సాక్షి, జగిత్యాల: ప్రధానమంత్రి నరేంద్రమోడీ చరిష్మాతో దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తుంటే.. జిల్లాలో మాత్రం ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. ఈ సారి ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకుంటామనే ధీమాతో కాషాయ పార్టీ అధినేతలు ఉంటే.. జిల్లాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎన్నికలవేళ బీజేపీయేతర పార్టీల క్యాడర్ కలిసి తమ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తుంటే జిల్లాలో కమలం ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం ఇంటిపోరును ఎదుర్కొంటున్నారు. ప్రచారంలో కలిసిరాని క్యాడర్‌తో ఆందోళన చెందుతున్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో అసంతృప్తితో కొందరు సీనియర్లు అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. మరోపక్క.. ఎమ్మెల్యే టికెట్టు పొందిన అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో తమ సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవడం లేదనీ, జూనియర్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు సీనియర్లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. రోజులు గడుస్తున్నా కొద్దీ ఆ పార్టీలో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇదే కారణంతో కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని మెట్‌పల్లికి చెందిన ఆ పార్టీ జిల్లా అధికారి ప్రతినిధి సద్దిబత్తుల వేణు పదిరోజుల క్రితమే పార్టీనీ వీడి కారెక్కారు.
మైనార్టీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు హమీద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పి.శేఖర్, బీసీ విభాగం మెట్‌పల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ సోమవారం ప్రజాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రెండు నెలల క్రితమే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన జేఎన్.వెంకట్‌కు కమలం పార్టీ కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఖరారు చేసింది. దీంతో అప్పటివరకు ఆ స్థానం నుంచి టికెట్‌పై ఆశలు పెట్టుకున్న మెట్‌పల్లికి చెందిన పార్టీ జిల్లా అధ్యక్షుడు బాజోజి భాస్కర్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోరుట్లకు చెందిన రైల్వేబోర్డు సభ్యురాలు పూదరి అరుణ సైతం టికెట్ ఆశించి భంగపడ్డారు. ప్రస్తుతం ఇలాంటి సీనియర్లు వెంకట్‌కు మద్దతుగా ప్రచారంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది.
దీంతో వెంకట్ తన బీసీ కార్డు, పాత పీఆర్పీ క్యాడర్‌తో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నా.. ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ఈ విషయమై బాజోజి భాస్కర్ వివరణ ఇస్తూ జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులు సీనియర్లను కలుపుకుపోవడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో పూదరి అరుణ కొన్నిరోజుల పాటు హైదరాబాద్‌లో ఉన్నారు. రేపటి నుంచి ప్రచారంలో పాల్గొంటారు. మెట్‌పల్లిలో మాత్రం బీజేపీ బలంగా ఉంది. పార్టీ అధినేతలను పిలిపించే ప్రయత్నం చేస్తున్నాం. జగిత్యాల, ధర్మపురిలో బహిరంగ సభలు పెడ్తాం అన్నారు.
ధర్మపురి ఎమ్మెల్యే అభ్యర్ధి కన్నం అంజయ్యకు వ్యతిరేకంగా బీజేపీ సీనియర్లు తిరుగుబావుటా ఎగురవేశారు. ఏళ్ల నుంచి పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న తమను ఎమ్మెల్యే అభ్యర్థి ఏనాడూ ప్రచారానికి పిలవలేదని మండిపడుతున్నారు. కనీసం సలహాలు, సూచనలు సైతం తీసుకోలేదంటూ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు నీలకంఠం, రవీందర్, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, కిసాన్‌మోర్చా నాయకుడు ఏలేటి లింగారెడ్డి, నాయకులు హనుమాండ్లు, గోవర్ధన్‌రెడ్డి తదితరులు ఇటీవల పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
జగిత్యాలలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నా.. ఇక్కడినుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న ఎం.రవీందర్‌రెడ్డి గెలుపు మాత్రం అనుమానంగానే ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం టీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్, మహాకూటమి అభ్యర్థి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్‌రెడ్డి మధ్యే ప్రధాన పోరు ఉంది. ఈ రెండువర్గాలు చేస్తున్న పోటాపోటీ ప్రచారానికి తగ్గట్టు రవీందర్‌రెడ్డి ప్రచారం చేయకపోవడం.. క్యాడర్ అంతంత మాత్రంగానే ఉండడంతో ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయనే చర్చ జరుగుతోంది.
ప్రచారానికి అతిరథులు దూరం..!
ఎన్నికల వేళ.. తమతమ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అతిరథులు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. బీజేపీ నుంచి మాత్రం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, స్వామి పరిపూర్ణానంద మెట్‌పల్లిలో ఒక్కోసారి పర్యటించారు. జగిత్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో స్వామి పరిపూర్ణానంద పది నిమిషాలు కూడా మాట్లాడలేదు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి రవీందర్‌రెడ్డితో ప్రతిజ్ఞ చేయించి వెళ్లిపోయారు. ధర్మపురిలో మాత్రం ఒక్కరూ పర్యటించలేదు. దీంతో కోరుట్ల మినహా జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో అభ్యర్థులే అన్నీ తామై ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్, సిరిసిల్ల, జనగాం వంటి చిన్న జిల్లాల్లోనూ బీజేపీ కేంద్ర నాయకులు హాజరుకావడం.. ఉద్యమాల గడ్డ అయిన జగిత్యాలకు రాకపోవడంతో కమలనాథులను నిరాశకు గురిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment