సాక్షి, దుబ్బాక: జిల్లాలో త్వరలో ఎన్నికలు జరుగనున్న నాలుగు మున్సిపాలిటీల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. దీంతో వారి తీర్పే కీలకం కానుంది. మున్సిపల్ అధికారులు తాజాగా విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నట్లు లెక్క తేల్చారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలుండగా సిద్దిపేట మినహా దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగైదు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో ఎన్నికల ప్రక్రియ మరింత ఊపందుకుంది.
అధికంగా మహిళా ఉండటంతో మెజార్టీ సంఖ్యలో మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లుగా మహిళలకే అవకాశం దక్కనుంది. మహిళలకు 50 శాతం వాటా ఉండడంతో పురుషుల కంటే మహిళ కౌన్సిలర్లు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి.త్వరలోనే చైర్మన్లు, కౌన్సిలర్లకు రిజర్వేషన్లు ఖరారు కానుండడంతో ఏ మున్సిపాలిటీ చైర్మన్ మహిళకు దక్కుతుందో..? అని మున్సిపల్‌లో ఏ వార్డులు మహిళలకు రిజర్వు అవుతాయోనన్న తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఎన్నికలు జరుగనున్న నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 79,401 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళలు 40,176 మంది, పురుషులు 39,224 మంది ఉన్నారు. దుబ్బాక మున్సిపాలిటీలో పురుష ఓటర్లు 9,785 ఉండగా.. మహిళలు 10,286 మంది ఉన్నారు. ఇక్కడ పురుషుల కంటే 501 మంది మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు. హుస్నాబాద్‌లో 8,665 మహిళలు, 8,407 పురుష ఓటర్లున్నారు.ఇక్కడ 258 మంది మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు. గజ్వేల్‌లో 15,078 మహిళలు, 15,052 పురుష ఓటర్లున్నారు. ఇక్కడ 26 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. చేర్యాలలో 6,147 మంది మహిళలు, 5,918 పురుష ఓటర్లున్నారు. ఇక్కడ 167 మంది మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు.
పై చేయి వారిదే..
గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లో మహిళల ఓట్లే అత్యధికంగా పోల్ కావడంతో త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లోను నారీమణులే కీలకంగా మారనున్నారు. గెలుపు, ఓటము నిర్ణయించడంలో వారిదే కీలక పాత్ర ఉండనుంది. అన్ని మున్సిపాల్టిల్లో మహిళల ఓట్లు అత్యధికంగా ఉండడంతో ఈ ఎన్నికల్లో మహిళల ప్రాధాన్యత ప్రముఖంగా తయారైంది. పోలింగ్ శాతం కూడా గత ఎన్నికల మాదిరిగా మున్సిపల్‌లో కూడ మహిళలదే పై చేయిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా జిల్లాలో పురుషుల కంటే మున్సిపల్ ఎన్నికల్లో మహిళలే కీలకంగా మారడం విశేషంగా చెప్పుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment