నల్లగొండ : నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. 1985లో దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్‌టీఆర్) కూడా ఒకసారి ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో నల్లగొండ పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మార్మోగింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నల్లగొండ స్థానానికి ఆయన రాజీనామా చేయడంతో అనంతరం వచ్చిన ఉపఎన్నికల్లో గడ్డం రుద్రమాజేవి విజయం సాధిం చింది. నియోజకవర్గంలో 1952లో మొట్టమొదటిసారిగా శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు మొత్తం 15సార్లు ఎన్నికలు జరగగా ఏడుసార్లు కాంగ్రెస్ విజయం సాధించింది.
ఇందులో నల్లగొండ తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించి నల్లగొండను కాంగ్రెస్‌కు కంచుకోటగా మార్చాడు. టీడీపీ మూడుసార్లు ఇక్కడి నుంచి విజయం సాధించింది. అదేవిధంగా పీడీఎఫ్ రెండుసార్లు, సీపీఎం, సీపీఐ పార్టీలు ఒకొక్కసారి విజయం సాధించాయి. అలాగే 1983లో గుత్తా మోహన్‌రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపును కైవసం చేసుకున్నాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ముందుండి పోరాడిన నల్లగొండ బిడ్డలు 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పోటీ చేసినా నియోజకవర్గ ప్రజలు ఆదరించకపోవడం గమనార్హం.
నియోజకవర్గ పునర్విభజనకు ముందు..
2009లో నియోజకవర్గాల పునర్విభజనకు ముందు నల్లగొండ నియోజకవర్గంలో నార్కట్‌పల్లి, చిట్యాల, నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండలాలతోపాటు నల్లగొండ మున్సిపాలిటీ నియోజకవర్గంలో ఉండేది. అందులో తిప్పర్తి మండలంలోని ప్రధాన భాగం నల్లగొండలో ఉండగా 3 గ్రామాలు నకిరేకల్ నియోజకవర్గంలో ఉండేవి. 2 గ్రామాలు చలకుర్తి నియోజకవర్గంలో ఉండేవి.
కనగల్ మండలం అధిక భాగం నల్లగొండలో ఉండగా 2 గ్రామాలు చలకుర్తి నియోజకవర్గంలో ఉండేవి. నియోజకవర్గ పునర్విభజన అనంతరం కనగల్, తిప్పర్తి మండలాలు పూర్తిగా నల్లగొండ నియోజకవర్గంలోకి వచ్చాయి. నార్కట్‌పల్లి, చిట్యాల మండలాలు నకిరేకల్ నియోజకవర్గంలోకి పోయాయి. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న నియోజకవర్గం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వరస విజయాలతో కాంగ్రెస్‌కు పెట్టని కోటగా మారింది.
నల్లగొండ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు
నల్లగొండ నియోజకవర్గం చరిత్రపరంగా ఎంతో గుర్తింపు పొందింది. పట్టణంలోని నీలగిరి కొండలు, పానగల్‌లోని పచ్చల, చాయాసోమేశ్వర ఆలయాలు, ఉదయసముద్రం రిజర్వాయరు ఉన్నాయి. ఉదయ సముద్రం నుంచి నియోజకవర్గ ప్రజలకే కాదు పక్క నియోజవర్గ ప్రజలకు కూడా తాగు, సాగునీరుఅందిస్తూ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తోంది.
అప్పట్లో ఇంత ప్రచార ఆర్భాటాలు లేవు..
చింతలపాలెం(హుజూర్‌నగర్ : మా కాలంలో ప్రచార ఆర్భాటాలు ఇంతలా లేవు. అప్పట్లో నాయకులు విలువలతో కూడిన రాజకీయాలు చేసేవారు. ఆయా నాయకుల మంచితనాన్ని చూసి ప్రజలు ఓట్లు వేసేవారు. నాయకులు చెప్పేదానిలో నిజం ఉండేది. చేసిన వాగ్ధానాన్ని వెంటనే అమలు చేసేవారు.ఇప్పటి రాజకీయాలు తమ స్వప్రయోజనాల కోసం చేస్తున్నారు. ఓటర్లు కూడా డబ్బులు తీసుకోకుండా ఓటు వేసేవారు. ఇప్పడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. పనికి రాని హామీలు ఇచ్చి ఓటర్లను సోమరులుగా తయారుచేస్తున్నారు. ఓటర్లకు జీవనోపాధి, స్వయం ఉపాధి కల్పించే దిశగా హామీలుండాలి.
– షేక్ అజీజ్, చింతలపాలెం
పెద్దలు చెప్పిన వాళ్లకే ఓటు వేసేవాళ్లం
చింతలపాలెం(హుజూర్‌నగర్) : వెనకటి రోజుల్లో ఎన్నికలంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా నీతి,నిజాయితీగా జరిగేవి. కుటుంబ పెద్దలు, గ్రామపెద్దలు ఎవరికి ఓటు వేయమని చెబితే వారికే ఓటు వేసేవాళ్లం. ఓట్లకు డబ్బులు ఇచ్చేవారు కాదు. గ్రామస్తులందరూ ఒక మాట మీద నిలబడేవారు. ఎవరు మంచి నాయకులు అయితే వారినే ఎన్నుకునే వారు. ఎన్నికల సమయంలో గ్రామానికి కరెంటు, సాగునీరు, రోడ్లు, బస్సు సౌకర్యం తదితర అభివృధ్ది పనులపైనే చర్చలు జరిగేవి. వాటి గురించి గ్రామస్తులందరూ కలిసి నాయకులను అడిగేవారు. గ్రామాభివృద్ధికి పాల్పడే వారికి ఓటు వేసేవాళ్లం.
– మూలగుండ్ల బసివిరెడ్డి, రైతు చింతిర్యాల
Comments
Please login to add a commentAdd a comment