సాక్షి, భువనగిరి: నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ మారుతారన్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. లింగయ్య టీఆర్‌ఎస్‌లో చేరితే ఇంతకన్నా ఘోరం ప్రపంచంలో మరొకటి ఉండదని అన్నారు. ఆయనను తన కుటుంబ సభ్యుడిలా భావించి, నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలిపించామని గుర్తుచేశారు. ఆయన పార్టీ మారితే ప్రపంచంలో దీన్ని మించిన మోసం ఇంకోటి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లు పదవిలో లేకున్నా, తమని నమ్మకున్న దళితుడికి అన్యాయం జరగొద్దని అధిష్టానంతో కొట్లాడి టికెట్ దక్కేలా చేశామని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి ప్రాణం పోయిన పార్టీ మారకూడదని, కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేయకుండా వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాజగోపాల్ రెడ్డి కోరారు. (కారెక్కనున్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే!)
కాగా కోమటి రెడ్డి బ్రదర్స్‌కు ప్రధాన అనుచరుడైన చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన కేసీఆర్‌ను కలిసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. లింగయ్యను సంప్రదించడానికి కోమటి బ్రదర్స్ ప్రయత్నించగా ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన పార్టీని వీడితే లోక్‌సభ ఎన్నికలు ముందు ఉమ్మడి నల్గొండలో కోమటి బ్రదర్స్‌కి పెద్ద షాక్ తగిలినట్లే.
Comments
Please login to add a commentAdd a comment