సర్కారుస్థలంపై కలెక్టర్‌కు నివేదిక
రామగుండం :
రామగుండంలో విద్యుత్‌కేంద్రాల స్థాపనకు ప్రభుత్వ భూముల సర్వే ప్రక్రియ ముమ్మరమైంది. కలెక్టర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచడంతో సెంటుభూమి వదలకుండా నివేదికలు తయారుచేశారు. ఈ నెల 4వ తేదీన రామగుండంతో పాటు గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఎన్టీపీసీ, బీపీఎల్, జెన్‌కో, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో త్వరలోనే 600 యూనిట్ల సామర ్థ్యంతో రెండు(1200 మెగావాట్ల) విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.
యాష్‌పాండ్ స్థలం కోసం ప్రభుత్వంపై ఒత్తిడితీసుకురాగా పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహం పక్కన సర్వే నం.366,364లో 500 ఎకరాలకు పైబడి ప్రభుత్వ భూమిని గుర్తించారు. దీన్ని తమకు అప్పగించాలని ఎన్టీపీసీ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
మరోసారి సర్వే చేపట్టగా 1916కు ముందు ప్రభుత్వ భూమిగా పేర్కొన్నా.. 1936లో నిజాం సర్వే నివేదికల్లో 100 ఎకరాలకు మించి ప్రభుత్వ భూమి లేదని స్పష్టమైంది. ఫారెస్టు విభాగం వద్ద ఉన్న భూ నక్షాలు పరిశీలిస్తే వంద ఎకరాలే సర్కారు భూమి అని, మిగతా ప్రాంతం రిజర్వు ఫారెస్టులోనే ఉందని తేలింది. దీంతో ఎన్టీపీసీ యాష్‌పాండ్‌కు సరిపోదని నిర్ణయించుకుని వెనక్కి తగ్గారు.
508.32 ఎకరాల గుర్తింపు
సర్కారుకు అందించిన నివేదికలో కొంత మొత్తం ప్రైవేటు వ్యక్తుల పట్టా భూములు, అసైన్డ్ భూములూ ఉన్నట్లు రెవెన్యూ అధికారులు స్పష్టంచేశారు. కలెక్టర్‌కు స్థానిక రెవెన్యూ అధికారులు అందించిన భూ నివేదికల్లో రాయదండి శివారు పరిధిలో ప్రభుత్వ భూమి 225.37 ఎకరాలు, ప్రైవేటు పట్టా భూములు 50.21 ఎకరాలు, గోలివాడ శివారులో ప్రభుత్వ భూమి 131.24, అసైన్డ్ భూములు 16.13, పట్టాభూములు 20.23 ఎకరాలు, అంతర్గాం శివారులో ప్రభుత్వ భూములు 33.33, అసైన్డ్ 24.36, పట్టా భూములు 5.05 ఎకరాలు ఉన్నాయి. మూడు గ్రామాల్లో ప్రభుత్వ భూములు 391.14, అసైన్డ్ భూములు 41.09 ఎకరాలు, పట్టా భూములు 76.09 ఎకరాల విస్తీర్ణం గుర్తించి నివేదికను కలెక్టర్‌కు అందించారని తెలిసింది. ఈ స్థలాన్ని మరోసారి ఎన్టీపీసీ ఉన్నతాధికారుల బృందం పర్యటించే అవకాశం ఉంది.
పరిశోధనకేంద్రం స్థలాలు వెనక్కి
అంతర్గాం, రాయదండి, గోలివాడ శివారు పరిధిలోకి వచ్చే ముర్రా జాతి గేదెల అభివృద్ధి పరిశోధన కేంద్రం స్థలాలను రెవెన్యూ అధికారులు అవసరాల మేరకు దశల వారీగా వెనక్కి తీసుకోనున్నట్లు స్పష్టం చేస్తున్నారు. నిర్దేశిత గడువులోగా ప్రభుత్వం పరిశోధన కేంద్రానికి అప్పగించిన ప్రభుత్వ భూమిలో అభివృద్ధి పనులు చేపట్టలేదు. కలెక్టర్‌కు అందించిన నివేదికలో 150 ఎకరాల పరిశోధన కేంద్రానికి చెందిన స్థలం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.