సాక్షి, హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగంలో టిక్‌టాక్‌ల వ్యవహారం సద్ధుమణగక ముందే ఆస్పత్రి అత్యవసర విభాగంలో మద్యం మత్తులో సెక్యూరిటీ గార్డులు చేసిన డ్యాన్సులు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఆస్పత్రి పాలనయంత్రాంగం నలుగురు సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తొలగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గాంధీ ఆస్పత్రిలో ఎజిల్ సెక్యూరిటీ సంస్థ తరుపున సుమారు 200 మంది సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహిస్తున్నారు.
అత్యవసర విభాగంలోని రెండవ అంతస్తులో వి«ధి నిర్వహణలో ఉంటూనే మద్యం మత్తులో కే.కట్టయ్య అనే గార్డు డ్యాన్స్ చేస్తుండగా అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న బీ. శ్రీనివాస్, ఎన్ వెంకటస్వామి, వి. వెంకటేష్ అనే గార్డులు మరింత ఉత్తేజ పరుస్తూ సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించారు.సదరు వీడియోలు శనివారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణ చేపట్టి మద్యం మత్తులో డ్యాన్స్ చేసిన కట్టయ్యతోపాటు మిగిలిన ముగ్గురిని విధుల నుంచి తొలగించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. సదరు వీడియో ఈనెల 21వ తేది ఉదయం 8.30 గంటలకు అత్యవసర విభాగంలోని రెండవ అంతస్తులో చిత్రీకరించగా, శనివారం సామాజక మాధ్యమాల్లో వైరల్ కావడం గమనార్హం. నిర్వహణ సంస్థ ఎజిల్ సెక్యూరిటీ సంస్థకు నోటీసులు జారీ చేశారు.
టిక్‌టాక్ వ్యవహారంపై సీరియస్...
గాంధీ ఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగంలో జరిగిన టిక్ టాక్ వ్యవహారాన్ని ఆస్పత్రి పాలనయంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. సదరు అప్రెంటీస్ విద్యార్థులను తొలగించడంతో పాటు రాంనగర్ సాధన పారామెడికల్ కాలేజీ, అత్తాపూర్ జెన్ ఓకేషనల్ కాలేజీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ స్పష్టం చేశారు.
ఇకపై సదరు కాలేజీలకు చెందిన విద్యార్థులకు గాంధీ ఆస్పత్రిలో శిక్షణ ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులు, జూనియర్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, వైద్యులు ఇతర సిబ్బంది విధి నిర్వహణలో ఉంటు టిక్ టాక్‌లు, సుదీర్ఘ సెల్‌ఫోన్ సంభాషణలు, చాటింగ్, వీడియో చిత్రీకరణ చేపట్టరాదని ఆదేశాలు జారీ చేశారు. ఫిజియోథెరపీ విభాగ వైద్యులకు నోటీసులు ఇవ్వడంతోపాటు కమిటీని ఏర్పాటు చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment