సాక్షి, హైదరాబాద్/కంటోన్మెంట్/గచ్చిబౌలి: నగరం సంక్రాంతి సంబురాలకు ముస్తాబవుతోంది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ కైట్, స్వీట్ ఫెస్టివల్‌కు ముస్తాబవ్వగా, శిల్పారామం పల్లెసీమకు వేదికగా నిలవనుంది. శిల్పారామం సోమవారం నుంచి 19 వరకు సంప్రదాయ కళారూపాలను ఆవిష్కరించేందుకు ముస్తాబైంది. ఈ నెల 13 నుంచి 15 వరకు పరేడ్ గ్రౌండ్‌లో ఐదో అంతర్జాతీయ కైట్ అండ్ మూడో స్వీట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్‌లో భాగంగా ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకు పలు కళారూపాల ప్రదర్శన, సాయంత్రం 7 నుంచి రాత్రి 10 వరకు 25 రాష్ట్రాలకు చెందిన వివిధ రకాల కళాప్రదర్శనలు నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
స్వీట్ ఫెస్టివల్..
పాల్గొనేవారు: 22 దేశాల మహిళా హోమ్ మేకర్స్‌తో పాటు 25 రాష్ట్రాలకు చెందిన 2500 మంది హోమ్ మేకర్స్.
ఎన్ని రకాలు: 1,200
ఏఏ రకాలు: తెలంగాణ సంప్రదాయ వంటలు, తమిళనాడు, కేరళ, పంజాబ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రతో పాటు ఇతర దేశాలకు చెందిన మహిళలు తయారు చేసిన స్వీట్లు ప్రదర్శించనున్నారు.
ఇవి ప్రత్యేకం: మధుమేహంతో బాధపడే వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్వీట్లు.
కైట్ ఫెస్టివల్...
వేదిక: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్
నిర్వహణ: పర్యాటక, సాంస్కృతిక శాఖ
తేదీలు: ఈ నెల 13 నుంచి 15 వరకు
కైట్ ఫెస్టివల్‌లో పాల్గొనేవారు: 30 దేశాల నుంచి 100 మందికిపైగా అంతర్జాతీయ స్థాయి కైట్ ప్లేయర్స్, సుమారు 80 దేశవాళీ కైట్ క్లబ్స్ సభ్యులు.
పల్లెసీమలో కళాప్రదర్శనలు...
వేదిక: శిల్పారామంలోని పల్లెసీమ
తేదీలు: ఈ నెల 13 నుంచి 19 వరకు
నేటి ప్రదర్శనలు: ఉదయం నుంచి గంగిరెద్దుల ఆట, హరిదాసులు, బుడబుక్కలు, జంగమదేవర, కొమ్మదాసర్లు, పిట్టల దొర, పులి వేశాలు ప్రదర్శిస్తారు. సాయంత్రం ఆంపీ థియేటర్‌లో కాలిఫోర్నియా నుంచి వచ్చిన కుమారి శరణ్య భరతనాట్యం, ముసునూరి ఇందిరా శిష్య బృందంచే కూచిపూడి నృత్యం, సంక్రాంతి పాటలు ఉంటాయి.
14న: శిల్పారామంలోని నగరాజ్ లాన్‌లో 11 సంవత్సరాల లోపు పిల్లలకు శిల్పారామంలో భోగి పండ్లు పోసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుంచి గంగిరెద్దుల ఆటలతో పాటు జానపద కళాకారులు సందడి చేస్తారు. సాయంత్రం ఆంపీ థియేటర్‌లో స్వర్ణ మంగళంపల్లి బృందం భోగి పాటలు ఆలపిస్తారు. రమణి సిద్ధి బృందం గోదా కళ్యాణం నృత్య రూపకం చేస్తారు.
15న: అందరికీ సెలవు దినం కావడంతో సందర్శకులు ఎక్కువ సంఖ్యలో తరలిరానున్నారు. ఉదయం గంగిరెద్దుల ఆటలు, జానపద కళాకారుల కోలాహలంతో ఆకట్టుకోనున్నారు. సాయంత్రం ప్రియాంక, మేఘన కూచిపూడి నృత్యం, విశాఖ ప్రకాష్ శిష్య బృందం అండాల్ చరిత నృత్య రూపకం ప్రదర్శిస్తారు.
16న: గంగిరెద్దుల ఆటలతో పాటు విభూతి బృందం హరిదాసులు, బుడబుక్కలు, జంగమదేవర, కొమ్మదాసర్లు, పిట్టల దొర, పులివేశాలు ప్రదర్శిస్తారు. రేణుక ప్రభాకర్ గోదా కళ్యాణం, ముంబైకి చెందిన రమేష్ కోలి బృందం భరత నాట్యం ప్రదర్శిస్తారు.
17న: సాయంత్రం చెన్నైకు చెందిన లత రవి బృందం గోదాదేవి నృత్య రూపక ప్రదర్శన.
18న: సాయంత్రం బెంగళూర్‌కు చెందిన అనీల్ అయ్యర్ భరతనాట్యం.
19న: సాయంత్రం బెంగళూర్‌కు చెందిన క్షితిజా కాసరవల్లీ భరత నాట్యం, కుమారి హిమాన్సి కాట్రగడ్డ బృందం కూచిపూడి నృత్యం ప్రదర్శన.
Comments
Please login to add a commentAdd a comment