సాక్షి, కరీంనగర్: ప్రభుత్వం అమలు చేసే ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు చేర్చే రెండు వ్యవస్థల మధ్య అంతరం పెరుగుతోంది. ప్రభుత్వ పెద్దల వద్ద వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవాలనే ఆలోచన జిల్లా అధికార యంత్రాంగంలో కూడా పెరిగిపోవడంతో ప్రజా ప్రతినిధులతో నిశ్శబ్దయుద్ధం వాతావరణం నెలకొంది. మీటింగులు, ముఖ్యమైన కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి మెలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా... వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తనను అనర్హుడిని చేసేందుకు ఓ అధికారి విపక్ష నాయకుడితో కుమ్మక్కయ్యాడనే ఆరోపణలు చేయడం పరిస్థితికి అద్దం పడుతుంది. కరీంనగర్ నుంచి అధికార పార్టీ తరఫున మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్ ఏకంగా జిల్లా కలెక్టర్‌పైనే ఆరోపణలు చేయడమే గాక, అప్పటి బీజేపీ అభ్యర్థి సంజయ్‌కుమార్‌తో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడిన ఆడియో టేప్‌ను ముఖ్యమంత్రికి పంపించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంతో అధికారులకు, ప్రజాప్రతినిధులకు మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి తీరు వెలుగు చూసింది. ఒక్క కరీంనగర్‌లోనే గాక పెద్దపల్లి జిల్లాలో కూడా ప్రజా ప్రతినిధులు, అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం గమనార్హం. అధికారుల ఏకపక్ష నిర్ణయాలు పెద్దపల్లి జిల్లాలో ప్రజాప్రతినిధులకు మింగుడు పడడం లేదు. ఎంపీపీలు, జెడ్‌పీటీసీలకు జిల్లా స్థాయి అధికారులు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి.
2014 నుంచే గంగులతో అంతరం?
2014లో జిల్లా జాయింట్ కలెక్టర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ వ్యవహరించారు. కార్పొరేషన్‌కు స్పెషల్ ఆఫీసర్‌గా కూడా వ్యవహరించిన ఆయన వద్దకు మునిసిపల్ ఉద్యోగులు ఒక ఫైల్‌పై సంతకం కోసం వెళ్లారు. అప్పటి స్పెషల్ ఆఫీసర్ ఫైల్‌ను తమపైకే విసిరేశారని ఆరోపిస్తూ పెన్‌డౌన్ సమ్మె నిర్వహించారు. ఈ వివాదానికి అప్పటి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పూర్తి సహకారం అందించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందనే వాదన ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్‌తో గంగులకు మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఇటీవల లీకైన సంజయ్–కలెక్టర్ ఆడియో టేప్‌తో వెల్లడవుతోంది.
2017లో రసమయితో ‘డోంట్ టాక్ ’
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన డీజీ–ధన్‌మేళా కార్యక్రమాన్ని 2017 మార్చి 1న కరీంనగర్‌లో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అప్పటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, జిల్లా మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ వినోద్‌కుమార్ ఫొటో ముద్రించకపోవడాన్ని ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్ తప్పుపట్టారు. వేదికపైకి రమ్మన్నా వెళ్లకుండా నిరసన వ్యక్తం చేశారు. తరువాత ఈటల, వినోద్‌కుమార్ పిలవడంతో స్టేజీపైకి వెళ్లిన వీరిద్దరు వినోద్‌కుమార్ ఫ్లెక్సీ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రసమయి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఉద్ధేశించి ప్రభుత్వ కార్యక్రమంలో ఎంపీ ఫొటో పెట్టకపోవడాన్ని తప్పు పడుతూ ప్రశ్నించగా... ఆయన ఎమ్మెల్యేకు కుడిచేతి వేలు చూపిస్తూ... ‘డోంట్ టాక్’ అనడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
పెద్దపల్లిలో పూడ్చలేని అగాధం
పెద్దపల్లి జిల్లాలో సైతం ప్రజా ప్రతినిధులకు అధికారులకు మధ్య అంతరం పూడ్చలేనంతగా పెరిగిందని తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా జిల్లా ముఖ్య అధికారి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పారిశుధ్యంలో జిల్లా నెంబర్‌వన్‌గా మారినట్టు అవార్డులు వస్తున్నా... ఆ క్రెడిట్ ఏదీ ప్రజాప్రతినిధులకు రావడం లేదు. అదే సమయంలో పారిశుధ్య నిర్వహణ కోసం చేస్తున్న కొనుగోళ్ల వ్యవహారం కూడా వివాదాస్పదం అవుతోంది. గ్రామ పంచాయతీలలో పారిశుధ్య నిర్వహణకు 237 ట్రాక్టర్ల కొనుగోలు అంశం మొదలుకొని ప్లాస్టిక్ బుట్టలు, ట్రీ గార్డుల కొనుగోళ్ల వరకు ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండానే నిర్ణయాలు జరిగిపోయినట్లు అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. కీర్తికాంక్షతో ప్రజాప్రతినిధులను పరిగణనలోకి తీసుకోని వైనం పెద్దపల్లి జిల్లాలోనే నెలకొందని ఓ ఎంపీపీ ‘సాక్షి’కి తెలిపారు. జెడ్‌పీటీసీలు, ఎంపీపీలకు ఏమాత్రం విలువ లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు గౌరవ మర్యాదలకు ఢోకా లేకున్నా.. ఎంపీపీ, జెడ్‌పీటీసీల పరిస్థితి పెద్దపల్లికి భిన్నంగా లేదు. అధికారులు, ప్రజా ప్రతినిధులకు మధ్య పెరుగుతున్న అంతరం చివరికి ప్రజలకు అందించే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆ అధికారుల మధ్య నిశ్శబ్ద యుద్ధం!
Published Tue, Nov 19 2019 7:59 AM | Last Updated on Tue, Nov 19 2019 8:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment