సాక్షి,కామారెడ్డి క్రైం: కామారెడ్డి నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకుని రెండు పర్యాయాలు మంత్రిగా పని చేసిన ఘనతను ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత, కాంగ్రేస్ అభ్యర్ధి షబ్బీర్ అలీ సొంతం చేసుకున్నారు. నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మరెవరికీ ఇప్పటివరకు కేబినెట్‌లో పనిచేసే అవకాశం దక్కలేదు. ఇక్కడి నుంచి మంత్రి పదవిలో కొనసాగిన ఏకైక నేత షబ్బీర్ ఒక్కరే. ఆయన మంత్రిగా పని చేయడమే కాకుండా కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన మరోసారి విజయం సాధిస్తే మూడోసారి మంత్రి పదవిలో గానీ, మరేదైనా ఉన్నత పదవిలోగానీ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.
రెండుసార్లు మంత్రిగా..
1952 నుంచి ఇప్పటివరకు కామారెడ్డి నియోజకవర్గానికి 15 సార్లు ఎన్నికలు జరుగగా, 11 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో ఒక్క షబ్బీర్‌అలీని మాత్రమే మంత్రి పదవి వరించింది. యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయనకు 1989 ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది. అప్పటి వరకు నియోజకవర్గంలో కొనసాగుతున్న తెలుగుదేశం హవాకు షబ్బీర్ బ్రేకులు వేశారు. టీడీపీ అభ్యర్థి యూసుఫ్‌అలీపై భారీ మెజార్టీతో గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన షబ్బీర్‌అలీ తన 37 ఏటనే మర్రి చెన్నారెడ్డి కేబినెట్‌లో మంత్రి అయ్యారు. అప్పటి నుంచే జాతీయ స్థాయిలో పార్టీ ప్రముఖులతో సంబంధాలు పెరిగాయి. ఏఐసీసీలోని ముఖ్య నేతలతో నేరుగా సంబంధాలు కలిగిన నాయకుడిగా పేరు సంపాదించారు. 2004 ఎన్నికల్లో మరోమారు గెలిచిన ఆయన అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో విద్యుత్‌శాఖ మంత్రిగా పని చేశారు. అయిదేళ్ల కాలంలో నియోజకవర్గంలో విద్యుత్ సబ్‌స్టేషన్లు, గోదావరి జలాలు, ఆలయాల అభివృద్ధి, ఇందిరాగాంధీ స్టేడియం, మైనారిటీ గురుకులం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి తనదైన ముద్ర వేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రెండుసార్లు మంత్రిగా పనిచేసి, తన హయాంలో జరిగిన అభివృద్ధిని ఓటర్లకు వివరిస్తూ ప్రస్తుత ఎన్నికల బరిలో ప్రజల్లోకి వెళ్తున్నారు.
మరోసారి గెలిస్తే..
రెండుసార్లు మంత్రి పదవిలో కొనసాగిన షబ్బీర్‌అలీ ఈ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. పలుసార్లు అదృష్టం కలిసి రాలేకపోయినా ఈ సారి మాత్రం ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలిస్తే మరోసారి ఉన్నత పదవి దక్కడం ఖాయమని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment