ఉద్యమానికి తాత్కాలిక విరామం | Separate High Court movement Temporary interval | Sakshi
Sakshi News home page

ఉద్యమానికి తాత్కాలిక విరామం

Published Wed, Jul 27 2016 4:09 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

Separate High Court movement Temporary interval

29 నుంచి విధుల్లో చేరతామని తెలంగాణ న్యాయవాదుల ప్రకటన
  హైకోర్టు ఏర్పాటుపై ప్రధాని, సీజేఐ హామీని విశ్వసిస్తున్నట్టు వెల్లడి
 సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు. హైకోర్టు ఏర్పాటు చేయడంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన హామీని, అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీని విశ్వసించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ నెల 29న విధుల్లో చేరుతున్నామని తెలంగాణ న్యాయవాదులు మంగళవారం ఏపీ భవన్‌లో మీడియాకు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల ముగింపులోపు హైకోర్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు.

అప్పటికీ కాకుంటే మరోసారి ఉద్యమిస్తామని హెచ్చరించారు. హైకోర్టు విభజన కోరుతూ తెలంగాణ న్యాయవాదులు సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ సంఘాలు, టీఆర్‌ఎస్ ఎంపీలతో చర్చించిన తరువాత ఉద్యమానికి తాత్కాలిక విరామం ఇస్తున్నట్టు న్యాయవాదులు ప్రకటించారు.
 హైకోర్టు తప్పక ఏర్పాటవుతుంది: ఎంపీ సీతారాం నాయక్
 ప్రత్యేక హైకోర్టు కోసం ఉద్యమించిన తెలంగాణ న్యాయవాదులు ప్రధాని మోదీ, సీజేఐ హామీలతో ఉద్యమాన్ని విరమించడం అభినందనీయమని ఎంపీ సీతారాం నాయక్ కొనియాడారు. హైకోర్టు ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, తెలంగాణ హైకోర్టు కచ్చితంగా ఏర్పాటవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై అన్ని రకాలుగా ఒత్తిడి తెస్తోందన్నారు. బంజారాల పెద్ద పండుగైన తీజ్‌ను ఢిల్లీలో జరపడానికి స్థానికంగా ఉంటున్న బంజారా సోదరులు డా.రవి, డా.ఆర్య ముందుకు రావడం ఆహ్వానించదగిందన్నారు. విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, వరంగల్ జిల్లా పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు శ్రీధర్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement