సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలను మూడు నెలల ముందే నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది మే నెల చివరినాటికి సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అందుకు సంబంధించి కసరత్తు కూడా ప్రారంభించింది. ముందుగా నిర్వహించాల్సిన అవసరాన్ని తెలుపుతూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013 జూలైలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో గెలిచిన సర్పంచుల పదవీకాలం అదే ఏడాది ఆగస్టు 2 నుంచి ప్రారంభమైంది. ఐదేళ్ల పదవీకాలం వచ్చే ఏడాది (2018) ఆగస్టు ఒకటో తేదీతో ముగియనుంది. ఆలోగా ఎన్నికలు నిర్వహించాలి. జూన్, జూలైలో పాఠశాలలు ప్రారంభమవుతాయి. అదే సమయంలో రైతులు ఖరీఫ్ పనులో బిజీగా ఉంటారు.
ఈ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ తర్వాత మే నెలలో ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని, అప్పటికల్లా విద్యార్థుల పరీక్షలు కూడా పూర్తవుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ఇ(3ఎ) ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల పదవీకాలం ముగియక ముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుంది. సెక్షన్ 13(2) ప్రకారం గడువు కన్నా మూడు నెలలు ముందుగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారాలున్నాయి. రాజ్యాంగం కల్పించిన ఈ వెసులుబాటు మేరకు గడువు కన్నా ముందుగానే ఎన్నికల ప్రక్రియను చేపట్టేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదికతో రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన యంత్రాంగాన్ని సమాయత్తం చేసుకోవడం కోసం ఈసీ షెడ్యూల్ కూడా రూపొందించింది.
యంత్రాంగాన్ని సిద్ధం చేయండి
వచ్చే ఏడాది మే చివరికల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది. ఈ మేరకు ఈ ఏడాది నవంబర్ 30 నాటికి గ్రామ పంచాయతీల జాబితా ఖరారు చేసి, డిసెంబర్ నాటికి వార్డుల పునర్విభజనను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఏప్రిల్ 16లోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని కోరింది. గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించడం, ముద్రణ పనులను మార్చి 15 కల్లా పూర్తి చేస్తామని తెలిపింది. ఏప్రిల్ 17లోగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, మే 31లోగా ఎన్నికల నిర్వహణను ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు.
ఓటర్ల జాబితా తయారు చేసేందుకు అవసరమైన పాలనా యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని, పోలింగ్ సామగ్రి, రవాణా సదుపాయాలను సమకూర్చుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్‌కు ఎన్నికల సంఘం సూచించింది. గ్రామ పంచాయతీల్లో వార్డుల సంఖ్యకు సమానంగా పోలింగ్ స్టేషన్లు ఉండాలని, ప్రతి వార్డులో పోలింగ్ స్టేషన్ తప్పనిసరని పేర్కొంది. 200 మంది ఓటర్లున్న పోలింగ్ స్టేషన్‌కు ఒక ప్రిసైడింగ్ అధికారితోపాటు ఒక పోలింగ్ అధికారి, 400 లోపు ఓటర్లు ఉంటే ఇద్దరు, ఆపైన ఉంటే ముగ్గురు పోలింగ్ అధికారులు తప్పనిసరని స్పష్టంచేసింది. ఈ మేరకు జిల్లా, డివిజన్ స్థాయిలో ఏర్పాట్లు చేసి తమకు నివేదిక పంపాలని సూచించింది.
సర్కారు ముందుకొస్తుందా?
రాష్ట్రంలో దాదాపు 8,691 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ ఎన్నికలు పార్టీరహితంగా జరగనున్నాయి. కానీ గ్రామాల్లో పూర్తిగా రాజకీయపరంగానే జరుగుతాయి. గ్రామస్థాయిలో పట్టుంటే తప్ప ఎన్నికలను ఎదుర్కోవడం కష్టం. 2013లో జరిగిన ఎన్నికల్లో అప్పట్లో టీఆర్‌ఎస్ ఉద్యమంలో బిజీగా ఉంది. రాష్ట్రం వచ్చే దశలో ఉన్నందున ఆ పార్టీకి దాదాపు 3 వేలకుపైగా సర్పంచి స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్‌కు కూడా అదే స్థాయిలో స్థానాలు వచ్చాయి. టీడీపీకి దాదాపు 1,500 వరకు వచ్చాయి. మిగిలిన వాటిలో వామపక్షాలు, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు ఉన్నారు. అయితే 2019లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సరిగ్గా ఏడాది ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తుందా లేదా అన్నది ప్రశ్న.
వాస్తవంగా ఏ ప్రభుత్వం కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలతో పెట్టుకోదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాబట్టి ఎన్నికల సంఘం ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రభుత్వం మాత్రం అందుకు సుముఖంగా ఉండే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. అంతేగాక తండాలను పంచాయతీలుగా మార్చుతానని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరికొన్ని పంచాయతీలను విడదీసి కొత్త వాటిని ఏర్పాటు చేస్తానని చెప్పింది. ఈ అంశాలను సాకుగా తీసుకొని ఎన్నికలను వాయిదా వేయడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతుందని అంటున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో వెయ్యి నుంచి 1,500 వరకు తండాలను పంచాయతీలుగా చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రక్రియకు సమయం తీసుకొని పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసే వీలుందని అంటున్నారు.
గ్రామ పంచాయతీల స్వరూపం ఇలా...
200 జనాభా కలిగిన పంచాయతీలు–346
500లోపు జనాభా ఉన్నవి–870
1000లోపు జనాభా ఉన్నవి–1,733
2000లోపు జనాభా ఉన్నవి–3,029
5000లోపు జనాభా ఉన్నవి–3,104
10,000లోపు జనాభా ఉన్నవి–630
10,000కంటే ఎక్కువ జనాభా ఉన్నవి– 122
Comments
Please login to add a commentAdd a comment