నిర్లక్ష్యాన్ని వీడండి...
రైతు ఆత్మహత్యలను నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై రాహుల్ మండిపాటు
త్వరలోనే బాధిత కుటుంబాలకు పరామర్శ
షెడ్యూల్ ఖరారు చేయాల్సిందిగా సీఎం, కేపీసీసీ అధ్యక్షుడికి సూచన
బెంగళూరు : రాష్ట్రంలో రైతులను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అసహనం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి పొద్దు పోయాక బెంగళూరుకు చేరుకున్న రాహుల్‌గాంధీని ఇక్కడి ఓ రిసార్ట్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలకు సంబంధించి అంశం ప్రస్తావనకు వచ్చింది. రైతుల ఆత్మహత్యల విషయంపై ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడితో రాహుల్‌గాంధీ అర్ధరాత్రి వరకు సమాలోచనలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ నెల రోజుల్లో బలవన్మరణాలకు పాల్పడ్డ రైతుల సంఖ్య 70గా ఉంది, అయితే అనధికారికంగా ఈ సంఖ్య 120 వరకు ఉండవచ్చనేది నిపుణుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో రైతుల ఆత్మహత్యలను అడ్డుకోవడంలో ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయరాదని, అది ప్రభుత్వ మనుగడకే ముప్పుగా మారుతుందని రాహుల్‌గాంధీ హెచ్చరించారు.
‘రైతుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నేను దేశంలోని వివిధ ప్రాంతాల్లో పాదయాత్రలు చేస్తున్నాను, అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే ఇలా రైతుల ఆత్మహత్యల పర్వం కొనసాగడం ఎంతమాత్రం సరికాదు. రైతులు ముఖ్యంగా అప్పుల బాధను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ సందర్భంలో బ్యాంకులు రైతులపై అప్పుల చెల్లింపునకు సంబంధించి ఒత్తిడి తీసుకురాకుండా చేయడంపై దృష్టి సారించండి. అంతేకాదు రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే దిశగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించండి’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు సూచించారు.
మీరెలాగో పోలేదు.....నేనే వెళతా....
ఇక రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత ఎస్.ఎం.కృష్ణ స్వయంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన విషయం ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎస్.ఎం.కృష్ణ తీరును మెచ్చుకున్న రాహుల్‌గాంధీ...‘అసలు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులుగా ముందుగా మంత్రులు లేదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు రైతుల కుటుంబాలను కలిసి పరామర్శించాల్సింది, తద్వారా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేయాల్సింది, అయితే మీరెలాగో వెళ్లలేదు కదా, అందుకే నేనే వెళతాను, రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబ సభ్యులను కలిసేందుకు గాను రెండు రోజుల షెడ్యూల్‌ను ఖరారు చేయండి, కర్ణాటకలో కూడా త్వరలోనే పాదయాత్ర ద్వారా రైతులను కలుస్తాను’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ సూచించిన ట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.