ఆత్మహత్యలపై నివేదిక కోరిన రాహుల్
బెంగళూరు: కర్ణాటకలో జరుగుతున్న రైతుల వరుస ఆత్మహత్యలకు సంబంధించి నివేదికలు ఇవ్వాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అధ్యక్షుడు పరమేశ్వర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరి నుంచి రెండు వేర్వేరు నివేదికలు ఇవ్వాలని ఆయన సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో రెండు నెలల్లోనే 58 మంది రైతులు వివిధ కారణాల తో బలవన్మరణాలకు పాల్పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బెళగావిలోని సువర్ణ విధాన సౌధలో ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు జరుగుతాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ వరుస ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. ఈ విషయమై కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ నాయకులు యజమానులుగాగల చక్కెర కర్మాగారాల నుంచి బకాయిలు రైతులకు అందకపోవడమే ఈ సమస్యకు కారణమని విపక్షాలతోపాటు ప్రజలు కూడా భావిస్తున్నారు. ఈ విషయమై ఇక్కడి పత్రికలే కాకుండా జాతీయస్థాయి మీడియా కూడా వరుస కథనాలు ప్రచురిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిలో ప్రస్తుతం కాస్త పట్టు ఉన్న పెద్ద రాష్ట్రం కర్ణాటకనే. అయితే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టంలోనే వరుసగా రైతుల ఆత్మహత్యలు జరుగుతుండడం అందులోనూ ఆ పార్టీ నాయకుల పరోక్ష ప్రమేయంగల కారణాలతో ఈ సంఘటనలు చోటుచేసుకోవడం కాంగ్రెస్ హైకమాండ్‌ను కలవరపెడుతోంది.
మరోవైపు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాహుల్‌గాంధీ పర్యటిస్తూ మోదీవి రైతు సంక్షేమానికి విఘాతం కలిగించే నిర్ణయాలని విమర్శిస్తున్న తరుణంలో అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుండడం ఆ పార్టీ హై కమాండ్‌ను ఇరుకున పెడుతోంది. ఈ నేపథ్యంలో రైతుల ఆత్మహత్యలకు కారణాలు, నివారణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అందించిన పరిహారంతోపాటు ఇక పై ఇలాంటి పరిస్థితి రాకుండా చేపట్టబోయే చర్యలు తదితర వివరాలతో కూడిన పూర్తి స్థాయి నివేదికను త్వరగా హై కమాండ్‌కు అందించాలని ‘యువరాజు’, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు ఆదేశాలు జారీచేశారు.