21 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర | sharmila paramarsha yatra in nalgonda district from january 21 | Sakshi
Sakshi News home page

21 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర

Published Sat, Jan 17 2015 2:23 AM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM

sharmila paramarsha yatra in nalgonda district from january 21

వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 21వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాలో పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్ర తొలివిడతలో భాగంగా జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏడు రోజుల పాటు పర్యటించి 30 కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు.

తొలుత దేవరకొండ నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే ఈ పరామర్శ యాత్ర... మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో సాగనుంది. రెండో విడతలో జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో ఆమె పర్యటిస్తారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో షర్మిల పరామర్శ యాత్ర వాల్‌పోస్టర్‌ను పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

మహానేత వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను ఓదార్చుతానని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటకు కట్టుబడి ఈ యాత్ర సాగుతోందని చెప్పారు. నల్లగొండ జిల్లాలో షర్మిల తొలిసారిగా పర్యటిస్తున్నారని, దీనిని విజయవంతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు ఎర్నేని బాబు, నల్లా సూర్యప్రకాష్, అధికార ప్రతినిధులు కొండా రాఘవరెడ్డి, సత్యం శ్రీరంగం, పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త పి.సిద్ధార్థరెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి, మైనారిటీ విభాగం అధ్యక్షుడు ముజ్తాఫా, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బి.రవీందర్, డాక్టర్స్ సెల్ అధ్యక్షురాలు డా.ప్రఫుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాగా.. పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన వైఎస్సార్ సీపీ డైరీ-2015ను, ఆండ్రాయిడ్ యాప్‌ను ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని, ఈ విషయంలో కార్యకర్తలు, వైఎస్ సానుభూతిపరులు, జగన్ అభిమానులకు ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కాగా.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్ పీర్ల (జేపీ) దర్గాను సందర్శించారు. చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement