శిల్పారామంలో అగ్నిప్రమాదం | Shilpakala fire | Sakshi
Sakshi News home page

శిల్పారామంలో అగ్నిప్రమాదం

Published Sun, Sep 28 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM

శిల్పారామంలో అగ్నిప్రమాదం

శిల్పారామంలో అగ్నిప్రమాదం

  • హస్త కళా స్టాళ్లు దగ్ధం
  • రూ.60 లక్షల ఆస్తి నష్టం
  • మాదాపూర్ : శిల్పారామంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏడు స్టాళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో 14 స్టాళ్లు పాక్షికంగా కాలిపోయాయి. దాదాపు రూ.60 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.  దసరా నేపథ్యంలో హస్తకళా మేళా కోసం శిల్పారామంలో 120 స్టాళ్లను ఏర్పాటు చేశారు. యజమానులు రాత్రి 10 గంటలకే స్టాళ్లను మూసివేసి  వెళ్లిపోయారు. 212 స్టాల్ సమీపంలో రాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి.

    పదినిమిషాల్లోనే ఒక స్టాల్ నుంచి మరో స్టాల్‌కు మంటలు వ్యాపించాయి. దీంతో విలువైన పట్టు చీరలు, ఖాదీ వస్త్రాలు కాలి బూడిదయ్యాయి. మంటలు విస్తరించడంతో స్థానికులు గుర్తించి ఫైరింజన్‌కు సమాచారం ఇచ్చారు. వారు ఐదు నిమిషాల్లో వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.  దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు పండగ కోసం తెచ్చిన సామగ్రిని స్టాళ్లలోనే ఉంచారు. అగ్నిప్రమాదంతో శనివారం శిల్పారామం మూసివే శారు. సాయంత్రం సందర్శకులను అనుమతించారు.
     
    సంఘటన స్థలాన్ని సందర్శించిన ఫైర్ ఆఫీసర్...

    సంఘటన స్థలాన్ని అసిస్టెంట్ డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్ సురేందర్ ఆనంద్ సందర్శించారు. కాలిపోయిన స్టాళ్లను పరిశీలించారు. కాలిపోయిన సామగ్రిని వెంటనే అంచనా వేయలేమన్నారు. కాలిపోయిన స్టాళ్లలోని స్టాక్ వివరాలను శిల్పారామం అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం  రూ. 60 లక్షల ఆస్తి నష్టం జరగవచ్చని అధికారులు భావిస్తున్నారు.
     
    షార్ట్ సర్క్యూటే..

    స్టాల్స్ సమీపంలోని ఫ్యూజ్ బాక్స్ వద్ద విద్యుత్ వైర్లు చిందర వందరగా ఉండటంతో షార్ట్ సర్క్యూట్ అయిఉండవచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. కాగా ఓ యువకుడు మం టలను  చల్లార్చేందుకు యత్నిస్తుండగా అతడి ముఖానికి గాయాలయ్యాయి.
     
    ఏసీ బస్సులో మంటలు

    చాదర్‌ఘాట్: దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ ఏసీ బస్ (ఏపీ 116 7286) టైర్ నుంచి మంటలు వచ్చాయి. బస్సు శనివారం సాయంత్రం లింగంపల్లి నుంచి దిల్‌సుఖ్‌నగర్ వస్తోంది. నల్గొండ క్రాస్‌రోడ్ వద్దకు రాగానే వెనుక టైర్ నుంచి పొగలు, మంటలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ శ్రీనివాస్ వెంటనే బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందకు దించాడు. ఆందోళన చెందిన ప్రయాణికులు కొంతదూరం పరుగుపెట్టగా.. డ్రైవర్ తన వద్ద గల క్యాన్‌లోని నీటిని చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు గంటపాటు వెనుక టైర్‌ల నుంచి పొగలు వచ్చాయి. బేరింగ్‌ల నుంచి మంటలు వచ్చి ఉంటాయని డ్రైవర్ పేర్కొన్నారు.
     
    కారులో ....

    చైతన్యపురి: కారులో ఒక్కసారిగా మంటలు వచ్చి ఇంజిన్ కాలిపోయింది. శంషాబాద్‌కు చెందిన  వ్యాపారి పాషా శనివారం ఎల్‌బీనగర్‌లోని తన స్నేహితుడిని కలిసేందుకు శాంత్రో కారులో వచ్చాడు. 3 గంటల ప్రాంతంలో తిరిగి వెళుతుండగా చైతన్యపురి చౌరస్తా సమీపంలోకి రాగానే కారు ఇంజిన్ నుంచి పొగలు వస్తున్నాయి. బైక్‌పై వెళుతున్న వ్యక్తి ఈ విషయాన్ని కారు నడుపుతున్న పాషాకు చెప్పటంతో రోడ్డు పక్కన ఆపాడు. మంటలు ఎక్కువై పొగలు వ్యాపించాయి. స్థానికులు కొందరు బకెట్లలో నీరు తీసుకొచ్చి మంటలను ఆర్పివేశారు. మలక్‌పేట నుంచి ఫైర్ ఇంజన్ వచ్చేలోపే మంటలు అదుపులోకి వచ్చాయి. కారు ఇంజిన్ భాగం పూర్తిగా కాలిపోయింది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement