ముకరంపుర : పథకాల అమలులో నిర్లక్ష్యంగా వ్యహరించిన జిల్లా అధికారులపై వేటు పడుతోంది. సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై కలెక్టర్ సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. రెండురోజుల్లోనే జిల్లాలో కీలకమైన ఇద్దరు అధికారులను ప్రభుత్వానికి సరెండర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పరిపాలనా పరమైన అలసత్వం కారణంగా గురువారం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణశర్మను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆసరా పథకంలో భాగంగా పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యంపై ఇప్పటికే హుస్నాబాద్ నగర పంచాయతీ కమిషనర్ ఎం.సుధాకర్‌గౌడ్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేసిన విషయం తెలిసిందే. పింఛన్ల పంపిణీ విషయంలో హుస్నాబాద్‌లో జరుగుతున్న ఆందోళన దృష్ట్యా అక్కడికి కలెక్టర్ వెళ్లిన రోజు కమిషనర్ సెలవు పెట్టి వెళ్లారు. పింఛన్ల మంజూరు విషయంలో స్పష్టమైన జవాబు ఇవ్వకపోవడం.. రావాలని ఆదేశించినా బేఖాతరు చేయడంతో ఆయనను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఆయన స్థానంలో హుస్నాబాద్ నగరపంచాయతీ మేనేజర్ స్వరూపారాణిని ఇన్‌చార్జిగా నియమించారు.
గురువారం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణ శర్మపై వేటు వేశారు. ఆయనను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ వీరబ్రహ్మయ్య త్తర్వులు జారీ చేశారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ విషయంలో పరిపాలనాపరమైన అలసత్వం కారణంగా ప్రజాప్రతినిధులు ఫిర్యాదు మేరకు ఆయనను సరెండర్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్ శోభను ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా ఇన్‌చార్జి బాద్యతలు అప్పగించారు. ప్రభుత్వ పథకాలు అర్హుల దరికి చేరడం లేదంటూ ఓవైపు ప్రతిపక్షాలు, మరోవైపు ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతుండడంతో ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరాతీస్తోంది.
ఈ క్రమంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై హెచ్చరికలు లేకుండానే వేటువేయడానికి సిద్ధమవుతోంది. ఇటీవల రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ జిల్లాలో పరిస్థితిని ప్రత్యేకంగా సమీక్షించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ వీరబ్రహ్మయ్య క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారుల పనితీరుపై నిఘా పెంచారు. సరెండర్ చేసిన అధికారులపై ఆయా శాఖల కమిషనరేట్‌లోని ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనుంది. హుస్నాబాద్ నగరపంచాయతీ కమిషనర్ సుధాకర్‌పై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులు సైతం తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ఆయనను సస్పెన్షన్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో జిల్లాలోని ఆయా శాఖల అధికారుల్లో సరెండర్ గుబులు రేపుతోంది.
అధికారుల సరెం‘డర్’
Published Fri, Nov 21 2014 3:04 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement