సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల్లో వరంగల్ రీజియన్ పరిధిలోని జిల్లాలకు చెందిన అభ్యర్థులకు వరంగల్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కంటి సామర్థ్య పరీక్షలు నిర్వహించడం వివాదాస్పదమైంది. ఈ పరీక్షలను వరంగల్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి నిర్వహించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉండగా తమ వద్ద తగిన వసతులు, పరికరాలు లేవంటూ ఒక ప్రైవేటు ఆసుపత్రికి బాధ్యత అప్పగించింది. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నిబంధనలు అతిక్రమించిన ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను మందలించింది. ఆయా ఎస్సై అభ్యర్థులను తక్షణమే హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి పంపాలని వైద్యవిద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి శనివారం ఆదేశించారు. ఇప్పటివరకు ఎంత మంది ఎస్సై అభ్యర్థులకు ప్రైవేటు ఆసుపత్రిలో కంటి సామర్థ్య పరీక్షలు నిర్వహించారన్న దానిపై ఆయన విచారణ చేపట్టారు.
ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో కంటి సామర్థ్యాన్ని గుర్తించే పరికరాలు లేవా? ఒకవేళ లేకుంటే ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కంటి ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించేందుకు ఎందుకు అనుమతించారన్న దానిపై డీఎంఈ విచారణ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయం కూడా వివరాలు తెప్పించుకుంది. మంత్రికి కూడా పలువురు ఫిర్యాదులు చేశారు. దీంతో ఆయన కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇటీవల దాదాపు 1,200 మంది ఎస్సై పోస్టులకు ఎంపికవగా వారికి ప్రస్తుతం దేహదారుఢ్య, కంటి సామర్థ్య పరీక్షలు జరుగుతున్నాయి. అభ్యర్థుల్లో ఎవరికైనా కేన్సర్, గుండె జబ్బులుంటే వారిని ఎస్సై పోస్టుకు ఎంపిక చేసే అవకాశాలు తక్కువ. అలాగే దృష్టిలోపాలు ఉన్న వారిని ఎస్సై పోస్టుకు ఏమాత్రం ఎంపిక చేయరు. ఈ పరీక్షలను తప్పనిసరిగా నిర్ణీత ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయాలి. ప్రభుత్వ వైద్యులే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో వరంగల్‌లోని ప్రాంతీయ కంటి ఆసుపత్రి నిర్వాహకులు కావాలనే చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
‘ప్రైవేటు’లో ఎస్సై ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు!
Published Sun, Jul 28 2019 2:20 AM | Last Updated on Sun, Jul 28 2019 2:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment