
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన మేనకోడలు శిఖా చౌదరి స్పష్టం చేశారు. తన మేనమామ ఇంట్లో నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకు వెళ్లలేదని ఆమె తెలిపారు. వాళ్ల ఇంటికి చాలామంది వచ్చి వెళుతుంటారని అన్నారు. శిఖా చౌదరి ’సాక్షి’తో మాట్లాడుతూ..జయరామ్ వ్యక్తిగత విషయాల గురించి తనకు తెలియదని, ఎక్కువగా కంపెనీ వ్యవహారాల గురించి తాము మాట్లాడుకునేవారిమని వెల్లడించారు. తాను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నానని, అయితే జయరామ్‌కు దానితో ఎలాంటి సంబంధం లేదన్నారు.
నేను షాక్ అయ్యాను...
జయరామ్ తనకు ఎప్పుడూ వాట్సాప్ కాల్ చేసేవారని, అలాంటిది ఆయన ఒకసారి ఇండియన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ చేశారని శిఖా చౌదరి చెప్పారు. తనకు అర్జెంట్‌గా కోటి రూపాయలు కావాలని అడగటంతో షాక్ అయినట్లు ఆమె తెలిపారు. తాను రూ.4 కోట్లు అప్పు చేశానని, వాళ్లు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని, అన్ని విషయాలు చెబుతానని చెప్పారన్నారు. అంతలోనే హత్య జరిగిందని శిఖా చౌదరి పేర్కొన్నారు.
కాగా తన భర్త చావుకు శిఖా చౌదిరే కారణమని మృతుడు చిగురుపాటి జయరామ్ భార్య పద్మశ్రీ ఆరోపించారు. అంతేకాకుండా ఈ కేసును తెలంగాణ పోలీసులు విచారణ చేపట్టాలని ఆమె కోరారు. (జయరామ్ హత్య కేసు మొదట్నుంచి మళ్లీ!) జయరామ్ బంధువుల ఫిర్యాదు మేరకు ఈ హత్యకేసును తెలంగాణ పోలీసులు మొదటి నుంచి దర్యాప్తు ప్రారంభించనున్నారు. శిఖా చౌదరిని పోలీసులు విచారించనున్నారు. హత్య వెనక దాగిన కుట్ర, జయరాం కుటుంబం లేవనెత్తిన అనుమానాల నివృత్తిపై పోలీసులు దృష్టి పెట్టారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని హైదరాబాద్ తరలించి, విచారణ జరపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment