Nakerekal
-
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. టీఆర్ఎస్లోకి మరో ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. నకిరేకల్ శాసన సభ్యుడు చిరుమర్తి లింగయ్య పార్టీని వీడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్‌ను రాజీనామా చేసి త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు లింగయ్య వెల్లడించారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, టీఆర్ఎస్ బీ ఫాంపై పోటీచేసి మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసినా కాంగ్రెస్ నేతల్లో మార్పు రావడంలేదని లింగయ్య విమర్శించారు. నల్గొండ జిల్లా అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని, అందుకే పార్టీలో చేరుతున్నానని పేర్కొన్నారు. ఈమేరకు శనివారం ఆయన బహిరంగ లేఖను విడుదల చేశారు. ‘టీఆర్ఎస్లో చేరితే అంతకన్నా మోసం ఇంకోటి లేదు’ కేసీఆర్ అభివృద్ధిని ప్రజలు గుర్తించి గత ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించారని, కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు చిరుమర్తి లింగయ్య అభిప్రాయపడ్డారు. అభివృద్ధికి ఆటంకం కలిగే విధంగా కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వెయ్యడం తప్ప చేసింది మరొకటి లేదని అన్నారు. కాగా పార్టీని వీడుతున్నట్లు ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకటించిన విషయం తెలిసిందే. రేగా కాంతారావు, ఆత్రం సక్కు త్వరలోనే కారెక్కుతున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఈపరిణామం పెద్ద షాకే. చిరుమర్తి లింగయ్య ప్రకటనతో కాంగ్రెస్ పార్టీని వీడేవారి సంఖ్య ముగ్గురికి చేరింది. టీడీపీ నుంచి గెలిచిన సత్తుపల్లి శాసన సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనకు టికెట్ రాకపోతే.. నేను పోటీ చేయను..! -
‘టీఆర్ఎస్లో చేరితే అంతకన్నా మోసం ఇంకోటి లేదు’
సాక్షి, భువనగిరి: నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ మారుతారన్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. లింగయ్య టీఆర్ఎస్లో చేరితే ఇంతకన్నా ఘోరం ప్రపంచంలో మరొకటి ఉండదని అన్నారు. ఆయనను తన కుటుంబ సభ్యుడిలా భావించి, నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలిపించామని గుర్తుచేశారు. ఆయన పార్టీ మారితే ప్రపంచంలో దీన్ని మించిన మోసం ఇంకోటి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లు పదవిలో లేకున్నా, తమని నమ్మకున్న దళితుడికి అన్యాయం జరగొద్దని అధిష్టానంతో కొట్లాడి టికెట్ దక్కేలా చేశామని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి ప్రాణం పోయిన పార్టీ మారకూడదని, కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేయకుండా వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాజగోపాల్ రెడ్డి కోరారు. (కారెక్కనున్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే!) కాగా కోమటి రెడ్డి బ్రదర్స్‌కు ప్రధాన అనుచరుడైన చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన కేసీఆర్‌ను కలిసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. లింగయ్యను సంప్రదించడానికి కోమటి బ్రదర్స్ ప్రయత్నించగా ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన పార్టీని వీడితే లోక్‌సభ ఎన్నికలు ముందు ఉమ్మడి నల్గొండలో కోమటి బ్రదర్స్‌కి పెద్ద షాక్ తగిలినట్లే. -
‘ఆ స్థానంలో నా భార్య పోటీ చేస్తారు’
సాక్షి, హైదరాబాద్ : నకిరేకల్ స్థానం నుంచి తన భార్య చెరుకు లక్ష్మి పోటీ చేస్తారని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ప్రకటించారు. తెలంగాణ ఇంటి పార్టీకి కుంతియా ఒక సీటు ప్రకటించారని.. మహబూబ్‌నగర్, షాద్ నగర్ స్థానాలను కూడా కోరుతున్నట్లు ఆయన తెలిపారు. తమ పార్టీపై కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని.. ఆ పార్టీ ఎక్కడిదని వారు అనడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో ఎన్నో ఉద్యమాలు చేశామని ఆయన గుర్తుచేశారు. నకిరేకల్‌పై కాంగ్రెస్ బ్రదర్స్ పట్టువదలకపోవడంతో ఆయన శనివారం కుంతియా, ఉత్తమ్లతో భేటీ అయ్యారు. నకిరేకల్ సీటు తమకు కేటాయించినట్లు కుంతియా తెలిపారని.. తమను గెలిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన పేర్కొన్నారు. కాగా ఆ స్థానంలో కోసం టీడీపీ, కాంగ్రెస్ తీవ్రంగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఆ సీటును చిరుమర్తి లింగయ్యకు ఇవ్వాలని కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్రంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. -
‘ఆ సీటు ఇవ్వకపోతే ఉత్తమ్, జానా ఓటమి ఖాయం’
సాక్షి, నల్గొండ : టికెట్ల పంపకం తుది దశకు చేరుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మిత్రపక్షాలకు సీట్ల సర్దుబాటు తలనొప్పిగా మారిన కాంగ్రెస్‌కు.. సొంత పార్టీలో టికెట్ల లొల్లి కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. తాజాగా నల్గొండ జిల్లా నకిరేకల్ సీటును మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఇవ్వాలని ఆపార్టీ నేతలు ధర్నాకు దిగారు. పొత్తులో భాగంగా నకిరేకల్ సీటును వదులుకునే ప్రసక్తే లేదని.. ఆ స్థానాన్ని లింగయ్యకే కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండలో లింగయ్య మద్దతుదారులతో కలిసి ఆయన శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఓటమి ఖాయమని ఆయన హెచ్చరించారు. ఇది వరకే ఈస్థానంలో ఓసారి గెలుపొందిన లింగయ్యకు టికెట్ ఇవ్వకపోతే తాను పోటీచేయ్యనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారిన నల్గొండ జిల్లాలో సొంతపార్టీ నేతల అసమ్మతి తీవ్ర ఇబ్బందిగా మారిందని నేతలు అసహానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మహాకూటమి పొత్తులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు సీట్లు తమకు కేటాయించాలని టీడీపీ కోరుతున్న విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి టీడీపీ నాయకురాలు పాల్వయ్ రజనీ కుమార్ టీడీపీ తరఫున బరిలోకి దిగేందుకు ప్రయత్నలు చేస్తున్నారు. అలాగే తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కూడా నకిరేకల్‌ను తమను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నకిరేకల్ స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
మూడేళ్ల చిన్నారితో సహా తల్లి అదృశ్యం
నకిరేకల్ః మూడేళ్ల చిన్నారితో సహా ఓ తల్లి అదృశ్యమైంది. నకిరేకల్‌లో ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు.. మండలంలోని మండలాపురం గ్రామానికి చెందిన తీగల యోహన్ సోదరి రమణ(32) కృష్ణాజిల్లా చిల్లకల్లు మండలం తిరుమలగిరికి చెందిన మార్కపురి ఆదమ్తో వివాహం జరిగింది. ఆదమ్ తిరుమలగిరిలోనే పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. మార్కపురి ఆదమ్ రమణ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈనెల 18వ తేదీన రాఖీ కట్టేందుకు తిరుమలగిరి నుంచి రమణ తన మూడేళ్ల కూతురు పల్లవితో నకిరేకల్‌కు విచ్చేసింది. ఈనెల 24న అన్న తీగల యోహన్ తన సోదరి రమణను, కూతురు పల్లవిని సూర్యపేటకు వెళ్లే ఆటో ఎక్కించాడు. అక్కడి నుంచి తిరుమలగిరి వెళ్తానని సోదరి రమణ అన్నతో తెలిపింది. 24న నకిరేకల్ నుంచి మూడేళ్ల కూతురు పల్లవితో బయలుదేరిన రమణ ఇంటికి చేరుకోలేదు. రెండు రోజులుగా ఎదురుచూసిన భర్త ఆదమ్ తన బావమరిది యోహన్‌కు తెలిపాడు. దీంతో శుక్రవారం నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో తన సోదరి, మూడేళ్ల కూతురుతో తప్పిపోయిందని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ సుబ్బరామిరెడ్డి తెలిపారు. -
అక్రమ కేసులు ఎత్తివేయాలి
నకిరేకల్ః హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో అధిక ఫీజులు నియంత్రించాలని కోరుతూ కళాశాల ముందు నిరసన తెలుపుతున్న పీడీఎస్‌యూ విద్యార్థి నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని పీడీఎస్‌యూ డివిజన్ కార్యదర్శి జీడి ప్రవీణ్ డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ నకిరేకల్‌లో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య, నారాయణ కళాశాలల దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు నోముల సతీష్, శ్రవణ్, నాగరాజు, ఉపేందర్, వెంకటేష్, హిమబిందు, మౌనిక, సమత, సౌజన్య, సైదులు, అనీల్ ఉన్నారు. -
నకిరెకల్లో రెచ్చిపోతున్న చైన్‌స్నాచర్లు
చైన్ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకీ శృతిమించుతోంది. మహిళలు ఒంటరిగా కనిపిస్తే పాపం.. వారిపై దాడులకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా అందినకాడికి వారినుంచి విలువైన అభరణాలను అపహరిస్తున్నారు. ప్రతిఘటిస్తే మహిళల ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడటలేదు. దీంతో మహిళలు ఒంటిరిగా బయటకు రావలంటేనే భయపడుతున్నారు. నల్లగొండ జిల్లాలోని నకిరెకల్ ప్రాంతంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గతనెల నుంచి ఆరుగురి మహిళల మెడలోంచి బంగారు చైన్లు లాక్కెళ్లినట్టు పోలీసులు పేర్కొన్నారు. స్నాచర్ల ఆగడాలతో నకిరెకల్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.