అలకలు వీడి ఒక్కటై...
బెంగళూరు: రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో దావణగెరెలో నిర్వహించిన ‘సర్వోదయ’ సమావేశం కాంగ్రెస్ నేతల్లో ఒకింత ఉత్సాహాన్ని నింపిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దావణగెరెలోని బా పూజీ ఎంబీఏ కళాశాలలో కాంగ్రెస్ పార్టీ ‘సర్వోదయ’ పేరిట ఏర్పాటు చేసిన స మావేశంలో కాంగ్రెస్ నేతలంతా తమ తమ విభేదాలను మరిచి చేతులు కలపడమే ఇందుకు ముఖ్య కారణం. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కు మ్ములాటలు కొనసాగుతున్నాయి. ఇన్‌చార్జ్ మంత్రులు తమ తమ నియోజకవర్గాల వ్యవహారాల్లో ఎక్కువగా తల దూ రుస్తున్నారంటూ అధికార పార్టీకి చెంది న కొందరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎదుటే మండిపడ్డారు. ఇక మంత్రులు అసలు కేపీసీసీ కార్యాలయం వైపే రావడం లేదని, పార్టీ అధికారంలో ఉన్నా కార్యకర్తల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కావడం లేదన్న అసంతృప్తి నెలకొంది. అంతేకాక పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు మంత్రుల సహాయ సహకారాలు లభించడం లేదని కూడా పార్టీ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదే సందర్భంలో రాష్ట్రంలో అ ధికారాన్ని చేపట్టి రెండేళ్లు కావస్తున్నా మంత్రి వర్గ విస్తరణ చేపట్టకపోవడంతోపాటు కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర్‌ను మంత్రి పదవికి దూరంగా ఉంచ డం వంటి కారణాలన్నీ ప్రభుత్వానికి, పార్టీకి మధ్య దూరాన్ని పెంచేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల్లోనే ఒకరంటే ఇంకొకరికి పడటం లేదంటూ చర్చ సాగింది. అయితే దావణగెరెలో నిర్వహించిన ‘సర్వోదయ’ సమావేశంలో కాంగ్రెస్ నేతలు తమ కుమ్ములాటలను పక్కన పెట్టి అందరూ చేతులు కలపడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దావణగెరెలో నిర్వహించిన సర్వోదయ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి గులామ్ నబీ ఆజాద్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్, మంత్రులు ఆంజనేయ, డి.కె.శివకుమార్, మహదేవ ప్రసాద్, శామనూరు శివశంకరప్ప తదితరులు పాల్గొన్నారు.
సమావేశం పై వరుణుడి ప్రతాపం
దావణగెరెలో నిర్వహించిన ‘సర్వోదయ’ సమావేశం పై వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. శనివారం ఉదయం సమావేశం ప్రారంభం కాగానే దావణగెరెలో వర్షం ప్రారంభమైంది. దీంతో అక్కడికి చేరుకున్న వందలాది మంది కార్యకర్తలు తాము కూర్చున్న కుర్చీలను తీసుకొని వర్షానికి అడ్డుగా తలపై పెట్టుకొని నాయకుల ప్రసంగాలను వినాల్సి వచ్చింది.