ఇక తహసీల్దార్లకు భద్రత | Security Increased At MRO Offices In Telangana | Sakshi
Sakshi News home page

ఇక తహసీల్దార్లకు భద్రత

Published Thu, Nov 14 2019 9:01 AM | Last Updated on Thu, Nov 14 2019 9:01 AM

Security Increased At MRO Offices In Telangana - Sakshi

కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌ వద్ద బందోబస్తులో పోలీసు సిబ్బంది (ఫైల్‌)  

సాక్షి, ఆదిలాబాద్‌ : మండల కార్యాలయాల్లో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు భద్రత కల్పించేందుకు పోలీసుశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న భద్రతను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రస్థా యి పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉండడంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది. అయితే జిల్లాలో జనాలు ఎక్కువగా వెళ్లే మం డల కార్యాలయాలపై ఇది వరకే ఓ కన్నేసి ఉంచి న పోలీసు యంత్రాంగం ఇక నుంచి ఆ నిఘాను పటిష్టం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా ప్రతి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద పోలీస్‌ బుక్‌ పాయింట్‌ను ఏర్పాటు చేసి భద్రత పటిష్టం చేయనున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి ఘటన నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగుల్లో అభద్రత భావం నెలకొన్న విషయం తెలిసిందే. విజయారెడ్డి మృతికి సంతాపంగా వారంరోజుల పాటు నిరసనలు చేపట్టిన ఉద్యోగులు బుధవారం నుంచి విధుల్లో చేరారు. అయితే స్ట్రైక్‌ నుంచి విధుల్లో చేరిన మొదటిరోజు నుంచే భద్రత చర్యలు ప్రారంభం కావడం మంచి పరిణామం. 

కార్యాలయాల వద్ద బుక్‌ పాయింట్‌ 
జిల్లాలో 17 గ్రామీణ మండలాలు, ఒక అర్బన్‌ మండలం ఉన్నాయి. ఆదిలాబాద్‌ అర్బన్‌ మండల రెవెన్యూ కార్యాలయం కలెక్టరేట్‌ భవనంలో ఉంది. అయితే కలెక్టరేట్‌ ముందు, లోపల, వెనకాల, ఎప్పుడూ పోలీసుల నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది. జనాలు కూడా అధిక సంఖ్యలో కలెక్టరేట్‌కు వస్తుంటారు. 17 గ్రామీణ మండలాల్లోనూ రెవెన్యూ కార్యాలయాలు, అంతే మోతాదులో పోలీసు స్టేషన్లు ఉన్నాయి. రెవెన్యూ ఆఫీసుల్లో జరుగుతున్న సంఘటనలపై ఆ మండల పోలీస్‌స్టేషన్, దాని పరిధిలో పని చేసే పోలీసు అధికారులు దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. మండల కార్యాలయాల్లో ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే తక్షణమే అక్కడున్న పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించే సౌకర్యం ఉంది. సమాచారం అందుకున్న సదరు పోలీస్‌స్టేషన్‌ అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని పరిష్కరిస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం.

రెవెన్యూ కార్యాలయాల వద్ద ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలు, సభలు జరిగినప్పుడు తప్పా.. ప్రతివారం రెవెన్యూ కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తు, ఆఫీసు పర్యవేక్షణ బృందాలు, స్పెషల్‌ టీంల పరిశీలన అంటూ ఏమీలేవని చెప్పవచ్చు. కానీ ఇప్పుడలా కాకుండా మండల రెవెన్యూ ఆఫీసుల వద్ద పోలీస్‌ బుక్‌ పాయింట్‌ ఏర్పాటు చేయనున్నారు. బ్లూకోట్స్, పెట్రోలింగ్‌ విధుల్లో ఉన్న పోలీసులు ప్రతి సోమవారం ఐదారుసార్లు రెవెన్యూ కార్యాలయాలను పరిశీలన చేసి బుక్‌పాయింట్‌లో సంతకం పెడతారు. దీంతో ఈ మండలాన్ని ఎవరెవరూ ఎప్పుడెప్పుడు పరిశీలన చేశారన్న విషయం ఎస్పీ, అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి పోలీసు అధికారులు మండలాలను విజిట్‌ చేసినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఫలితంగా ఆఫీసులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని పోలీసు శాఖ భావిస్తోంది. పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాలు మండలాలు, గ్రామాలను రాత్రి, పగలు జల్లెడ పడుతున్న విషయం తెలిసిందే.  

జనాలు ఎక్కువగా వెళ్లే ఆఫీసులపై...  
ఒక మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సూపరింటెండెంట్, ఆర్‌ఐ, సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్లు, ఆ మండల పరిధిలోని వివిధ రెవెన్యూ గ్రామాలకు చెందిన వీఆర్‌వోలు, టైపిస్టు, అటెండర్, కార్యాలయ సిబ్బంది ఉంటారు. అయితే వివిధ పనుల నిమిత్తం రైతులు, విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, సంస్థల ప్రతినిధులు, తదితరులు అనునిత్యం మండలాఫీసులకు వస్తుంటారు. అయితే ఏ మండల కార్యాలయానికి జనాలు ఎక్కువగా వెళ్తున్నారో ఆ మండలాఫీసులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సదరు మండలంలో బుక్‌ పాయింట్‌ నిర్వహించడంతో పాటు ఆ మండల పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌ అధికారులు కూడా నిఘా ఉంచనున్నారు. ఎదైనా సంఘటన జరిగితే తక్షణమే స్పందించి సమస్యను అదుపులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటారు. రెవెన్యూ ఉద్యోగులకు భద్రత కల్పించాలని, మండలాఫీసుల వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేపట్టాలని రెవెన్యూ ఉద్యోగులు నిరసనలో భాగంగా సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  

నిఘా మరింత పెంచుతాం 
జనాలు ఎక్కువగా వెళ్లే రెవెన్యూ కార్యాలయాలపై నిఘా మరింత పెంచుతాం. బుక్‌ పాయింట్లు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపడుతాం. బ్లూ కోట్స్, పెట్రోలింగ్‌లో పాల్గొనేవారు రెవెన్యూ కార్యాలయాలను పరిశీలిస్తారు. కలెక్టరేట్‌తో పాటు మండలాల్లోని కార్యాలయాలు, పాఠశాలలు, వివిధ చోట్ల భద్రత ఇప్పటికే ఉంది. దీనిని మరింత పటిష్టం చేస్తాం. 
– విష్ణు ఎస్‌ వారియర్, ఎస్పీ, ఆదిలాబాద్‌  

భద్రత మంచిదే  
మండల కేంద్రాల్లో రెవెన్యూ ఉద్యోగులకు భద్రత ఏర్పాటు చేయడం మంచిదే. బుధవారం పోలీసు సిబ్బంది మా కార్యాలయానికి వచ్చి పరిశీలించి వెళ్లారు. విధుల్లో ఉన్న ఉద్యోగులకు అసౌకర్యం కలగకుండా నిఘా ఉంచడం సంతోషమే. రెవెన్యూ ఉద్యోగులు మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు ముందుకు వస్తారు. 
– సి.రాజమనోహర్‌రెడ్డి, తహసీల్దార్, ఆదిలాబాద్‌ రూరల్‌ 

రెవెన్యూ కార్యాలయాలపై నిఘా ఇలా..
► ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్‌లో పోలీసుల నిఘా. 
► పరిశీలన చేసిన పోలీసు అధికారులు సంతకం చేసేలా బుక్‌ పాయింట్‌ ఏర్పాటు. 
►  పిటిషనర్లు రెవెన్యూ అధికారులకు అసౌకర్యం, ఇబ్బంది కల్గించకుండా చూస్తారు. 
►  అనుమానం ఉన్న సదరు పిటిషనర్‌ను లోనికి వెళ్లనివ్వరు.  
►  తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చే ప్రతివ్యక్తిపై నిఘా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement