కార్మికులకు వేతనాలు ఎగవేస్తున్న కంపెనీలు..
మోర్తాడ్: సౌదీకి వలస వెళ్లిన మన ప్రాంత కార్మికులు అక్కడ ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. నష్టాల్లో కూరుకుపోయిన సౌదీ కంపెనీలు కార్మికులకు 9 నెలలుగా వేతనాలు చెల్లించడంలేదు. ఆరు నెలల కింద మూతబడిన బిన్‌లాడెన్‌కు చెందిన కంపెనీ అనేకమంది కార్మికులకు వేతనాలు ఎగ్గొట్టగా ఓజర్ కంపెనీ కూడా అదే దారిలో నడిచింది. సౌదీలోని పలు కంపెనీలు లాకౌట్ ప్రకటించడంతో వేలాది మంది కార్మికులు వీధినపడ్డారు. అకా మా (వర్క్ పర్మిట్) లేకుండా బయట తిరుగుతున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దాదాపు 7,800 మంది కార్మికులకు కంపెనీలు వేతనాలు ఎగవేశాయి.
సౌదీ ఔట్ జైలులోను, నివాస ప్రాంతాలలో ఉంటున్న కార్మికులను ఇండియాలోని వారి ఇళ్లకు చేర్చడానికి విదేశాంగశాఖ ఔట్ పాస్‌పోర్టులను జారీ చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. అయితే, కార్మికులు మాత్రం సొంతంగా టిక్కెట్లు కొనుక్కొని ఇళ్లకు చేరుకోవాలి. టిక్కెట్ కొనాలంటే మన కరెన్సీలో కనీసం రూ.15 వేల నుంచి రూ. 20 వేల వరకు ఖర్చు అవుతుంది. కానీ, చేతిలో నయాపైసా లేకుండా పోయిందని, తమను ఇళ్లకు చేర్పించాలని కార్మికులు కోరుతున్నారు.