రైతు నెత్తిన మరో పిడుగు | Service charges burden on farmers | Sakshi
Sakshi News home page

రైతు నెత్తిన మరో పిడుగు

Published Mon, Nov 17 2014 12:21 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రైతు నెత్తిన మరో పిడుగు - Sakshi

రైతు నెత్తిన మరో పిడుగు

యాచారం: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతన్న నెత్తిపై మరో పిడుగు పడనుంది. వ్యవసాయ బోరుబావులకు విద్యుత్ వినియోగానికిగాను  కుప్పలుగా పేరుకుపోతున్న సర్వీస్ చార్జీలను చెల్లించని పక్షంలో కనెక్షన్లు కట్ చేయడానికి విద్యుత్ అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రూ. కోట్లాది బకాయిలు వసూలు చేయడం కోసం ప్రభుత్వం నుంచి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నం డివిజన్‌లోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లోని వివిధ గ్రామాల్లో 15 వేలకు పైగా వ్యవసాయ బోరుబావుల కనెక్షన్లు ఉన్నాయి.

వీటికి రూ.5 కోట్లకు పైగా సర్వీస్ చార్జీల బకాయిలు ఉన్నాయి. 2004 నుంచి వినియోగానికి సంబంధించి ఉచిత విద్యుత్ అందుతున్నప్పటికీ సర్వీస్ చార్జీలను మాత్రం రైతులు కచ్చితంగా చెల్లించాల్సి ఉంది. 2004 నుంచి నెలకు రూ. 20 సర్వీస్ చార్జి ఉండగా, 2012 మార్చి నుంచి రూ.10 అదనంగా పెంచి నెలకు రూ.30 చేశారు. వ్యవసాయ బోర్లు నీళ్లు పోసినా, ఎండిపోయినా చార్జీలను మాత్రం రైతులు కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా ఇబ్రహీంపట్నం డివిజన్‌లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఎండిపోయిన వేలాది బోరు బావులకు సైతం సర్వీస్ చార్జీలు విధిస్తున్నారు.  

బిల్లుల పంపిణీకి రంగం సిద్ధం..
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండడం, ఉత్పత్తి లేకపోవడంతో తీవ్ర లోటు ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు అత్యంత ఆవశ్యకమైంది. ఇందుకోసం అవసరమైన సొమ్మును రైతుల వద్ద పేరుకుపోయిన బకాయిల నుంచి వసూలు చేయడానికి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఉపక్రమించారు. నాలుగు రోజుల క్రితం డివిజన్‌లో ఉన్న అన్ని వ్యవసాయ బోరుబావుల కనెక్షన్లకు సర్వీస్ చార్జీల బిల్లులను ఆయా మండల విద్యుత్ శాఖ ఏఈ కార్యాలయాలకు పంపించారు. వీటిని ఆయా గ్రామాల వారీగా వెళ్లి నేరుగా రైతులకు అందజేయనున్నారు.

కొంత కాలంపాటు రైతులకు గృహ వినియోగానికి సంబంధించిన బిల్లుల్లోనే సర్వీస్ చార్జీల బిల్లులను కలిపేవారు. అలా రూ. వేలల్లో బిల్లులు రావడంతో గృహ వినియోగ బిల్లులు కూడా చెల్లించే వారు కాదు. బిల్లుల బకాయిలు పెద్ద మొత్తంలో ఉండడంతో ప్రస్తుతం వ్యవసాయ బోరుబావులకు ప్రత్యేకంగా సర్వీస్ చార్జీల బిల్లులను అందించడానికి సిద్ధమయ్యారు.  2004 నుంచి సర్వీస్ చార్జీలు చెల్లించని రైతులకు మొత్తం బిల్లు రూ.4,852 వచ్చింది. అప్పుడప్పుడు కొంత చెల్లించిన రైతులకు సైతం రూ. 2వేల నుంచి రూ.3 వేలకు పైనే వచ్చింది. డివిజన్‌లో తీవ్ర కరువు పరిస్థితులతో రైతుల వ్యవసాయ బోరుబావులు ఎండిపోయాయి. ఆయా మండలాలకు వచ్చిన బిల్లుల్లో అత్యధికంగా అలాంటి రైతులకు రూ. 4,852 బిల్లులు వచ్చాయి. వచ్చిన బిల్లులు చూస్తే రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.
 
కచ్చితంగా చెల్లించాల్సిందే..
వ్యవసాయ బోరుబావుల సర్వీస్ చార్జీలను రైతులు కచ్చితంగా చెల్లించాల్సిందే. నెలకు రూ. 30 చెల్లించడం పెద్ద కష్టమేమీ కాదు. బిల్లుల పంపిణీ తర్వాత కొంత గడువు ఇస్తాం. ఆలోపు చెల్లించని పక్షంలో కనెక్షన్లు తొలగించక తప్పదు. ఇప్పటికే చాలాసార్లు అవకాశం కల్పించాం. ఉన్నతాధికారుల నుంచి కచ్చితమైన ఆదేశాలున్న దృష్ట్యా ఇక చెల్లించక తప్పదు.

- చక్రవర్తి, విద్యుత్ ఏడీఈ, ఇబ్రహీంపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement