ఒట్టు.. తీసికట్టు! | Scum ..Fasten off! | Sakshi
Sakshi News home page

ఒట్టు.. తీసికట్టు!

Published Thu, Jul 3 2014 11:39 PM | Last Updated on Sat, Aug 11 2018 4:24 PM

ఒట్టు.. తీసికట్టు! - Sakshi

ఒట్టు.. తీసికట్టు!

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘అన్నా గిట్టుంటాదే...! నిన్న పొద్మూకే హన్మాండ్ల గుడి మీద ఒట్టేస్తిరి గదనే. వైస్ చైర్మన్ మాకే ఇత్తానంటిరి, గిప్పుడు కిరికిరి పెట్టుడు మీకు ధర్మంగాదే. మాట తప్పి మోసంజేయకుండ్రే, అవకాశం పోతే మల్లారాదే  మీకు దండం పెడతా..’
 
 కాంగ్రెస్ కౌన్సిలర్లను వేడుకుంటున్న ఓ బీజేపీకౌన్సిలర్..
 ఈ దృశ్యం సంగారెడ్డిలో దర్శనమివ్వగా.. జిల్లాలో గురువారం జరిగిన మిగతా మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నికల్లోనూ దాదాపు ఇలాంటి సీన్లే కనిపించాయి. జిల్లాలో మున్సిపాలిటీ, నగర పంచాయతీ చైర్మన్ల ఎన్నిక ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగాయి. ఎత్తులు.. పై ఎత్తులు.. భయపెట్టుడు.. బతిమిలాడుడు..బేరమాడటంలో ‘గులాబీ దళం’ ఆధిక్యతను కనబరిచింది. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు రెండు రోజులుగా ఇక్కడే మకాం వేసి చేసిన మంత్రాంగం ఫలించింది. కాంగ్రెస్, టీడీపీ కౌన్సిలర్లు రాత్రికి రాత్రే గోడదూకి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. మెదక్ మున్సిపాలిటీ మాత్రమే టీఆర్‌ఎస్ వశమవుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేయగా.. అనూహ్యం గా మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ టీఆర్‌ఎస్‌కు దక్కాయి.
 
 కాంగ్రెస్ పార్టీ చాలాచోట్ల చైర్మన్ పదవి చేపట్టడానికి ఆధిక్యం ఉన్నప్పటికీ హరీష్‌రావు ఎత్తుల ముందు ప్రత్యర్థులు ఆ పదవులను పొందలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసినప్పటికీ వ్యూహాత్మకంగా చాలాచోట్ల సమయం దాటిన తర్వాత ఎన్నికల అధికారికి విప్ జారీ పత్రాలను అందించారు. దీంతో విప్  చెల్లుబాటు కాని పరిస్థితి ఏర్పడింది.
 
 కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉన్న సదాశివపేట, జహీరాబాద్ మున్సిపాలిటీలలో టీఆర్‌ఎస్ పార్టీ చైర్మన్లను గెలుచుకుంది. హంగ్ ఉన్న గజ్వేల్ నగర పంచాయతీ, మెదక్ మున్సిపాలిటీ కూడా టీఆర్‌ఎస్ ఖాతాలోకే వెళ్లిపోయాయి. చేతులు ఎత్తే పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో చాలాచోట్ల కౌన్సిలర్లు విప్‌ను ధిక్కరించారు. సదాశివపేటలో ఆరు మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గంపగుత్తగా వెళ్లి టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. డిమాండ్‌ను బట్టి ఒక్కొక్క కౌన్సిలర్‌కు రూ. 2 లక్షల నుంచి 8 లక్షల వరకు ముట్టినట్లు ప్రచారం సాగుతోంది.  
 
 సంగారెడ్డిలో ‘విజయ’లక్ష్మి..
 సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొంగుల విజయలక్ష్మి చైర్‌పర్సన్ పదవికి ఎన్నికైనప్పటికీ త్వరలోనే టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని ఆమె ఖండించకపోవటం గమనార్హం. మొత్తం 31 వార్డులున్న సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 11 సీట్లలో గెలుపొందిన విషయం విదితమే.
 
 అయితే వీరికి 4 స్థానాలున్న బీజేపీ, మరో ముగ్గురు ఇండిపెండెంట్లు మద్దతు ఇచ్చారు. మొత్తం 18 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ పదవిని సొంతం చేసుకుంది. ముందస్తు ఒప్పందం ప్రకారం చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీకి, వైస్ చైర్మన్ పదవి బీజేపీ ఇవ్వాలని నిర్ణయించారు. చైర్మన్ అభ్యర్థి ఎన్నిక ముగియగానే.. కాంగ్రెస్ కౌన్సిలర్లు బీజేపీకి చెయ్యిచ్చి వైస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనకుండా బయటికి వచ్చేశారు.
 
 బీజేపీ నుంచి వైస్ చైర్మన్ పదవిని ఆశించిన సునీల్ ఎంత బతిమలాడినా కాంగ్రెస్ కౌన్సిలర్లు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో వైస్ చైర్మన్ ఎన్నిక శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి మధుకర్‌రెడ్డి ప్రకటించారు. మున్సిపల్‌లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు కలిగిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. నిజానికి ఇక్కడ మజ్లిస్ పార్టీకి 8 స్థానాలు ఉన్నాయి, టీఆర్‌ఎస్ నేతలు అనుకుంటే వారి మద్దతుతో చైర్మన్ పదవిని సొంతం చేసుకునేవాళ్లు.

ఆ వ్యూహంలో భాగంగానే ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తన సొంత మున్సిపాలిటీ సదాశివపేటలో కాకుండా సంగారెడ్డిలో ఓటు హక్కు నమోదు చేయించుకున్నారు. రాత్రికి రాత్రి జరిగిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి దారి సుగమం చేశారు. మొత్తం సీన్ చూస్తుంటే.. విప్ తిప్పలు లేకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్‌పర్సన్‌గా గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
 
 టీఆర్‌ఎస్‌కు జైకొట్టిన జహీరాబాద్
 కేవలం 5 స్థానాలే ఉన్నప్పటికీ జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవిని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్ పదవికి మొత్తం 13 స్థానాలు అవసరం కాగా తెలుగుదేశం, మజ్లిస్, స్వతంత్ర అభ్యర్థులు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చాయి. కౌన్సిల్‌లో 24 స్థానాలకు గాను 12 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ పదవిని దక్కించుకోలేక పోయింది. కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 23వ వార్డు కౌన్సిలర్ మెహరాజ్‌బేగం విప్‌ను ధిక్కరించి టీఆర్‌ఎస్‌కు మద్ధతు పలికారు. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎం. లావణ్య చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా మజ్లిస్ పార్టీ చెందిన అజ్మత్ పాషకు దక్కింది.
 
 జోగిపేట.. కాంగ్రెస్ కైవసం
 జోగిపేట నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్‌గా ఎస్. కవితాసురేందర్ గౌడ్, వైస్ చైర్మన్‌గా టి. రాములు ఎన్నికయ్యారు. మొత్తం 20కి గాను కాంగ్రెస్ పార్టీకి 13 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 6  ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ కౌన్సిలర్ నవీన్ ఎటు వైపూ ఓటేయలేదు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాబూమెహన్ ఎక్స్‌అఫీషియో సభ్యుని హోదాలో ఓటు హక్కును వినియోగించుకోలేదు.
 
 గజ్వేల్ లో టీఆర్‌ఎస్ నగారా గులాబీ దళానికి ప్రతిష్టాత్మకంగా మారిన గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ ఎట్టకేలకు టీఆర్‌ఎస్ పరమైంది. చైర్మన్‌గా గాడిపల్లి భాస్కర్ ఎన్నికయ్యారు. మొత్తం 20 మంది సభ్యులున్న పంచాయతీకి 16 మంది మాత్రమే హాజరయ్యారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు వ్యూహాత్మకంగా గైర్హాజర్ అయ్యారు. పోలైన ఓట్లలో 12మంది టీఆర్‌ఎస్‌కు ఓటు వేశారు.
 
 ఓటు వేసిన వారిలో టీఆర్‌ఎస్ సభ్యులు 9 మంది, టీడీపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ ఒక్కరు చొప్పున కౌన్సిలర్లు ఉన్నారు. టీడీపీకి చెందిన రెండో వార్డు కౌన్సిలర్ అల్వాల శ్రీను చైర్మన్ పదవి కోసం నామినేషన్ వేయగా...ఆయనకు నాలుగు ఓట్లు మాత్రమే వచ్చాయి. వైస్‌చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఈ పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో స్పష్టత లేనందువల్ల వైస్ చైర్మన్ ఎన్నుకోకుండానే టీఆర్‌ఎస్ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఈ ఎన్నిక శుక్రవారం నాటికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి, సిద్దిపేట ఆర్‌డీఓ ముత్యంరెడ్డి ప్రకటించారు.
 
 మెదక్‌లోనూ గులాబీ గుబాళింపు
 మెదక్ మున్సిపాల్టీలో మొత్తం 27 వార్డులున్నాయి. చైర్మన్ అభ్యర్థి గెలుపు కోసం14 మంది కౌన్సిలర్లు అవసరం ఉండగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మల్లికార్జున్‌గౌడ్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయనకు టీడీపీ అభ్యర్థి తప్ప మిగతా వారంతా అనుకూలంగా ఓటేశారు. ఎక్స్‌అఫీషియో ఓటుతో కలిపి మొత్తం 23 ఓట్లు పోలయ్యాయి.
 
 టీడీపీ తరఫున పోటీచేసిన బట్టి జగపతికి 5 ఓట్లు మాత్రమే వచ్చాయి. వైస్ చైర్మన్‌గా టీఆర్‌ఎస్ అభ్యర్థి రాగి అశోక్ అభ్యర్థిత్వాన్ని టీఆర్‌ఎస్ కౌన్సిలర్ జెల్ల గాయత్రి ప్రతిపాదించగా టీడీపీ కౌన్సిలర్ బట్టి సులోచన బలపర్చారు. ఈయనకు కూడా 23 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఈయన వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
 
 సదాశివపేటలో ఆసక్తికరం
 కాంగ్రెస్ పార్టీకి చెందిన 6 మంది కౌన్సిలర్లు గంపగుత్తగా టీఆర్‌ఎస్ పార్టీలోకి జంప్ చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరి చైర్‌పర్సన్‌గా గెలిచిన పట్నం విజయలక్ష్మికి ముందుగా రెండున్నర ఏళ్లు చైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించారు.
 
 ఆమెతో పాటే వచ్చిన పిల్లోడి విశ్వనాథం వైస్ చైర్మన్‌గా రెండున్నర ఏళ్లు అవకాశం ఇచ్చారు. మిగతా రెండున్నర సంవత్సరాలు ముందు నుంచి ఆశించిన వ్యక్తులకు పదవుల్లో కొనసాగించాలని టీఆర్‌ఎస్ నిర్ణయించి ఒప్పందం చేసుకున్నారు. చైర్‌పర్సన్‌గా గెలిచిన పట్నం విజయలక్ష్మికి మొత్తం 15 ఓట్లు వచ్చాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement