సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యా శాఖ కమిషనర్ జి.కిషన్ బదిలీ అయ్యారు. ఆ స్థానంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హాకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌గా కిషన్ రెండున్నరేళ్లు కొనసాగారు. ఉపాధ్యాయ బదిలీలు జరుగుతున్న కీలక సమయంలో ప్రభుత్వం అనూహ్యంగా బదిలీ చేయడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఆయనకు ఇప్పటివరకు ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌గా కిషన్ పలు అంశాల్లో వివాదాల్లోకెక్కారు. సాధారణంగా శాఖాపరమైన నిర్ణయాలను త్వరితగతిన తీసుకోరన్న అభిప్రాయం ఉంది. కమిషనర్ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపేవారని సమాచారం. దీంతో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగేదన్న ఆరోపణలున్నా యి. చివరికి సొంతంగా తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి.
ఉపాధ్యాయుల సెలవుల జారీలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యా శాఖాధికారికి బాధ్యతలు అప్పగించడం, స్కూల్ గ్రాంట్స్ ఖర్చులో చెక్కుల చెల్లింపులు, పాఠశాలల్లో డ్యూయల్ డెస్క్‌ల కొనుగోలులో పలు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి సీఎం వద్ద జరిగిన సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు కమిషనర్ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషనర్ నిర్ణయాలతో ప్రభుత్వంపై చెడ్డ పేరు వస్తోందంటూ పలువురు సీఎం వద్ద ఏకరువు పెట్టారు. దీంతో కిషన్ బదిలీ జరిగినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment