అంజన్నా..? అనిలన్నా..?
- సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారులో గందరగోళం
- ఇద్దరిని ప్రకటించిన అధికారులు
- అయోమయానికి గురైన ప్రజలు
సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో శుక్రవారం ఓ వి‘చిత్రం’ చోటుచేసుకుంది. ఎన్నికల అధికారులు సికింద్రాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థులుగా ఇద్దరిని ప్రకటించారు. దీంతో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నదెవరో అర ్థం కాక నియోజకవర్గ ప్రజలంతా అయోమయంలో పడ్డారు.
సిట్టింగ్ ఎంపీ అంజన్‌కుమార్, ఆయన తనయుడు అనిల్‌కుమార్ యాదవ్ సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగానే నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) అనంతరం ఆమోదం పొందిన నామినేషన్ల జాబితాను రిటర్నింగ్ అధికారి వాలిట్ ప్రకటించారు. ఈ జాబితాలో ఒకే (కాంగ్రెస్) పార్టీ నుంచి వీరిరువురి పేర్లూ ఉండటం.. కొంత గందరగోళానికి తెర తీసింది.
అధికారులు ఏమంటున్నారంటే..
జాతీయ పార్టీలకు చెందిన ప్రధాన అభ్యర్థులెవరైనా.. వారితో పాటు డమ్మీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించేందుకు ఎన్నికల కమిషన్ వెసులుబాటు కల్పించింది. జాతీయ పార్టీలకు చెందిన ప్రధాన అభ్యర్థి నామినేషన్‌ను ఒక ఓటరు ప్రతిపాదించాల్సి ఉండగా, డమ్మీ అభ్యర్థి నామినేషన్ ఆమోదం పొందాలంటే మాత్రం 10మంది ప్రతిపాదించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోక్‌సభకు బీఎస్‌పీ తరపున ఇరువురు అభ్యర్థులు, సికింద్రాబాద్ లోక్‌సభకు కాంగ్రెస్ తరఫున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అయితే బీఎస్‌పీ అభ్యర్థుల్లో ఒకరి నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. హైదరాబాద్ లోక్‌సభకు బీఎస్‌పీ డమ్మీ అభ్యర్థికి ప్రతిపాదకుడు ఒక్కరే ఉన్నందున ఆ నామినేషన్ స్క్రూట్నీలో తిరస్కరణకు గురైంది. సికింద్రాబాద్ లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ కాగా, డమ్మీ అభ్యర్థిగా అనిల్‌కుమార్ యాదవ్ పేరును పార్టీ ఇచ్చిన బీ ఫారంలో పేర్కొన్నారు.
డమ్మీ అభ్యర్థిగా ఉన్న అనిల్ నామినేషన్‌ను 10మంది ఓటర్లు ప్రతిపాదించినందున.. అంజన్‌కుమార్ నామినేషన్‌తో పాటు అనిల్‌కుమార్ నామినేషన్ కూడా స్క్రూట్నీలో ఆమోదం పొందింది. ఇలా ఆమోదం పొందిన నామినేషన్‌ను డమ్మీ అభ్యర్థి గడువులోగా ఉపసంహరించుకోవాలి. లేకుంటే ఇండిపెండెంట్‌గా పరిగణిస్తారు. గుర్తుల కేటాయింపులో ప్రధాన అభ్యర్థికి పార్టీ గుర్తు, ఇండిపెండెంట్ అభ్యర్థికి వేరే గుర్తు కేటాయిస్తారు.