటలకు ఘటన జరిగిందని, ఈ ఘటనతో సంబంధం ఉన్న వాళ్ల పై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సారిక అమ్మ, చిన్నమ్మ ఘటనాస్థలికి వచ్చారని.. పోస్ట్‌మార్టం అనంతరం సారిక, అభినవ్, అయోన్, శ్రీయోన్ మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగిస్తామని తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలిని పరిశీలిస్తున్నారని, కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉందని వెల్లడించారు. ఇక వరంగల్ సీపీ సుధీర్‌బాబు ఉదయం నుంచి మృతదేహాలను తరలించే వరకు అక్కడే ఉన్నారు. ఇంకా డీఐజీ మల్లారెడ్డి, రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝ, వరంగల్ ఆర్డీఓ వెంకట మాధవరావు, వరంగల్ తహసీల్దార్ గుజ్జుల రవీందర్ ఉన్నారు.