పరామర్శ యాత్ర సక్సెస్ | The joy of having kept our promises, is now ours: YS Sharmila | Sakshi
Sakshi News home page

పరామర్శ యాత్ర సక్సెస్

Published Sat, Jan 9 2016 2:21 AM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM

The joy of having kept our promises, is now ours: YS Sharmila

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర విజయవంతమైంది. జుక్కల్ నియోజకవర్గంపిట్లం నుంచి గురువారం మొదలైన రెండో విడత పరామర్శ ఎల్లారెడ్డి నియోజకవర్గం పోతంగల్ కలాన్‌లో శుక్రవారం ముగిసింది. దీంతో తెలంగాణలోని 10 జిల్లాల్లో చేపట్టిన పరామర్శ యాత్ర పూర్తయినట్లు అయ్యింది. మొత్తం 55 రోజులు 8,510 కిలోమీటర్లు తిరిగిన ఆమె 310 మందిని పరామర్శించగా.. శుక్రవారం పోతంగల్ కలాన్‌లో మంగలి నారాయణ కుటుంబాన్ని పరామర్శించడంతో యాత్ర ముగిసింది.

ఈ సందర్భంగా గురు, శుక్రవారంలు రెండు రోజులు జిల్లాలో పర్యటించిన షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ఆమె ఎదురేగి పిల్లలు, పెద్దలు, వృద్ధుల వయోబేధం లేకుండా స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు, బోనాలు, సాంప్రదాయ నృత్యాలతో స్వాగతించారు.
 
యాత్ర సాగింది ఇలా..
జిల్లాలో షర్మిల రెండు రోజుల పరామర్శ యాత్ర గురు, శుక్రవారం రెండు రోజులు సాగింది. చాలా చోట్ల రహదారుల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో షెడ్యూల్‌లో కొద్దిపాటి మార్పులు జరిగినా.. అనుకున్న ప్రకారం రెండో విడతలో ఏడు కుటుంబాలను ఆమె పరామర్శించారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా నారాయణఖేడ్, నిజాంపేట్, మాసన్‌పల్లి మీదుగా పిట్లం వద్ద జిల్లాలోకి చేరుకున్నారు. మొదటి రోజు పిట్లం మండలం చిల్లర్గిలో బట్టు చిన్నబాలయ్య కుటుంబాన్ని కలుసుకున్నారు.

అనంతరం జుక్కల్ మండల కేంద్రంలో మేదరి శిఖామణి కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి బీర్కూరు మండలం దుర్కిలో కుర్మ విఠల్, పాతవర్నిలో ఏలూరు సాయులు కుటుంబాలను పరామర్శించిన ఆమె వర్నిలో గురువారం రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం కోటగిరి మండలం పోతంగల్‌కు చేరుకున్న షర్మిల, అక్కడ గౌరు నడిపి వీరయ్య కుటుంబాన్ని పరామర్శించారు.

అనంతరం గాంధారి మండలం బ్రాహ్మణపల్లికి వెళ్లి నీరడి పోచయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత చివరగా పోతంగల్ కలాన్‌లో మంగలి నారాయణ కుటుంబాన్ని కలిసి భరోసా ఇచ్చారు. ఆ తర్వాత పరామర్శయాత్ర ముగింపు సందర్భంగా పోతంగల్‌కలాన్ గ్రామ శివారులో నిర్మించ తలపెట్టిన పైలాన్‌కు షర్మిల శంఖుస్థాపన చేశారు. అంతకంటె ముందు రాష్ర్ట, జిల్లా నాయకులతో కలిసి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
 
ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతల హాజరు..
ఎంత కష్టమొచ్చినా.. ఎంత నష్టం జరిగినా.. ఎంత దూరమైనా.. ఎంత మారుమూల ఉన్నా.. ప్రతీ గడపకు వెళ్లి కలుసుకున్నందుకు సంతోషంగా ఉందన్న షర్మిల ఇందూరు ప్రజల ఆదరణను మరచిపోలేనన్నారు. పరామర్శ యాత్ర ముగింపు సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నా సంతోషం ఈ రోజు మా సొంతమని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరామర్శయాత్ర ముగించిన గాంధారి మండలం పొతంగల్ కలాన్ గ్రామ శివారులో ఇడుపులపాయలో ఉన్నట్లుగా వైఎస్సార్ ఘాట్, పైలాన్‌ను నిర్మించనున్నట్లు ఆమె చెప్పారు.

ఇందుకోసం ప్రత్యేకంగా ఎకరం భూమిని కొనుగోలు చేశామని, ఇక్కడ ప్రస్తుతానికి వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే ఇక్కడ పైలాన్‌ను నిర్మిస్తామని, పైలాన్‌పై వైఎస్సార్ కోసం మృతి చెందిన వారి పేర్లను ఏర్పాటు చేస్తామన్నారు. పైలాన్ చుట్టూ మొక్కలను నాటి పచ్చని చెట్లను పెంచి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. ఈ ప్రాంతవాసులకు దీవెనగా ఉంటుందని షర్మిల పేర్కొన్నారు. పరామర్శ యాత్ర విజయవంతానికి కృషి చేసిన ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు భీష్మ రవీందర్, రాష్ట్ర కార్యదర్శి భగవంత్‌రెడ్డి, జిల్లా నాయకులు డాక్టర్ నిజ్జన విఠల్, శివారెడ్డి, సంగయ్య, శ్రీధర్‌గౌడ్, రాంమోహన్, నాయుడు ప్రకాష్, బల్గం రవి, గైనిగాడి విజయలక్ష్మి, రామానుజచారి, పీర్‌సింగ్, లక్ష్మయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

‘‘పరామర్శ యాత్ర   విజయవంతానికి కృషి చేసిన ప్రతి నాయకునికి, కార్యకర్తకు కృతజ్ఞతలు. అందరి ఆదరాభిమానాలు మరచిపోలేను.. జగనన్నా నల్లకాల్వల వద్ద ఇచ్చిన మాటను నిలబెట్టినందుకు సంతోషం.. వైఎస్సార్ స్మ­ృత్యర్థం గాంధారి మండలం పొతంగల్ కలాన్‌లో ఇడుపుల       పాయలో ఉన్నట్లుగా వైఎస్సార్ ఘాట్, పైలాన్‌ను నిర్మిస్తాం.. ఈ పైలాన్‌పై వైఎస్సార్ కోసం గుండెపగిలి చనిపోరుున వారి పేర్లు ముద్రిస్తాం..’’
- పరామర్శ యాత్ర ముగింపులో షర్మిల

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement