= లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నాహాలు
= ఢిల్లీలో మొదలైన కసరత్తు
= రాహుల్‌తో సిద్ధు, పరమేశ్వర్.. భేటీ
= డిసెంబరు రెండో వారంలోగా అభ్యర్థుల ఎంపిక
= జాగ్రత్తగా వ్యవహరించాలన్న రాహుల్
= అసమ్మతికి ఆస్కారం లేకుండా చూడాలని హితవు
= విపక్షాల్లో విభేదాలే పార్టీని గెలిపిస్తాయని ధీమా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 25 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఆ సన్నాహాల్లో భాగంగా కసరత్తును ప్రారంభించింది. ఢిల్లీలో సోమవారం ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కమిటీ సభ్యులైన రాష్ట్ర హోం మంత్రి కేజే. జార్జ్, మాజీ మంత్రి డీకే. శివకుమార్ ప్రభృతులు పాల్గొన్నారు.
లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధతపై చర్చించామని పరమేశ్వర సమావేశం అనంతరం విలేకరులకు తెలిపారు. డిసెంబరు రెండో వారంలోగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీనికి గాను కేపీసీసీ నుంచి సత్వరమే జాబితాను పంపుతామని చెప్పామని వెల్లడించారు. కాగా ఈసారి లోక్‌సభ ఎన్నికలు పార్టీకి అగ్ని పరీక్షగా మారే అవకాశాలున్నందున అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని రాహుల్ గాంధీ రాష్ర్ట నాయకులకు సూచించినట్లు సమాచారం. అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయినందున ప్రజా వ్యతిరేకతకు ఇప్పటికిప్పుడు ఆస్కారం ఉండదని అభిప్రాయపడ్డారు.
దీనికి తోడు ప్రతిపక్షాలు ఒకటిగా లేకపోవడం కూడా పార్టీకి లాభించే అంశమని పేర్కొన్నారు. ఎటు లేదన్నా 28కి గాను 25 సీట్లను గెలుచుకోవడానికి ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అసమ్మతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా చూడాలని జాగ్రత్తలు చెప్పారు. బోర్డులు, కార్పొరేషన్లకు నియామకాలను ఎన్నికల తర్వాతే చేపట్టాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. పదవులు రాని వారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడమో, అభ్యర్థుల విజయానికి పాటు పడకుండా గుంభనంగా ఉండిపోవడమో.... లాంటి పరిణామాలు సంభవించే అవకాశాలున్నందున, ఎన్నికలయ్యేంత వరకు అందరినీ ఊహా లోకంలో తేలియాడే పరిస్థితిని కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
మరో వైపు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలని ముఖ్యమంత్రికి సూచనలు అందాయి. షాదీ భాగ్య, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు విహార యాత్రలు లాంటి నిర్ణయాల వల్ల కొంత గందరగోళం నెలకొన్న విషయం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేరువైనందున, లోక్‌సభ ఎన్నికల్లో వాటి ద్వారా పార్టీకి లబ్ధి కలిగేలా చూడాలని రాహుల్ సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి.
టార్గెట్@25
Published Tue, Nov 19 2013 2:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement