సాక్షి, నల్గొండ : టికెట్ల పంపకం తుది దశకు చేరుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మిత్రపక్షాలకు సీట్ల సర్దుబాటు తలనొప్పిగా మారిన కాంగ్రెస్‌కు.. సొంత పార్టీలో టికెట్ల లొల్లి కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. తాజాగా నల్గొండ జిల్లా నకిరేకల్ సీటును మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఇవ్వాలని ఆపార్టీ నేతలు ధర్నాకు దిగారు. పొత్తులో భాగంగా నకిరేకల్ సీటును వదులుకునే ప్రసక్తే లేదని.. ఆ స్థానాన్ని లింగయ్యకే కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండలో లింగయ్య మద్దతుదారులతో కలిసి ఆయన శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఓటమి ఖాయమని ఆయన హెచ్చరించారు.
ఇది వరకే ఈస్థానంలో ఓసారి గెలుపొందిన లింగయ్యకు టికెట్ ఇవ్వకపోతే తాను పోటీచేయ్యనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారిన నల్గొండ జిల్లాలో సొంతపార్టీ నేతల అసమ్మతి తీవ్ర ఇబ్బందిగా మారిందని నేతలు అసహానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మహాకూటమి పొత్తులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు సీట్లు తమకు కేటాయించాలని టీడీపీ కోరుతున్న విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి టీడీపీ నాయకురాలు పాల్వయ్ రజనీ కుమార్ టీడీపీ తరఫున బరిలోకి దిగేందుకు ప్రయత్నలు చేస్తున్నారు. అలాగే తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కూడా నకిరేకల్‌ను తమను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నకిరేకల్ స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment